Monday, May 6, 2024

మళ్లీ అదే దుర్బుద్ధి

- Advertisement -
- Advertisement -

onChina army again try to shift boundary at LAC

జూన్ 15 నాటి ఘటనకు భిన్నంగా ఈసారి చైనా దూకుడిని మన సేనలు విజయవంతంగా అరికట్టగలిగాయి. అప్పుడు తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయలో గల పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరాన్ని చైనా సేనలు ఆక్రమించుకున్నాయి. అక్కడ వాస్తవాధీన రేఖ దాటి మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చి తిష్ఠ వేసుకున్నాయి. అప్పటి బాహాబాహీ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు దుర్మరణం చెందారు. ఇప్పుడు ఆ సరస్సు దక్షిణ తీరంలో అదే మాదిరిగా దురాక్రమణకు పాల్పడబోయిన చైనా సేనల కుటిల యత్నాన్ని మన దళాలు విఫలం చేశాయి. దక్షిణ తీరంలోని కీలక పర్వత శిఖరాలను ఆక్రమించుకోడానికి చైనా సైనిక ట్యాంకులు, వాహనాలు బయల్దేరిన విషయం గమనించిన మన సైనికులు చురుగ్గా కదిలి అంతకు ముందుగానే ఆ కొండలపై పట్టు సాధించుకున్నారు. దానిని చూసి చైనా దళాలు బిత్తరపోయాయి. వాస్తవాధీన రేఖ వద్ద మన భూభాగాన్ని ఆక్రమించుకోడానికి మరోసారి చైనా దుస్సాహసించడం గమనార్హం. జూన్ 15న చైనా సేనలు చేసింది దురాక్రమణ అయితే మొన్న ఆగస్టు 29 30 తేదీల అర్ధరాత్రి, అపరాత్రి మన సేనలు జరిపింది పూర్తి ఆత్మరక్షణ చర్య అని, సొంత భూభాగ పరిరక్షణ అని రూఢి అవుతున్నది. ఒకవైపు ఉపసంహరణ ప్రక్రియపై చర్చలు జరుగుతుండగానే మరో అతిక్రమణకు తలపెట్టడంలో చైనా దొంగ బుద్ధి మళ్లీ రుజువైంది. దాని పట్ల నిత్యం అప్రమత్తంగా, సునిశితమైన మెలకువతో ఉండవలసిన అవసరాన్ని ఇది రెట్టింపు చేస్తున్నది. మన సేనలు ముందు చూపుతో తమ పూర్తి ఆధీనంలోకి తీసుకున్న పాంగాంగ్ దక్షిణ తీరపు కొండలు మన భూభాగంలోనివి కాగా, చర్చలలో కుదిరిన అంగీకారాన్ని భారత్ ఉల్లంఘించిందని, ఆ ప్రాంతం నుంచి అది తన సైన్యాన్ని వెనక్కు రప్పించుకోవాలని చైనా డిమాండ్ చేయడం విచిత్రం. భారత సైన్యం ఇప్పుడు స్వాధీన పరచుకున్న పర్వత శిఖరాల మీద చైనా అప్పటికే నిఘా పరికరాలను నెలకొల్పింది. ఆ పర్వతాల కింద నున్న మన సైనిక దళాల కదలికలను అక్కడి నుంచి కనిపెట్టాలన్నది చైనా సేనల దుర్వూహం. చైనా విస్తరణ వాద దూకుడు వల్ల ఇప్పుడు లడఖ్ సరిహద్దుల్లో రెండు వైపులా చోటు చేసుకున్న సేనల మోహరింపుతో అక్కడ మరో యుద్ధ వాతావరణం నెలకొన్నది. 