Saturday, April 27, 2024

ఈ 1,178 అకౌంట్లను బ్లాక్ చేయండి

- Advertisement -
- Advertisement -

Central govt ordered Twitter to freeze 1178 Twitter accounts

 

రైతుల ఆందోళనపై దుష్ప్రచారం చేస్తున్నారు
ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాలు

న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న నిరసనపై తప్పుడు సమాచారాన్ని, రెచ్చగొట్టే భావాలను వ్యాప్తి చేస్తున్న పాకిస్తాన్, ఖలిస్తాన్ మద్దతుదారులతో సంబంధాలు గల 1,178 ట్విటర్ ఖాతాలను స్తంభింపచేయాలని కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌ను ఆదేశించింది. ప్రస్తుతం ఢిల్లీ శివారుల్లో రైతులు ఆందోళన సాగిస్తున్న నేపథ్యంలో విదేశాల నుండి ఆపరేట్ చేస్తూ ప్రజలలో భయాందోళనలు రేకెత్తిస్తున్న ఈ ట్విటర్ అకౌంట్లను కేంద్ర ఐటి మంత్రిత్వశాఖ ఫిబ్రవరి 4వ తేదీన ట్విటర్‌కు పంపించింది. ఖలిస్తాన్ సానుభూతిపరులు లేక పాకిస్తాన్ మద్దతుదారులతో సంబంధాలు గల ట్విటర్ ఖాతాల జాబితాను భద్రతా ఏజెన్సీలు తయారచేయగా వాటిని ఐటి శాఖ ట్విటర్‌కు పంపించింది. ఈ తాజా ఉత్తర్వులపై ట్విటర్ ఇప్పటివరకు స్పందించలేదని అధికార వర్గాలు తెలిపాయి.

రైతుల హత్యాకాండకు కుట్రలు జరుగుతున్నాయని సూచించే హ్యాష్‌ట్యాగ్‌లు, ట్విటర్ ఖాతాలను తొలగించాలని గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌ను ఆదేశించింది. తమ ఆదేశాలను పాటించని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని కూడా ప్రభుత్వం ఆదేశించింది. కాగా..ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ ఖాతాలను బ్లాక్ చేసిన ట్విటర్ కొద్ది గంటల్లోనే ఏకపక్షంగా వాటిని అన్‌బ్లాక్ చేసింది. ఆ సందర్భంగా 257 యుఆర్‌ఎల్(వెబ్ అడ్రస్‌లు)లు, ఒక హ్యాష్‌ట్యాగ్‌ను బ్లాక్ చేయాలని కేంద్ర ఎలెక్ట్రానిక్స్, ఐటి శాఖ ట్విటర్‌ను ఆదేశించింది. ఇదివరకటి ఉత్తర్వులనే ఇప్పటివరకు ట్విటర్ పూర్తిగా అమలు చేయలేదని, ఇప్పుడు మరో సారి 1,178 అకౌంట్లను బ్లాక్ చేయాలని ఆదేశిస్తూ కేంద్రం తాజా ఉత్తర్వులు జారీచేసిందని వర్గాలు చెప్పారు. ఇదిలా ఉండగా, రైతుల ఆందోళనకు మద్దతుగా విదేశాల్లో నివసించే పలువురు సెలబ్రిటీలు చేసిన ట్వీట్లకు ట్విటర్ సిఇఓ జాక్ డోర్సీ లైక్స్ కొట్టడం పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News