Monday, April 29, 2024

మట్టికరచిన ఇద్దరు సిఎంలు, ముగ్గురు మాజీలు

- Advertisement -
- Advertisement -
Charanjit Singh Channi defeat
మరెందరో దిగ్గజాలకూ తప్పని పరాజయం

న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పలువురు రాజకీయ దిగ్గజాలకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. వారిలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులలు, ముగ్గ్గురు మాజీ సిఎంలే కాకుండా డిప్యూటీ సిఎంలు, పలువురు మంత్రులు ఉన్నారు. పంజాబ్‌లో ‘ఆప్’ తుపాను ధాటికి ఎంతో మంది దిగ్గజాలు మట్టి కరిచారు. ఆ తీవ్రత ఎంతలా ఉందంటే ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సహా దాదాపు ప్రముఖ రాజకీయ నేతలంతా ఓటమి పాలయ్యారు. ఇక ఉత్తరాఖండ్‌లో బిజెపి అధికారం నిలబెట్టుకున్నప్పటికీ సిఎం పుష్కర్ సింగ్ ధామి కూడా ఓడిపోయారు. పంజాబ్ సిఎం చన్నీ ఎన్నికల్లో చామ్‌కౌర్ సాహిబ్, భదౌర్‌నుంచి పోటీ చేశారు. అయితే పోటీ చేసిన రెండు చోట్లా ఆయనకు ఓటమి తప్పలేదు. రెండు చోట్ల కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యర్థుల చేతిలోనే ఓడిపోయారు. భదౌర్‌లో చన్నీ 25 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలవగా, చామ్‌కౌర్ సాహిబ్‌లో మాత్రం కేవలం 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు తన కంచుకోట పటియాలలో గట్టి షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అజిత్‌పాల్ సింగ్ కోహ్లి చేతిలో ఆయన 20 వేల తేడాతో ఓడిపోయారు. పిసిసి చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్‌సర్ తూర్పునియోజకవర్గంనుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. సిద్ధూపై ఆమ్ ఆద్మీపార్టీ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్ దాదాపు 7 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన శిరోమణిఅకాలీదళ్ సీనియర్ నేత బిక్రమ్ సింగ్ మఝితా కూడా ఓడిపోయారు. శిరోమణి అకాలీదళ్ మాజీ అధ్యక్షుడు, మాజీ సిఎం ప్రకాశ్ సింగ్ బాదల్ లంబీనుంచి ఓటమి పాలయ్యారు. 94 ఏళ్ల వయసులో ఎన్నికల్లో పోటీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడు ఈయనే కావడం గమనార్హం. 1997నుంచి ఆయన ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

తాజా ఎన్నికల్లో జగపాల్ సింగ్ బాదల్ విజయం సాధించారు. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ జలాలాబాద్‌నుంచి పోటీ చేసి ఓడిపోయారు.2009నుంచి 2019 వరకు ఆయన ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2019లో అసెంబ్లీకి రాజీనామా చేసి ఫిరోజ్‌పూర్‌నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ బరిలో అడుగుపెట్టినా అదృష్టం వరించలేదు. మరో మాజీ ముఖ్యమంత్రి రాజిందర్ కౌర్ భట్టల్ కూడా ఓటమి చవి చూశారు. ఇక కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ మోగ నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు. 40 ఏళ్లుగా ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. అయినా ఓటర్లు మాళవికను తిరస్కరించారు.

ఇక గోవాలో మాజీ ముఖ్యమంతత్రి, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చర్చిల్ అలెమావో బెనోలిమ్ నియోజకవర్గం నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇక ఇద్దరు డిప్యూటీ సిఎంలు కాంగ్రెస్ ప్రత్యర్థుల చేతిలో పరాజయం పొందారు. మనోహర్ అజ్గావోంకర్ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అభ్యర్థి దిగంబర్ కామత్ చేతిలో ఓడగా, మరో డిప్యూటీ సిఎం చంద్రకాంత్ కావ్లేకర్ కాంగ్రెస్ అభ్యర్థి అల్టోన్ డికోస్టా చేతిలో ఓడిపోయారు. మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ సైతం ఓడిపోయారు. పనాజినుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఆయన బిజెపి అభ్యర్థి అతనాసియో మోన్సెరెట్టే చేతిలో కేవలం 716 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మూడు సార్లు గోవా ముఖ్యమంత్రిగా పని చేసిన మనోహర్ పారికర్ 25 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News