1962 భారత, చైనా యుద్ధం అనంతరం గత 58 ఏళ్లుగా ఉభయ దేశాల సరిహద్దులూ ప్రశాంతంగా ఉన్నాయి. చెదురుమదురు ఘటనలు మినహా చెప్పుకోదగిన ఘర్షణలు సంభవించలేదు. ఇంత సుదీర్ఘ కాలం ఈ రెండు ఆసియా దిగ్గజాల మధ్య సరిహద్దులు ప్రశాంతంగా ఉండడం అసాధారణమైన అధ్యాయంగా గుర్తింపు పొందింది. గత జూన్ 15 నాటి రక్తసిక్త బాహాబాహీ ఈ పరిస్థితిని ఉన్నపళంగా మార్చివేసింది. రెండు వైపులా పెద్ద ఎత్తున సేనల సమీకరణకు, గగనతల అప్రమత్తతకు దారి తీసింది. చైనా ధోరణి చూస్తుంటే ఈ యుద్ధ వాతావరణం మరి కొంత కాలం ఇలాగే కొనసాగేలా ఉంది. అగ్గిపుల్ల గీస్తే భగ్గుమనే మాదిరి ఈ వాతావరణంలో క్షణక్షణ నిగ్రహాన్ని పాటించడం రెండు దేశాలకూ కత్తి మొన మీద సాము వంటిదవుతుంది. చర్చలలో చైనా నిజాయితీగా వ్యవహరించడం లేదు. పాంగాంగ్ సో సరస్సు ఉత్తర తీరంలో మన భూభాగంలో తిష్ఠ వేసుకున్న చైనా అక్కడ ఉభయ దేశాల సేనలు సమాన దూరానికి ఉపసంహరించుకోవాలంటూ అసంబద్ధమైన ప్రతిపాదన చేసింది. అసమ రాజీని సూచించింది. నేను నీ కంట్లో వేలుపెడతాను నువ్వు నా నోట్లో వేలు పెట్టు అన్నట్టుగా ఉందిది. అది తాను ఆక్రమించుకున్న ప్రాంతంలో కొంత వెనక్కు జరుగుతుందట, మనం మన ప్రాంతాన్ని మరి కొంత వదులుకొని వెనుకకు తగ్గాలట! ఈ కుత్సిత ప్రతిపాదనను భారత్ తిరస్కరించింది. పాంగాంగ్ సో సరస్సు సమీపంలోని ఫింగర్ 5 చుట్టూ చైనా సేనలు ఉన్నాయి. ఫింగర్లు 5, 8 మధ్య ఐదు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి పూర్వపు స్థానానికి అవి వెళ్లిపోవాలని భారత్ డిమాండ్ చేస్తున్నది. ఈ ఒక్క చోటే కాకుండా దేప్ సంగ్ మైదానం, దౌలత్ బాగ్ ఓల్డీ ప్రాంతాలలోనూ ఉపసంహరణ జరగాలి. వాస్తవాధీన రేఖ పొడుగునా లిపులెఖ్, గోగ్రా కనుమలు, హాట్ స్ప్రింగ్స్ వంటి పలు చోట్ల ముందుకు చొచ్చుకు రావడం ద్వారా విశాల ప్రాంతాన్ని చైనా కబ్జా చేసింది. స్పష్టమైన సరిహద్దుల నిర్ధారణ జరగకపోడం వల్ల వాస్తవాధీన రేఖ ముందు ముందు కూడా పలు వివాదాలకు కేంద్రమయ్యే అవకాశమున్నదని అంటున్నది. దీనిని బట్టి దాని ఉద్దేశం సుస్పష్టం. ఒక వైపు ఆర్థికంగా అమెరికాతో పోటీ పడుతున్న చైనా ప్రపంచాధిపత్యం కోసం కూడా ఆరాటపడుతున్నది. ఈ మొత్తం వ్యూహం లో భారత దేశాన్ని తనకు ప్రతికూల శక్తిగా, తనతో కలిసి రాని దేశంగా అది పరిగణిస్తున్నది. అందుచేత మనం సైనికంగా దానికి దీటుగా నిలబడుతూనే ఆర్థికంగా కూడా చైనాతో సమాన స్థాయిని సాధించుకోడానికి త్వరపడవలసి ఉన్నది.

China army again try to shift boundary at LAC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News