Monday, April 29, 2024

చాంపియన్ క్రెజికొవా

- Advertisement -
- Advertisement -

Barbora Krejcikova wins French Open

ఫైనల్లో పవ్లిచెంకొవా ఓటమి, బార్బొరాకు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్

పారిస్: ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో చెక్ క్రీడాకారిణి బార్బొరా క్రెజికొవా చాంపియన్‌గా నిలిచింది. శనివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో క్రెజికొవా రష్యాకు చెందిన 31వ సీడ్ అనస్తాసియా పవ్లిచెంకొవాను ఓడించి తన ఖాతాలో తొలి సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జమ చేసుకుంది. మరోవైపు ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని భావించిన రష్యా వెటరన్ క్రీడాకారిణి పవ్లిచెంకొవా రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో బార్బొరా క్రెజికొవా 61, 26, 64తో పవ్లిచెంకొవాను ఓడించింది. తొలి సెట్‌లో క్రెజికొవా ఆధిపత్యం చెలాయించింది. పవ్లిచెంకొవాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌పై పట్టుబిగించింది. చూడచక్కని షాట్లతో అలరిస్తూ లక్షం దిశగా అడుగులు వేసింది. మరోవైపు పవ్లిచెంకొవా ఏ దశలోనూ క్రెజికొవాకు పోటీ ఇవ్వలేక పోయింది. ఆఖరు వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన క్రెజికొవా అలవోకగా సెట్‌ను సొంతం చేసుకుంది.

సీన్ రివర్స్..

మరోవైపు రెండో సెట్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈసారి పవ్లిచెంకొవా జోరును ప్రదర్శించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. కళ్లు చెదిరే షాట్లతో క్రెజికొవాను ఉక్కిరిబిక్కిరి చేసింది. పవ్లిచెంకొవా ఎదురు దాడికి దిగడంతో క్రెజికొవా తీవ్ర ఒత్తిడికి గురైంది. ఇదే సమయంలో ఆటపై పట్టు కోల్పోయింది. అంతేగాక వరుస తప్పిదాలకు పాల్పడుతూ ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం కల్పించింది. ఇక అసాధారణ ఆటతో అలరించిన పవ్లిచెంకొవా అలవోకగా సెట్‌ను గెలిచి స్కోరును సమం చేసింది. ఇద్దరు చెరో సెట్ గెలవడంతో ఆఖరి సెట్‌పై అందరి దృష్టి నెలకొంది. ఇందులో కూడా ఇటు క్రెజికొవా అటు పవ్లిచెంకొవా హోరాహోరీగా తలపడ్డారు ఇద్దరు ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు.

దీంతో ఆసక్తికర పోరు కొనసాగించింది. ఒక దశలో పవ్లిచెంకొవా పైచేయి సాధించేలా కనిపించింది. కానీ కీలక సమయంలో క్రెజికొవా తన మార్క్ షాట్లతో విరుచుకు పడింది. దూకుడుగా ఆడుతూ పవ్లిచెంకొవాకు ముచ్చెమటలు పట్టించింది. అంతేగాక సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక రష్యా స్టార్ పవ్లిచెంకొవాకు నిరాశే మిగిలింది. ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో తొలి రోజు నుంచే అనూహ్య ఫలితాలు నమోదయ్యాయి. సీడెడ్ క్రీడాకారిణిలు ఒక్కొక్కరే ఇంటిదారి పట్టారు. చివరికి ఓ అన్‌సీడెడ్ క్రీడాకారిణి ఈసారి కొత్త చాంపియన్‌గా అవతరించింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన క్రెజికొవా ఏకంగా టైటిల్ సాధించి పెను సంచలనమే సృష్టించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News