Monday, April 29, 2024

ఢిల్లీలో కేంద్రం ఆర్డినెన్స్ ఎమర్జెన్సీని తలపిస్తోంది: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇప్పుడు ఢిల్లీలో ప్రయోగిస్తున్న కేంద్రం ఆర్డినెన్స్‌ నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1975లో జారీ చేసిన ఎమర్జెన్సీని తలపిస్తోందని, దానిని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం డిమాండ్ చేశారు. ‘ఆర్డినెన్స్‌ను తేవడం ద్వారా కేంద్రం, సుప్రీంకోర్టు తీర్పును కూడా అణగదొక్కుతోంది, ఇది ఎమర్జెన్సీని తలపిస్తోంది. ప్రధాని మోడీ, బిజెపి నాయకులు స్వరం పెంచుతున్న ఎమర్జెన్సీ ఇది. రాజ్యాంగ సవరణ ద్వారా అలహాబాద్ హైకోర్టు తీర్పును కూడా పనికి రాకుండా చేశారు. ఇది ఎమర్జెన్సీ వంటిదే…కాదా? ఇది అదే మోడల్ ’ అంటూ కెసిఆర్ ఆప్ ఢిల్లీ ప్రభుత్వానికి మద్దతు పలికారు.

ప్రగతి భవన్‌లో విలేకరుల సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ కూడా ప్రసంగించారు. ‘నాడు జయప్రకాశ్ నారాయణ్ మాట విననందుకు ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని కూడా అధికారం నుంచి దించేయడం జరిగింది. ఆ తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ప్రజలు జనతా పార్టీని కూడా దించేసి ఇందిరా గాంధీని మళ్లీ గెలిపించారు’ అని కెసిఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

‘మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తేవడం ద్వారా కేవలం అరవింద్ కేజ్రీవాల్‌నే అవమానించలేదు, ఢిల్లీ ప్రజలను కూడా అవమానించారు. ఢిల్లీ ప్రజలు ప్రజా తీర్పును ఇచ్చారు. వారు ఎవరినీ నామినేట్ చేయలేదు. ప్రజలే మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు’అని కెసిఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్దతు ఇచ్చినందుకు కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సర్వీసెస్ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా బిఆర్‌ఎస్, ఆప్ కలిసి పోరాడుతాయన్నారు.

విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘కేంద్రంతో ఢిల్లీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు న్యాయపోరాటం చేసింది. చివరికి సుప్రీంకోర్టు కేంద్రం తాలూకు గెజిట్ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. కానీ ఆ తర్వాత ఎనిమిది రోజులకే సుప్రీంకోర్టు ఉత్తర్వును ధిక్కరించి కేంద్రం ఆర్డినెన్స్‌ను తెచ్చింది’ అన్నారు. ‘ఒకవేళ సుప్రీంకోర్టు ఉత్తర్వును మన్నించబోనని ప్రధానే అంటే, న్యాయానికి ఇక తావులేదు. ఇలా ఎలా దేశం నడువగలదు’ అని వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News