Sunday, April 28, 2024

వన్ నేషన్.. వన్ ఎగ్జామ్ 

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ ఉద్యోగాలకు ఉమ్మడి అర్హత పరీక్ష
కొత్తగా జాతీయ నియామక ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఎ)

 ఒక సారి అర్హత సాధిస్తే మూడేళ్లు చెల్లుబాటు, ఏడాదికి రెండు సార్లు
‘సెట్’ నిర్వహణ, దీనితోనే గ్రూప్‌బి, సి ఉద్యోగ నియామకాలు
తొలిదశలో దేశ వ్యాప్తంగా 117 జిల్లాల్లో సుమారు
1000 పరీక్ష కేంద్రాలు, ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ 
ఉద్యోగ నియామక ప్రక్రియలో కేంద్రం చరిత్రాత్మక సంస్కరణ
పిపిపి పద్ధతిలో లీజుకు మూడు విమానాశ్రయాలు

Illegal Constructions Demolition in Warangal due to Floods

 

ఎన్‌ఆర్‌ఎ దేశంలోని కోట్లాది ఉద్యోగార్థులకు వరం. అదే విధంగా నియామకాల్లో పారదర్శకతను తీసుకువస్తుంది. నానా రకాల పరీక్షలు ఇక నుంచి ఉండవు. తద్వారా విలువైన సమయం యువతకు కలిసి వస్తుంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఇది మైలురాయి వంటి సంస్కరణ.-ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో చారిత్రాత్మక సంస్కరణలకు శ్రీకారం చుడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి అర్హత పరీక్ష(సిఇటి) నిర్వహణకు జాతీయ నియామక ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఎ)ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం అంగీకరించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం వివరాలను సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ మీడియాకు వెల్లడిస్తూ.. ఉద్యోగార్థులందరూ ఒకే ఒక ఉమ్మడి పరీక్ష రాయడం ద్వారా సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోగలుగుతారని అన్నారు. ఇది చాలా సంవత్సరాలుగా దేశంలోని యువజనుల ప్రధాన డిమాండని, ఎట్టకేలకు ఇది నెరవేరిందని ఆయన చెప్పారు. దేశ చరిత్రలోనే ఇది ఒక విప్లవాత్మక, చారిత్రాత్మక సంస్కరణగా మరో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభివర్ణించారు.

ఈ చర్య ఎంపిక ప్రకియను, ఉద్యోగ నియామకాన్ని సులభతరం చేయగలదని, ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగాలు తమకు దక్కవేమోనన్న భావనలో ఉన్న అణగారిన వర్గాలకు ఇది ఎంతో ప్రయోజనకరమని ఆయన చెప్పారు. వివిధ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షల కోసం దూర ప్రయాణాలు చేసే పేదలు, మహిళలకు కూడా ఈ చర్య ఎంతో తోడ్పడుతుందని ఆయన తెలిపారు.గ్రూపు బి, గ్రూపు సి(నాన్-టెక్నికల్) పోస్టులకు అభ్యర్థులను స్క్రీనింగ్ లేదా షార్ట్‌లిస్ట్ చేసేందుకు ఉమ్మడి అర్హత పరీక్ష(కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్)ను ఎన్‌ఆర్‌ఎ నిర్వహిస్తుంది. రైల్వే మంత్రిత్వశాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ లేదా ఆర్థిక సర్వీసుల శాఖ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సి), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్‌ఆర్‌బి), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబిపిఎస్) ప్రతినిధులు ఎన్‌ఆర్‌ఎలో ఉంటారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో వినూత్న టెక్నాలజీని, ఉత్తమ విధానాలను ప్రవేశపెట్టడమే ఎన్‌ఆర్‌ఎ ఏర్పాటు లక్ష్యమని ఒక అధికార ప్రకటన పేర్కొంది. కాగా, ప్రస్తుతానికి ఎన్‌ఆర్‌ఎ నిర్వహించే ఉమ్మడి పరీక్ష ఫలితాలను మూడు ప్రధాన నియామక ఏజెన్సీలు ఉపయోగించుకుంటాయి. తర్వాతి రోజుల్లో మిగిలిన ఏజెన్సీలను కూడా ఇందులో చేర్చుతారు. భవిష్యత్ కాలంలో సిఇటి స్కోర్‌ను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు కూడా పంచుకోగలవన్న ఆశాభావాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా ఎన్‌ఆర్‌ఎ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1517.57 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ కార్యదర్శి హోదాగల అధికారి ఎన్‌ఆర్‌ఎ చైర్మన్‌గా ఉంటారు. మూడేళ్ల కాలానికి ఈ నిధులను ఖర్చు చేస్తారు. ఎన్‌ఆర్‌ఎ ఏర్పాటుతోపాటు 117 జిల్లాలో పరీక్షల నిర్వహిణకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనకు ఈ నిధులు వ్యయం చేస్తారు. ప్రాథమికంగా ఉమ్మడి అర్హత పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 1000 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. ఒక్కో జిల్లాలో కనీసం ఒక పరీక్షా కేంద్రం ఉంటుందని, పరీక్ష రాసేందుకు ఏ విద్యార్థి తన జిల్లాను దాటాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు.

లీజుకు మరో 3 ఎయిర్‌పోర్టులు

ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం(పిపిపి) ద్వారా జైపూర్, గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాలను లీజుకు ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ మీడియాకు తెలియచేశారు. దేశంలోని లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలను నిర్వహించే హక్కును అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2019 ఫిబ్రవరిలో జరిగిన బిడ్డింగ్‌లో గెలుచుకుంది. కాగా, అహ్మదాబాద్, మంగళూరు, లక్నో విమానాశ్రయాలను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు లీజుకు ఇచ్చేందుకు 2019 జులైలో కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఈ మూడు విమానాశ్రయాలకు సంబంధించిన నిర్వహణ, యాజమాన్యం, అభివృద్ధికి సంంధించి అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది.

Cabinet to set up NRA Conduct tests for Govt Jobs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News