Sunday, May 12, 2024

సిద్ధాంతాన్ని నమ్ముకున్నందుకు పదవి వరించింది

- Advertisement -
- Advertisement -

Bandy Sanjay

 

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేస్తున్న తనను నమ్మి తనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అధిష్టానం కట్టబెట్టిందని బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌కుమార్ ఆదివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు లక్ష్మణ్ నుంచి స్వీకరించారు. రాష్ట్రంలో బిజెపి జెండాను రెపరెపలాడేలా ఎగురవేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. తెరాసకు ప్రత్యామ్నాయ పార్టీ బిజెపి మాత్రమేనని ఆయన పునరుద్ఘాటించారు. భైంసాలో నిరుపేదలకు రక్షణగా నిలుస్తామని భరోసానిచ్చారు. భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ఓటర్లకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముందుగా అసెంబ్లీ సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు బండి సంజయ్ ఘనంగా నివాళులర్పించారు.

సాధారణ కార్యకర్తలకూ బిజెపిలో ప్రాధాన్యత : కిషన్‌రెడ్డి

రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బిజెపి రాష్ట్ర అద్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. సాధారణ కార్యకర్తలకు బిజెపిలో ప్రాధాన్యం ఉంటుందన్నారు. బండి సంజయ్‌కుమార్ ఉదంతమే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. భారతమాత వైభవం, సిద్ధాంతాల కోసం పనిచేసే పార్టీ బిజెపి అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

ప్రజా సమస్య పరిష్కారంలో రాజీలేని పోరు ః లక్ష్మణ్
బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో తెలంగాణలో బిజెపిని ముందుకు నడిపిస్తామని ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామన్న ధీమాను ఆయన కనబర్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బిజెపి రాజీలేని పోరు కొనసాగిస్తుందన్నారు. సామాన్య కార్యకర్తలు కూడా జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగిన పార్టీ బిజెపి మాత్రమేనన్నారు.

అపూర్వ స్వాగతం
నూతన అధ్యక్షుడిగా నగరానికి తొలిసారి విచ్చేసిన బండి సంజయ్‌కుమార్‌కు పార్టీశ్రేణులు అడుగడుగునా అపూర్వ స్వాగతం పలికారు. బిజెపి పార్టీ కార్యాలయం పార్టీ శ్రేణులతో నిండిపోయింది. బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో పార్టీ పటిష్టత సాధ్యపడగలదన్న ఆశాభావం పార్టీ శ్రేణుల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభ సంజయ్ కుమార్‌ని ఆశీర్వదించేందుకు వచ్చిన నేతలతో కిటకిటలాడిపోయింది. పార్టీ శ్రేణులంతా బండి సంజయ్‌ని కలిసేందుకు ఉత్సుకత చూపారు. అత్యంత సందడి వాతావరణం నెలకొంది. బొకేలు, పుష్పగుచ్చాలు తీసుకు రావొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినా చాలా మంది బిజెపి కార్యకర్తలు, బండి అభిమానులు బొకేలు, పుష్పగుచ్చాలతో తరలివచ్చారు. బండి సంజయ్‌కుమార్‌కు పూలమాల వేసి ఫోటో దిగాలని భావించారు. ఆ క్రమంలో పార్టీ ముఖ్య నేతలు మాత్రం బొకేలు, పుష్పగుచ్చాలు వద్దు.. భైంసా బాధితులకు నిధులందించాలని సభాముఖంగా విజ్ఞప్తి చేశారు.

 

Bandy Sanjay assumes duties as BJP state president
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News