Sunday, April 28, 2024

పొమ్మనలేక పొగపెట్టారా?

- Advertisement -
- Advertisement -

BCCI sacks Virat Kohli as ODI captain

 

ముంబై: టీమిండియాలో ఎదురులేని శక్తిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లికి భారత క్రికెట్ బోర్డు ఊహించని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించారు. వచ్చే వన్డే ప్రపంచకప్ వరకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కెప్టెన్‌గా కొనసాగించాలని భావించిన కోహ్లికి బిసిసిఐ తీసుకున్న నిర్ణయం మింగుడు పడడం లేదు. వచ్చే వరల్డ్‌కప్‌లో టీమిండియాను విజేతగా నిలిపి తనకు అందని ద్రాక్షగా ఉన్న ఐసిసి ట్రోఫీ లోటును తీర్చుకోవాలని కోహ్లి భావించాడు. కానీ బిసిసిఐ పెద్దలు మాత్రం కోహ్లికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అతన్ని వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు.

భారత క్రికెట్‌పై తనదైన ముద్రను వేసిన విరాట్‌కు ఇలాంటి చేదు అనుభవం ఎదురవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. అయితే బిసిసిఐ మాత్రం అనూహ్య నిర్ణయంతో పెను ప్రకంపనలు సృష్టించింది. ట్వంటీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లి స్వచ్ఛందంగా వైదొలిగాడు. మరికొంత కాలం పాటు టి20 కెప్టెన్‌గా కొనసాగాలని బిసిసిఐ పెద్దలు విజ్ఞప్తి చేసినా అతను పట్టించుకోలేదు. తన నిర్ణయానికి కట్టుబడి సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఇక కోహ్లి నిర్ణయాన్ని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పరోక్షంగా తప్పుపట్టాడు. టి20, వన్డేలకు ఒకరే కెప్టెన్‌గా ఉండాలని తాము కోహ్లికి సూచించామని, అయితే తమ అభ్యర్థనను అతను పట్టించుకోలేదని గంగూలీ ప్రకటించాడు. దీన్ని బట్టి కోహ్లిని తప్పించడంలో గంగూలీ హస్తం ఉందనే విషయం స్పష్టమవుతోంది.

ఏదో జరిగింది..

ఇదిలావుండగా కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి హుటాహుటినా తప్పించడంలో ఉన్న మతలబు ఏంటో ఇప్పటి వరకు అంతుబట్టడం లేదు. సౌతాఫ్రికా సిరీస్ వరకు వేచి ఉండి ఆ తర్వాత కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించి ఉంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండేదికాదు. కానీ సిరీస్ ఆరంభానికి ముందే బిసిసిఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కోహ్లి సయితం తనకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించి ఉండడు. తనను టెస్టు కెప్టెన్సీకే పరిమితం చేస్తూ బిసిసిఐ తీసుకున్న నిర్ణయాన్ని అతను జీర్ణించుకోలేక పోతున్నాడు. ఇలాంటి స్థితిలో కోహ్లి త్వరలోనే టెస్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పినా ఆశ్చర్యం లేదు. భారత క్రికెట్‌కు లభించిన అత్యుత్తమ క్రికెటర్లలో కోహ్లి ఒకడు. అతను లేని టీమిండియాను ఊహించుకోవడం కష్టమే. కానీ అంతటి ప్రతిభావంతుడైన కోహ్లి కొంతకాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. జట్టు విజయాలు సాధిస్తున్నా తాను మాత్రం బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేక పోతున్నాడు.

అంతేగాక వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీల్లో కెప్టెన్‌గా సత్తా చాటడంలో విఫలమవుతున్నాడు. దీంతో అతన్ని పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పించడమే మేలనే నిర్ణయానికి బిసిసిఐ వచ్చింది. అందుకే కోహ్లికి షాక్ ఇస్తూ సెలెక్టర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక పరిస్థితులను గమనిస్తే కోహ్లి ఎక్కువ రోజుల ఆటలో కొనసాగుతాడా లేదా అనేది సందేహంగా మారింది. బోర్డు నిర్ణయంతో ఎంతో మనో వేదనకు గురైన కోహ్లి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని అతని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇక బిసిసిఐ నిర్ణయంపై కోహ్లి అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బిసిసిఐలోని కొందరు పెద్దలు కావాలనే కోహ్లిని అవమానించారని వారు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News