Monday, April 29, 2024

అర్ధరాత్రి వరకు బార్లా…

- Advertisement -
- Advertisement -

నిబంధనలు భేఖాతర్ చేస్తున్న పబ్బులు
పీకలదాకా మద్యం సేవిస్తున్న మందుబాబులు
మద్యం మత్తులో డ్రైవింగ్…ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు
అత్యధిక పబ్బులు రాజకీయ నాయకులవే

మనతెలంగాణ, సిటిబ్యూరో: నగరంలోని పబ్బులు నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తుండడంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. పబ్బులు సాధారణ రోజుల్లో రాత్రి 11.30 గంటలకు మూసివేయాలని, వీకెండ్‌లో రాత్రి 12.30 వరకు మూసి వేయాలని పోలీసులు నిబంధనలు విధించారు. వీకెండ్ సమయం కూడా గత మూడేళ్ల క్రితం పెంచారు, చాలా మంది ఉద్యోగులు వారం అంతా పనిచేసి ఉంటారు కాబట్టి రిలాక్స్ అయ్యేందుకు ఈ మినహాయింపు ఇచ్చారు. దీనిని ఆసరాగా చేసుకుని చాలా పబ్బులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. మూసివేసే సమయం ముగిసినా పబ్బులు తెరిచే ఉంచుతున్నారు. దీంతో మందుబాబులు పీకల దాకా మద్యం తాగి వాహనాలను వేగంగా నడుపుతూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. వీరి వల్ల నగరంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరగడంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

మాదాపూర్ సైబర్ టవర్ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కంట్రీ క్లబ్ మేనేజర్ భార్యతో కలిసి బైక్‌పై వెళ్తుండగా మద్యం మత్తులో కారు వేగంగా నడుపుకుంటు వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మేనేజర్ భార్యకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. మరో సంఘటనలో కొండాపూర్‌లో బైక్‌పై వెళ్తున్న దంపతులను మద్యం తాగి బిఎండబ్లూ కారుతో రాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఐకియా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆడి కారులో వెళ్తున్న యువకులు మద్యం మత్తులో కారును వేగంగా నడిపి ఆటోను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు.

ఈ కేసులో నిందితుడిని తప్పించేందుకు తండ్రి యత్నించడంతో పోలీసులు అప్రమత్తమై కేసు నమోదు చేశారు. మరోసంఘటనలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద జరిగిన కారు ప్రమాదంలో యువతి మృతిచెందింది. యువతి, యువకుడు స్నేహితులు ఇద్దరు కలిసి అర్ధరాత్రి వరకు పబ్బులో మద్యం తాగి వేగంగా కారు నడపడంతో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కెనడాలో ఎంఎస్ చేస్తున్న ఆశ్రిత అనే యువతి మద్యం తాగి వేగంగా కారు నడపడంతో రోడ్డుపై పడి మృత్యువాతపడింది. బోనాల సందర్భంగా మద్యం షాపులు, పబ్బులు, వైన్స్ మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. అయినా కూడా స్నార్ట్ పబ్బు యజమానాలు మాత్రం నిబంధనలు పట్టించుకోకుండా మద్యం విక్రయించారు. స్నేహితులతో కలిసి మద్యం తాగి కారును వేగంగా నడపడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి తర్వాత జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో పబ్బుల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి వల్లే జరుగుతున్నాయి.

ఏమిచేయలేని స్థితిలో పోలీసులు…

నగరంలోని ఉన్న పబ్బుల్లో ఎక్కువగా రాజకీయ నాయకులవే కావడంతో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించవలిసి వస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన పబ్బులపై జరిమానా విధించేవరకే పోలీసులకు అధికారం ఉంది. వాటిని లైసెన్స్ రద్దు తదితర విషయాలను ఎక్సైజ్ శాఖ పరిధిలోకి వస్తుంది. ఆ శాఖ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. వారికి ముట్టాల్సినవి ముడితే ఎవరు ఎక్కుడ చచ్చినా పట్టించుకోవడంలేదు. ఒక వేళ పోలీసులు పబ్బులపై ఒత్తిడి పెడితే సదరు రాజకీయనాయల నుంచి పై స్థాయి అధికారులకు ఫోన్లు వస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. సైబరాబాద్ పోలీసులు మాత్రమే కొంచెం కఠినంగా వ్యవహరిస్తున్నారు. బంద్ సమయంలో మద్యం విక్రయించిన పబ్బు యజమాని, మేనేజర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పబ్బుల్లో ఎలాంటి గొడవలు, రేవ్‌పార్టీలు జరిగినా ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News