Sunday, April 28, 2024

ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ‘భూదాన్ పోచంపల్లి’

- Advertisement -
- Advertisement -

యూఎన్‌డబ్ల్యూటిఓ నిర్వహించే
‘బెస్ట్ టూరిజం విలేజ్’ పోటీల్లో విజేతగా…
పోచంపల్లికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
మేఘాలయ, మధ్యప్రదేశ్‌లను వెనక్కినెట్టిన
ముందువరుసలో నిలిచిన ‘భూదాన్ పోచంపల్లి’
సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తోంది. కాకతీయ కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ఓరుగల్లు రామప్ప దేవాలయానికి యునెస్కో ఇటీవలే ప్రపంచ వారసత్వ హోదాను కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటిఓ) నిర్వహించే ‘బెస్ట్ టూరిజం విలేజ్’ పోటీల్లో భారత్ తరపున రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా ‘భూదాన్ పోచంపల్లి’ గ్రామం గెలుచుకుంది. ఈనేపథ్యంలో భూదాన్ పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

భారత్ నుంచి మూడు గ్రామాలకు ఎంట్రీ

యూఎన్‌డబ్ల్యూటిఓ నిర్వహించిన ‘బెస్ట్ టూరిజం విలేజ్’ పోటీలో భారత్ నుంచి మూడు గ్రామాలు ఎంట్రీ సంపాదించగా కాంటెస్ట్‌లో మేఘాలయలోని విజిలింగ్ విలేజ్‌గా ప్రఖ్యాతిగాంచిన ‘కాంగ్‌థాన్, మధ్యప్రదేశ్‌లోని చారిత్రాత్మక గ్రామం ‘లదురాబాస్’, తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో ఉన్న ‘భూదాన్ పోచంపల్లి’ గ్రామాలు పోటీ పడగా చివరగా ‘భూదాన్ పోచంపల్లి’యే ఉత్తమ ప్రపంచ పర్యాటక ప్రాంతంగా గెలుచుకుంది. గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ఐరాస నిర్వహిస్తున్న పోటీలతో ప్రపంచవ్యాప్తంగా ఆయా గ్రామాలకు గుర్తింపు లభిస్తోంది. డిసెంబర్ 02వ తేదీన స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ‘భూదాన్ పోచంపల్లి’ గ్రామానికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఇప్పటికే పోచంపల్లిలో నేసే ఇక్కత్ చీరలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించగా, మరోమారు ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైన భూదాన్ పోచంపల్లి పేరు అంతర్జాతీయ స్థాయిలో పేరు రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి కెటిఆర్ అభినందనలు

భూదాన్ పోచంపల్లికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పోచంపల్లి గ్రామానికి చెందిన ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.

ప్రజల జీవన శైలిని వినూత్న పద్ధతిలో….

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా గ్రామీణ పర్యాటకాన్ని, అక్కడ నివసిస్తున్న ప్రజల జీవన శైలిని వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా యూఎన్‌డబ్ల్యూటిఓ ‘బెస్ట్ టూరిజం విలేజ్’ పోటీలను నిర్వహిస్తోంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సాహకం, మౌలిక వసతుల కల్పించాలన్న ఉద్ధేశ్యంలో భాగంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు యూఎన్‌డబ్ల్యూటిఓ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
100 ఎకరాల భూమి దానం
రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో భూదాన్ పోచంపల్లి గ్రామం ఉంది. 1951లో మహాత్మా ప్రియశిష్యుడు ఆచార్య వినోభాబావే చేపట్టిన పాదయాత్ర ద్వారా దేశంలో ఒక కొత్త శకానికి ఈ ప్రాంతం నాంది పలికింది. ఇక్కడి భూదాత వెదిరె రామచంద్రారెడ్డి వినోభాబావే పిలుపు మేరకు హరిజనులకు 100 ఎకరాల భూమి దానం చేశారు. అనంతరం ఈ కార్యక్రమాలను విస్తృతం చేస్తూ సుమారు 44 లక్షల ఎకరాల భూమిని దాతల నుంచి సేకరించి భూమిలేని పేదలకు పంచి పెట్టారు. అలా మాములు పోచంపల్లిగా ఉన్న ఈ గ్రామం భూదానోద్యమంతో ‘భూదాన్ పోచంపల్లి‘గా మారింది.

‘సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా’గా పేరు

అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలే కాదు నాటి నిజాంతో పాటు ఇతర అరబ్ దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసిన పోచంపల్లి ప్రాంతం రానురాను ఇక్కడి చేనేత కళాకారుల ప్రతిభతో ‘సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా’గా పేరు తెచ్చుకుంది. పోచంపల్లి చేనేత కళాకారులు వేసిన అనేక రకాల ఇక్కత్ వస్త్రాలకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది.

మేఘాలయలో కాంగ్థాన్ గ్రామం

మేఘాలయలో కాంగ్థాన్ గ్రామం ఉంది. ఈ గ్రామంలోని ప్రజలందరూ ఈల భాషను వాడుతుంటారు. ఇతరుల పేర్లను పిలవడానికి ఈల వేస్తారు. 700 జనాభా కలిగిన కాంగ్థాన్ గ్రామంలో ఎవరికీ పేర్లు ఉండవు. గర్భం దాల్చాక కడుపులో ఉన్న బిడ్డ కోసం కాబోయే తల్లిదండ్రులు ఒక ఈల పాటను సిద్ధం చేసుకుంటారు. బిడ్డ పుట్టిన తర్వాత ఆ ట్యూన్‌తోనే ఆ పాపను పిలుస్తారు. గ్రామంలోని ప్రజలు కూడా ఆ బిడ్డను ఆ ఈల పాటతోనే పిలవాల్సి ఉంటుంది. ఈ సంప్రదాయం వెనుక రెండు కారణాలు ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు. కాంగ్థాన్ ప్రజలకు వ్యవసాయంతో పాటు జంతువుల వేట ప్రధాన వృత్తి. జంతువులను వేటాడేటప్పుడు ప్రమాదం పొంచి ఉన్న తోటివారిని అప్రమత్తం చేసేందుకు పేర్లను వాడేవారు. దీంతో మనుషుల గొంతును పసిగట్టిన జంతువులు దాడులకు తెగబడేవి. అందులో భాగంగానే పక్షుల రాగాలకు దగ్గరగా మనుషుల పేర్లను ఈల పాటలతో అక్కడ పిలవడం మొదలుపెట్టారు.

మధ్యప్రదేశ్‌లోని లద్‌పురా ఖాస్

మధ్యప్రదేశ్‌లోని టికంగఢ్ జిల్లాలోని ఓర్చా తాసిల్లో లద్‌పూరా బాస్ ఉంది. గ్రామీణ ఆచార, వ్యవహారాలతో పాటు చారిత్రాత్మక ఆనవాళ్లతో ఈ గ్రామం రూపుదిద్దుకుంది. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన బుందేల్‌ఖండ్‌లో క్రీ.శ. 1501లో రుద్రప్రతాప్ సింగ్, ఓర్చా తాసిల్, లదూరాబాస్‌లు నిర్మించినట్టుగా అక్కడి స్థానికులు పేర్కొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News