Monday, April 29, 2024

‘బిగ్‌బాస్’ పల్లవి ప్రశాంత్ కేసు – మరో ముగ్గురు నిందితులు అరెస్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. సరూర్‌నగర్‌కు చెందిన విద్యార్థి అవినాష్ రెడ్డి, యూసఫ్‌గూడకు చెందిన సుధాకర్, ఇందిరానగర్‌లో ఓ ఆస్పత్రిలో ఆఫీస్ బాయ్‌గా పని చేస్తున్న పవన్ అనే మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించగా చంచల్‌గూడ జైలుకు తరలించారు. బిగ్‌బాస్ విజయం అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలో పల్లవి ప్రశాంత్ సహా అతని అభిమానులు హంగామా సృష్టించారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేశారు.

ఈ ఘటనపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు ఒక కేసులో పల్లవి ప్రశాంత్ సహా 5గురు వ్యక్తులను, మరో కేసులో నలుగురు మైనర్లు సహా 16 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాగా నమోదైన రెండు కేసుల్లో ఇప్పటి వరకూ పల్లవి ప్రశాంత్ సహా 24 మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ విడుదలయ్యారు. నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్‌కు శుక్రవారం బెయిల్ మంజూరు చేయగా, జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసులో భాగంగా ప్రతి నెల ఒకటి, 16వ తేదీ జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరు కావాలని, రూ.15 వేల చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని నాంపల్లి కోర్టు ప్రశాంత్‌ను ఆదేశించింది.

బిగ్‌బాస్-7 ఫైనల్స్ నేపథ్యంలో ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానుల మధ్య వివాదం జరిగింది. టైటిల్ విజేతగా నిలిచిన ప్రశాంత్, రాత్రి 12 గంటల సమయంలో స్టూడియోస్ నుంచి బయటకు రావటంతో అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే, అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్ సైతం బయటకు రావడంతో ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం మొదలై గొడవ చెలరేగింది. పలువురు రెచ్చిపోయి అమర్‌దీప్ కారుపై రాళ్లు విసిరేందుకు యత్నించారు.ఈ క్రమంలోనే దాదాపు ఐదుకు పైగా ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అభిమానులను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం ఈ సంఘటనపై రెండు వేర్వేరు కేసులను జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా నమోదు చేశారు. పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా ర్యాలీని నిర్వహించి గొడవకు కారణమైన విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News