Monday, April 29, 2024

స్విమ్స్ లో అన్ని రకాల క్యాన్సర్లకు అత్యుత్తమ చికిత్స : టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి

- Advertisement -
- Advertisement -

తిరుపతి: శ్రీ వెంకటేశ్వర వైద్య శాస్త్రాల సంస్థ(స్విమ్స్)లో ఏర్పాటు చేస్తున్న శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ (క్యాన్సర్ హాస్పిటల్) లో అన్ని రకాల క్యాన్సర్లకు అత్యుత్తమ వైద్య చికిత్సలు అందించేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని టీటీడీ ఈవో  ఎవి ధర్మారెడ్డి చెప్పారు. ఇందుకోసం అత్యాధునిక వైద్య వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.

తిరుపతి జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ( సి హెచ్ ఓ)మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు ( ఎం ఎల్ హెచ్ పి) లకు శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో జూలై 13 నుంచి 22వ తేదీ వరకు క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్ పరీక్షల పై శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈవో  ఎవి ధర్మారెడ్డి ముఖ్య అతిథిగాపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్యాన్సర్ వల్ల దేశంలో ఏటా 7 లక్షల మంది చనిపోతున్నారని చెప్పారు. క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తించడం, సరైన చికిత్స అందించడం ఈ సమస్యను అధిగమించడానికి మార్గాలన్నారు.

నేటి పరిస్థితుల్లో మానవాళి తీసుకుంటున్న ఆహారం, జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం కూడా క్యాన్సర్ వ్యాధి అంతకంతకు పెరగడానికి ఒక కారణమని చెప్పారు. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులతో పండిస్తున్న ఉత్పత్తులవల్ల ఆ అవశేషాలు మానవ శరీరంలోకి వెళ్లి క్యాన్సర్ రావడానికి మరో కారణం అవుతున్నాయన్నారు. దీంతోపాటు రోజుకు పెరిగిపోతున్న ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు కూడా క్యాన్సర్ ప్రబలడానికి కారణమవుతున్నాయన్నారు. మానవులు రోగాల బారిన పడకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ రకమైన జీవనవిధానం అలవర్చుకోవాలనే విషయాలు పతంజలి మహర్షి యోగ శాస్త్రంలో వివరించారన్నారు. యోగా ద్వారా మెదడును బలోపేతం చేసుకుంటే శరీరాన్ని నియంత్రించుకోవచ్చన్నారు.
ప్రాణాయామం, యోగా కు సంబంధించి శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆచార్యుల చేత మరో శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు.

గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ ను దూరం చేయవచ్చునని ఈవో చెప్పారు. ఈ విషయాలన్నింటి మీద శిక్షణ ఇప్పిస్తామని, వాలంటీర్ల సహాయంతో ఎం హెచ్ ఓ లు, ఎం ఎల్ హెచ్ పి లు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను క్యాన్సర్ రహిత ప్రాంతంగా తయారు చేయడానికి చేపట్టిన మహత్తర కార్యక్రమానికి టీటీడీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. జిల్లాలో మూడు ప్రాంతాల్లో క్యాన్సర్ గుర్తింపు కేంద్రాలను శాశ్వతంగా ఏర్పాటు చేస్తామన్నారు. రెండు పింక్ బస్ లను అందించి అందులో డాక్టర్ సహా ఇతర అన్ని వసతులు సమకూరుస్తామని ఆయన తెలిపారు.

జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, క్యాన్సర్ ప్రపంచానికి పెద్ద ముప్పు కాబోతోందని చెప్పారు జిల్లా జనాభాలో 10 శాతం మంది క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నట్లు ప్రాథమిక అంచనా ఉందని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే తొలిసారి తిరుపతి జిల్లాలో ఇంటింటా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ వ్యాధి బారిన పడిన వారికి తగిన వైద్య చికిత్సలు అందిస్తామన్నారు.

ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి, ఈవో  ఎవి ధర్మారెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని చెప్పారు. క్యాన్సర్ లక్షణాలు ఉన్న వారితో పాటు, లక్షణాలు లేకుండా కూడా క్యాన్సర్ బారిన పడిన వారిని గుర్తించి తొలి దశలోనే చికిత్సలు అందించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు. టాటా క్యాన్సర్ హాస్పిటల్, స్విమ్స్, జిల్లా అధికార యంత్రాంగం తో చర్చించి ఇందుకు సంబంధించిన మాడ్యూల్స్ తయారు చేసినట్లు చెప్పారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను జిల్లాలో ప్రతి వ్యక్తికి అవగాహన కల్పించి, లక్షణాలు లేకుండా క్యాన్సర్ సోకిన వారిని కూడా గుర్తించేలా క్షేత్రస్థాయిలో చిత్త శుద్ధితో పని చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

టీటీడీ అందిస్తున్న పింక్ బస్సుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారని, ఏఎన్ఎంలు, వాలంటీర్ల సహాయంతో జిల్లాలో ప్రతి ఒక్కరిని పింక్ బస్సు దగ్గరికి తీసుకుని వచ్చి పరీక్షలు చేయించాలన్నారు. రోగిని గుర్తించడం నుండి చికిత్స పూర్తి అయ్యే వరకు అన్ని వివరాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక యాప్ ను రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. శిక్షణలో పాల్గొన్న ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొని తిరుపతి ని క్యాన్సర్ రహిత జిల్లాగా ప్రకటించేలా పని చేయాలని ఆయన కర్తవ్య బోధ చేశారు.

టీటీడీ జేఈవో, స్విమ్స్ డైరెక్టర్  సదా భార్గవి మాట్లాడుతూ, సిహెచ్ ఓ లు, ఎం ఎల్ హెచ్ పిలకు అందిస్తున్న శిక్షణా కార్యక్రమం సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి, టీటీడీ ఈవో  ధర్మారెడ్డి ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. జిల్లాలో గూడూరు, శ్రీకాళహస్తి, చంద్రగిరి ప్రాంతాల్లో క్యాన్సర్ వ్యాధిని గుర్తించడానికి శాశ్వత కేంద్రాలను ఏర్పాటు చేయడానికి టీటీడీ నిర్ణయించిందన్నారు. గ్రామాల్లో మహిళలు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ, దాన్ని గుర్తించలేక స్క్రీనింగ్ పరీక్షలకు రావడానికి ఇష్టపడడం లేదన్నారు. అలాంటి వారికి అవగాహన కల్పించి స్క్రీనింగ్ పరీక్షలు చేయించడానికి సిహెచ్ ఓ లు , వాలంటీర్లు కృషి చేయాలని చెప్పారు. టీటీడీలో ఇటీవల 15 వందల మంది మహిళా ఉద్యోగులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించామన్నారు. తిరుపతిని క్యాన్సర్ రహిత జిల్లాగా తయారు చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు.

శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చరణ్ బి సింగ్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజు, బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ప్రత్యేకాధికారి డాక్టర్ జయచంద్రా రెడ్డి, స్విమ్స్ రిజిస్ట్రార్  అపర్ణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీహరి, జిల్లా కార్యక్రమ నిర్వాహక అధికారి డాక్టర్ శ్రీనివాసరావు,  వేంకటేశ్వర వైద్యకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఈవో, కలెక్టర్, జేఈవో ఈ కార్యక్రమానికి సంబంధించిన మాడ్యూల్స్ పుస్తకాలను ఆవిష్కరించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News