Monday, April 29, 2024

భారత్‌లో అత్యంత అవినీతికరమైంది అస్సాం ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపణ
అస్సాంలోకి ప్రవేశించిన భారత్ జోడో న్యాయ్ యాత్ర
పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగం
బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు

శివసాగర్ (అస్సాం) : ‘భారత్‌లో అత్యంత అవినీతికర ప్రభుత్వం అస్సాంలో పని చేస్తోంది’ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గురువారం విమర్శించారు. తన సారథ్యంలో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ నాగాలాండ్ నుంచి అస్సాంలోని శివసాగర్ జిల్లాలో ప్రవేశించగానే రాహుల్ ఈ విమర్శకు దిగడం గమనార్హం. శివసాగర్ జిల్లా హాలోవేటింగ్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తూ, ‘విద్వేషాన్ని వ్యాపింపచేస్తున్నందుకు, ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నందుకు’ అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని, దాని సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)ను తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ‘బహుశా భారత్‌లోనే అత్యంత అవినీతిమయ ప్రభుత్వం అస్సాంలో ఉన్నది.

ఇక్కడ ఏమి జరుగుతోందో మీకు తెలుసు. భారత్ జోడో న్యాయ్ యాత్ర స మయంలో అస్సాం సమస్యలను మేము ప్రస్తావిస్తాం’ అని రాహుల్ పార్టీ కార్యకర్తలతో చెప్పారు. తన యాత్రను ప్రారంభించిన మణిపూర్ గురించి రాహుల్ మాట్లాడుతూ, ఆ పర్వత ప్రాంత రాష్ట్రంలో అంతర్యుద్ధం తరహా పరిస్థితి నెలకొని ఉందని, నిరుడు మే 3 నుంచి అక్కడ జాతుల మధ్య హింసాకాండ సాగుతోందని ఆరోపించారు. ‘మణిపూర్ చీలిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ కనీసం ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదు.

నాగాలాండ్‌లో ఒక పరిధి ఒప్పందంపై (నాగా రాజకీయ సమస్యకు పరిష్కారం సాధించేందుకు ఉద్దేశించినది) తొమ్మిది సంవత్సరాల క్రితం సంతకాలు జరిగాయి. దాని సంగతి ఏమైంది అని ప్రజలు ఇప్పుడు అడుగుతున్నారు’ అని ఆయన తెలిపారు. అటువంటి యాత్రలు కాంగ్రెస్‌కు ఏమాత్రం మేలు చేయవన్న బిజెపి ప్రకటనను రాహుల్ ఖండిస్తూ, ‘భారత్ జోడో యాత్ర’ దేశ ‘రాజకీయ పంథా’ను మార్చివేసిందని తెలియజేశారు. ‘బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ విద్వేషాన్ని వ్యాపింపచేస్తున్నాయి. ఒక వర్గాన్ని మరొక వర్గంతో పోరాడేలా అవి చేస్తున్నాయి.

వాటి ఏకైక కార్యం ప్రజా ధనాన్ని లూటీ చేయడం, దేశాన్ని దోచుకోవడం’ అని ఆయన ఆరోపించారు. బిజెపి పాలిత రాష్ట్రాలు ‘ఆర్థిక, సామాజిక, రాజకీయ అన్యాయాలు ఎదుర్కొంటున్నాయి’ అని, ఆ అంశాలు అన్నిటినీ యాత్రలో ప్రస్తావించగలనని రాహుల్ తెలిపారు. ‘మేము భారత్ జోడో న్యాయ్ యాత్ర’ను మణిపూర్‌లో ప్రారంభించాం. అది మహారాష్ట్ర వరకు కొనసాగుతుంది. భారత్‌లో ప్రతి మతాన్ని, కులాన్ని సంఘటిత పరచడమే కాకుండా న్యాయం చేకూర్చడం ఈ యాత్ర లక్షం’ అని రాహుల్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News