Monday, April 29, 2024

కివీస్‌తో టెస్టులకు టీమిండియా ఎంపిక..

- Advertisement -
- Advertisement -

BCCI Announces team for Test Squad against NZ

కివీస్‌తో టెస్టులకు టీమిండియా ఎంపిక
సీనియర్లకు విశ్రాంతి, అయ్యర్, భరత్‌లకు స్థానం
ముంబై: న్యూజిలాండ్‌తో టెస్టుల్లో తలపడే టీమిండియాను భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) శుక్రవారం ప్రకటించింది. తొలి టెస్టుకు విరాట్ కోహ్లి దూరమయ్యాడు. అతని స్థానంలో టీమిండియా సారథ్య బాధ్యతలను అజింక్య రహానె చేపట్టనున్నాడు. తొలి టెస్టులో రహానె కెప్టెన్‌గా, చటేశ్వర్ పుజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఇక రెండో టెస్టులో తిరిగి విరాట్ కోహ్లి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడు. మరోవైపు తెలుగుతేజం, ఆంధ్రా క్రికెటర్ కెఎస్. భరత్‌కు టీమిండియాలో చోటు దక్కింది. వికెట్ కీపర్‌గా అతన్ని ఎంపిక చేశారు. వృద్ధిమాన్ సాహా ఈ సిరీస్‌లో ప్రధాన వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. రిషబ్ పంత్‌కు ఈ సిరీస్‌లో విశ్రాంతి ఇచ్చారు. ఇక యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు తొలిసారి టెస్టు జట్టులో స్థానం లభించింది. ఇప్పటికే అయ్యర్ టి20 సిరీస్‌కు కూడా ఎంపికైన విషయం తెలిసిందే. కాగా, సీనియర్లు రోహిత్ శర్మ, మహ్మద్ షమి, జస్‌ప్రిత్ బుమ్రా తదితరులకు టెస్టు సిరీస్‌లో విశ్రాంతి కల్పించారు.

సుదీర్ఘ కాలంగా వీరంతా విరామం లేకుండా క్రికెట్‌ను ఆడుతున్నారు. దీంతో వీరికి న్యూజిలాండ్ సిరీస్‌లో విశ్రాంతి ఇచ్చారు. రిషబ్ పంత్‌ను కూడా సిరీస్‌కు ఎంపిక చేయలేదు. సీనియర్ బౌలర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లు టెస్టు జట్టుకు ఎంపికయ్యారు. జయంత్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు కూడా జట్టులో చోటు సంపాదించారు. మూడో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్‌ను తీసుకున్నారు. ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, కెఎల్.రాహుల్‌లను ఎంపిక చేశారు. అయితే హనుమ విహారికి ఈసారి టెస్టు జట్టులో స్థానం దక్కలేదు. అతని స్థానంలో ఆంధ్రాకు చెందిన కెఎస్.భరత్‌ను జట్టుకు ఎంపిక చేశారు. మరోవైపు కివీస్‌తో రెండు టెస్టుల్లో భారత్ తలపడనుంది. భారత్ చివరి సారిగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో పాల్గొంది. ఆ తర్వాత మళ్లీ కివీస్‌తో టెస్టుల్లో తలపడనుంది. ఇక సిరీస్‌లో గెలవడం ద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఇక న్యూజిలాండ్‌పై భారత్‌కు సొంత గడ్డపై తిరుగులేని రికార్డు ఉంది.

ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. కీలక ఆటగాళ్లు లేకున్నా భారత్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అశ్విన్, జడేజాలతో భారత బౌలింగ్ చాలా బలంగా ఉంది. స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లలో వీరు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. పుజారా, రాహుల్, రహానె, గిల్, మయాంక్ తదితరులతో బ్యాటింగ్ కూడా బలంగానే ఉంది. దీంతో టీమిండియా సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
జట్టు వివరాలు: అజింక్య రహానె (కెప్టెన్), చటేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, మయాంగ్ అగర్వాల్, కెఎల్.రాహుల్, శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా, కెఎస్.భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, మహ్మద్ సిరాజ్. ప్రసిద్ధ్ కృష్ణ, ఉమేశ్ యాదవ్.

BCCI Announces team for Test Squad against NZ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News