Wednesday, May 1, 2024

హత్రాస్ కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ

- Advertisement -
- Advertisement -

CBI is investigating the Hathras case

 

పలు మలుపుల తరువాత పరిణామం

న్యూఢిల్లీ : యుపి హత్రాస్ గ్యాంగ్‌రేప్, దళిత యువతి మృతి కేసు దర్యాప్తు పగ్గాలను సిబిఐ చేపట్టింది. తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అయిన ఈ ఉదంతంపై యుపి యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం సిబిఐ దర్యాప్తునకు సిఫార్సు చేసింది. ఈ మేరకు కేంద్రం నుంచి దక్కిన అనుమతి క్రమంలో సిబిఐ వర్గాలు ఈ ఉదంతంపై దర్యాప్తును శనివారం నుంచి తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఈ కేసుపై శనివారం తాము దర్యాప్తును చేపట్టినట్లు సిబిఐ అధికారికంగా తెలిపింది. యుపి పోలీసులతో కూడిన సిట్ నుంచి కేసును తాము తీసుకుంటున్నట్లు సిబిఐ తెలిపింది. సెప్టెంబర్ 1వ తేదీన యుపిలోని హత్రాస్‌కు చెందిన దళిత యువతి తల్లితో పాటు పొలం వద్దకు వెళ్లినప్పుడు సామూహిక అత్యాచారానికి గురైంది. తీవ్రంగా గాయపడిన యువతి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత నెల 28వ తేదీన మృతి చెందింది.

దళిత యువతి విషాదాంతం ఇంతకు ముందు ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతాన్ని తలపించిందని, ఈ అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలని, నిందితులను కఠినాతికఠినంగా శిక్షించాలని నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఇదే దశలో యువతి అంత్యక్రియలు తల్లిదండ్రులకు తెలియచేయకుండానే అర్థరాత్రి గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించారని విమర్శలు తలెత్తాయి. కాంగ్రెస్ నేతలు రాహుల్ ప్రియాంకలు గ్రామానికి వెళ్లి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ దశలో రాజకీయ విమర్శలు తలెత్తాయి. ఈలోగానే అధికారిక పోస్టుమార్టం నివేదిక వెల్లడి అయింది. యువతి అత్యాచారానికి గురి కాలేదని, దెబ్బలతోనే గాయపడి మృతి చెందిందని ఇందులో తెలిపారు. ఈ విధంగా పలు మలుపులు తిరుగుతున్న ఈ కేసును కేంద్రీయ దర్యాప్తు సంస్థ ఇప్పుడు దర్యాప్తు కోసం తన పరిధిలోకి తీసుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News