Monday, April 29, 2024

6 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

- Advertisement -
- Advertisement -

Assembly Budget Sessions

 

ఉభయసభలను ఉద్దేశించి మొదటి సారి గవర్నర్ తమిళిసై ప్రసంగం
8 లేదా 10న బడ్జెట్?

మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 6వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శనివారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కంటే ముందు ఈ నెల 5వ తేదీన సిఎం కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. ఈ భేటీలో బడ్జెట్‌కి ఆమోదముద్ర వేయనున్నారు. రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులైన తరువాత తొలిసారిగా తమిళిసై సౌందరరాజన్ 6వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసగించనున్నారు. ఈ నెల 7వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం ఉంటుందని తెలిసింది.

ఈ నెల 8వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక శాఖ మంత్రి టి. హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇక 9వ తేదీన హోళీ సెలవు ఉంది. తరువాత 10 లేదా 11వ తేదీ నుంచి సాధారణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయి. పద్దులపై అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఆమోదిస్తారు. పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)కు వ్యతిరేకంగా ఇప్పటికే కేబినేట్ ఆమోదించిన తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించి, కేంద్రానికి పంపనున్నారు. ఇక ఈ నెల 23వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. గత సంవత్సరం బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్‌లో జరిగాయి. అనంతరం మున్సిపల్ చట్టాన్ని ఆమోదించడానికి రెండు రోజులు ప్రత్యేకంగా సమావేశమైన సభ నిరవధిక వాయిదాపడింది.

జిహెచ్‌ఎంసి చట్టం.. ఎన్‌ఆర్‌ఐ పాలసీ
ఈ అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందులో ముఖ్యంగా రెవిన్యూ చట్టం. ఇప్పటికే దీనిపై సిఎం కెసిఆర్ పలుమార్లు ప్రకటించారు. రైతులకు ఎటువంటి సమస్య లేకుండా రెవిన్యూ చట్టాన్ని తీసుకోస్తామన్నారు. రెవిన్యూ చట్టం చేసేందుకు ముసాయిదాను కూడా సంబంధిత శాఖ సిద్ధం చేసినట్లు తెలిసింది. అయితే ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే దానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. అలాగే గతేడాది కొత్త మున్సిపల్ చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. అందుకు అనుగుణంగా జిహెచ్‌ఎంసి 1955 చట్టాన్ని కూడా సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లోనే అసెంబ్లీలో బిల్లుగా తీసుకురానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే ఎన్‌ఆర్‌ఐ పాలసీని కూడా అసెంబ్లీలో ప్రకటించనున్నారు.

Assembly Budget Sessions begin from 6th
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News