Saturday, September 30, 2023

లక్ష మందితో నమస్తే ట్రంప్

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనలో భాగంగా ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం జరుగుతుంది. ఇది వేడుకగా సాగుతుంది. అమెరికా పర్యటనలో హుస్టన్‌లో తనకు ఏర్పాటు అయిన హౌడీ మోడీకి ధీటుగా, వీలయితే అంతకు మించిన స్థాయిలో దీనిని నిర్వహించాలని మోడీ తలపెట్టారు. జన సాంద్రత అత్యధికంగా ఉండే భారత్‌లో తన పర్యటన కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు ట్రంప్ ఇటీవలే తెలిపారు. తన సభలకు అమెరికాలో పరిస్థితి నేపథ్యంలో వేల సంఖ్యలోనే జనం వస్తారని, అదే భారత్‌లో తన సభ లక్ష మందితో ఏర్పాటు అవుతుందని తెలిసి ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లో జరిగే సభకు నమస్తే ట్రంప్ పేరు పెట్టినట్లు భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్థన్ శ్రింగ్లా బుధవారం తెలిపారు. అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందంతో ట్రంప్ రెండు రోజుల పర్యటన ఖరారు అయింది. ఎయిర్‌ఫోర్స్ 1 ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ చేరుకుంటారు. అక్కడ 2 గంటలు గడుపుతారు. ఈ నెల 25వ తేదీన ట్రంప్ రక్షణ, వాణిజ్య తదితర అంశాలపై విస్తృత చర్చలు జరుపుతారు. కొన్ని రక్షణ ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని విదేశాంగ కార్యదర్శి తెలిపారు. ఇరువురు నేతల మధ్య అసాధారణ స్థాయిలో ఇష్టాగోష్టి, సంప్రదింపులు ఉంటాయని వివరించారు. ప్రధాని మోడీ ట్రంప్ గౌరవార్థం లంచ్ ఏర్పాటు చేస్తారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విందు ఇస్తారు. ఈ నెల 24వ తేదీన ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే ట్రంప్ అక్కడ మోతేరా స్టేడియంను ప్రారంభిస్తారు. సర్దార్ పటేల్ పేరిట ఈ క్రికెట్ స్టేడియం వెలిసింది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా ఇది రూపుదిద్దుకుంది. స్టేడియం చుట్టు పక్కల ఇప్పటి నుంచే భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని విధాలుగా పర్యటన అత్యద్భుతంగా ఉండేందుకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సకల సన్నాహాలు చేపట్టింది.
2 గంటల పర్యటన .. రూ 80 కోట్ల ఖర్చు
అహ్మదాబాద్ పరిసరాలలో ట్రంప్ పర్యటనకు అయ్యే వ్యయం మొత్తం రూ 80 కోట్లు అని వెల్లడైంది. ఇది గుజరాత్ వార్షిక బడ్జెట్‌లో 1.5 శాతంగా ఉంటుంది. అమెరికా అధ్యక్షులు (పోటస్) వస్తుండటంతో భద్రతా ఏర్పాట్లకే ఈ మొత్తంలో సగభాగం ఖర్చు అవుతుందని వెల్లడైంది. భద్రతా ఏర్పాట్ల కోసం ఇప్పటి నుంచే 12000 కు పైగా పోలీసు అధికారులను రంగంలోకి దింపారు.
ఆగ్రా పర్యటన..తాజ్ సందర్శన
ఇండియాకు వచ్చి తాజ్‌మహల్ చూడకుండా వెళ్లకూడదనే ట్రంప్ ఆలోచనకు అనుగుణంగా ఇప్పుడు ఆయన పర్యటనలో ఆగ్రా సందర్శనను ఖరారు చేశారు. ట్రంప్ పర్యటన కోసం ఆగ్రాను సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు ఉత్తర ప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యానాథ్ బుధవారం తెలిపారు. ఆయన ఒక పండుగకు వచ్చినట్లు మురిసిపొయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. తాజ్‌మహల్‌కు రోడ్డు మార్గంలో ట్రంప్ బృందం వెళ్లే 15 కిలోమీటర్ల దూరం వెంబడి అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ రూటును 20 సెక్టార్లుగా, ఐదు జోన్లుగా విభజించారు. అయితే ఇప్పటికీ ట్రంప్ పర్యటనకు సరైన విధంగా నగరం రూపుదిద్దుకోలేదని ఆదిత్యానాథ్ స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుమ్ము ధూళీపేరుకుని ఉండటం చూసి విసుక్కున్నారు. నగరంలో రోడ్ల పక్కన ఉండే కార్మికులు, మురికివాడలలోని వారి పూర్వాపరాలను తీసుకోవాలని, భద్రతాపరమైన చర్యలు తీవ్రతరం చేయాలని ఆదేశించారు.
ట్రంప్ పర్యటన వివరాలు
24 వ తేదీ ట్రంప్ భారత్ ఆగమనం, అదేరోజు ఉదయం 11 గంటలకు అహ్మదాబాద్‌కు చేరుకోవడం, విమానాశ్రయంలో ట్రంప్ దంపతులకు ప్రధాని మోడీ స్వాగతం. తరువాత రోడ్‌షో ద్వారా మోతెరా స్టేడియంకు చేరడం, అక్కడ నమస్తే ట్రంప్ ఈవెంట్‌లో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడికి మధ్యాహ్నం 12.30కి ట్రంప్ మోడీలు వస్తారు. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ట్రంప్ భార్య మెలెనియాతో కలిసి ఆగ్రాకు వెళ్లుతారు. సాయంత్రం 5 గంటలకు ఆగ్రా పర్యటన ఖరారు అయింది. తాజ్‌మహల్ సందర్శన తరువాత ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రి ఐటిసి మౌర్యలో గడుపుతారు. ఈ నెల 25వ తేదీన రాష్ట్రపతిభవన్‌లో ఉదయం పది గంటలకు అధికారిక స్వాగత కార్యక్రమం ఉంటుంది. తరువాత ట్రంప్ దంపతులు రాజ్‌ఘాట్‌కు వెళ్లుతారు.

Centre to be held ‘Namaste Trump’ Event in Ahmedabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News