Monday, April 29, 2024

అటు డ్రాగన్ ఇటు చలి

- Advertisement -
- Advertisement -

Grim test for Indian soldiers on Chinese border

 

ఫింగర్ ఫోర్‌వద్ద కాలంతో ఎదురీత n భారతీయ జవాన్లకు కఠోర పరీక్ష n చైనా బలగాల సవాళ్ల మధ్య కీలకం

లద్ధాఖ్ : తరుముకొస్తున్న శీతాకాలపు ఎముకలు కొరికే చలితో పోరుకు భారతీయ జవాన్లు సంసిద్ధమవుతున్నారు. ప్రత్యేకించి చైనా సరిహద్దులలోని అత్యంత ఎతైన సంక్లిష్ట పర్వత శ్రేణువుల ఫింగర్ 4 ప్రాంతంలో అటు శత్రుసేనల కవ్వింపులు, ఇటు ప్రకోపించే చలి ఝుళిపింపులను తట్టుకుని నిలిచేందుకు భారతీయ సైన్యం సిద్ధం అయింది. అడుగులు వేయడానికి కూడా కష్టంగా ఉండే ఫింగర్స్‌ను పోలిన పర్వత ప్రాంతాలు, 5800 మీటర్ల ఎతైన చోట అటువైపు ఉండే చైనాపీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) ఎత్తుగడలను పసికడుతూ తిప్పికొట్టేందుకు హిమపాతపు పిడుగుపాట్ల మధ్య భారతీయ జవాన్లు ప్రతిఏడులాగానే ఈ సారి శీతాకాలంలోనూ విధినిర్వహణకు ముందుకు సాగుతున్నారు. చాలా దారుణ రీతిలో పడిపోయే ఉష్ణోగ్రతలు, శారీరక పరిస్థితిని దెబ్బతీసే తేమవాతావరణం, అన్నింటికి మించి నెత్తురు గడ్డకట్టుకునేలా చేసే మంచుచరియల మధ్య సైన్యం హమేషా పారాహుషార్‌కు దిగాల్సి ఉంటుంది.

శీతాకాలం రానుండటంతో ఇక్కడ విధులు నిర్వహించే జవాన్ల బృందాలకు ప్రత్యేకంగా శీతాకాలాన్ని తట్టుకుని నిలిచే విధంగా ధారుఢ్యం ఉందా? లేదా తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ వింటర్‌A ఎండ్యురెన్స్ టెస్టులు కేవలం భారతీయ సైన్యానికి పరిమితం కాదు. సరిహద్దులకు ఆవల ఉండే పిఎల్‌ఎ బలగాలకూ నిర్వహిస్తారు.పాంగాంగ్ సో లేక్ ప్రాంతంలోని ఫింగర్ 4 ప్రపంచపు అత్యంత ఎతైన రణస్థలిగా ఉంది. ఈ ప్రాంతంలోనే చైనా, భారత్ బలగాలు ఎదురెదురుగా కాపలా విధులలో ఉంటాయి. ఇప్పటికే పలు కవ్వింపు చర్యలు, తటస్థీకరణ పరిస్థితులు తిరిగి ఉద్రిక్తతల నడుమనే ఇటీవలే లద్థాఖ్ ప్రాంతంలోని ఈ కీలక వ్యూహాత్మకమైన కరంకోరం, కైలాష్ శ్రేణువులలో తొట్టతొలి హిమపాతం నమోదు అయింది. ఈ ఏడాది దీపావళితరువాత ఈ ప్రాంతంలో చలికాలపు ప్రతాపం ఉధృతం అవుతుంది. ఈ ప్రాంతంలో ఇరుదేశాల సైన్యం మధ్య ఘర్షణలకు కేంద్ర బిందువులైన ప్రాంతాలలో ఇప్పటికీ కట్టుతప్పిన సంయమనంతో పరిస్థితి ప్రతిష్టంభన కొనసాగుతోంది.

ఈ ప్రాంతంలో భారతీయ సైన్యం తమకున్న సానుకూలతను ఆసరాగా చేసుకుని ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని పాంగాంగ్ సో దక్షిణంలో ఎగువన సైనిక సమీకరణలు బలోపేతం చేసుకొంటోందని పిఎల్‌ఎ ఆరోపిస్తోంది. తమ భూభాగంలో చైనా సేనల తగ్గింపు ఇప్పుడు నిలిచిపోయింది. దీనితో ఈ చలికాలంలో ఇరు సేనలు భారీ సంఖ్యాబలంతోనే ఇక్కడ మొహరించి ఉంటాయని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో గడ్డకట్టుకుని ఉండే మంచుతో అంతటా హిమభరిత గోడలు నిర్మితం అయినట్లు ఉంటుంది. ఆవలివైపున ఏముందనేది తెలుసుకోవడం హిమపాతపు దశలో కష్టమే అవుతుంది. ఈ ప్రాంతంలో ఆధిపత్యాన్ని చాటుకునేందుకు చైనా బలగాలు ఎల్లవేళలా యత్నిస్తూనే వస్తున్నాయి. ఇక్కడ ఇప్పటివరకూ భారత్ ప్రాబల్యం ఉండటం, భౌగోళికంగా భారతీయ సైన్యంపహారాలకు వీలు ఉండటంతో పలు కీలక ప్రాంతాలను కైవసం చేసుకునేందుకు చైనా బలగాలు పలు సార్లు యత్నించాయి.

రెజాంగ్ లా వద్ద ముఖపారి శిఖరం చేరుకుని పాగా వేసేందుకు చైనా సైనికులు చాలా సార్లు యత్నించారు. ఈ దశలో వారు ఆటవికపద్థతులలో విల్లంబులు, కత్తులు కటార్లు, ఆటోమెటిక్ ఆయుధాలు ధరించి వచ్చారు. ఈ శిఖరం చాలా కాలంగా భారతదేశపు సైనికుల ఆధీనంలోనే ఉంది. ఈ ప్రాంతంలోకి చైనా బలగాలు రాకుండా చేసేందుకు భారతీయ జవాన్లు ఇనుప తీగలను ముళ్ల కంచెలను అమర్చారు. ఇటీవల ఇటువంటి కవ్వింపులకే దిగి ఈ ప్రాంతంలోనే చైనా బలగాలు భారతీయ జవాన్లను బెదిరించేందుకు గాలిలో కాల్పులకు దిగాయి. చలికాలపు ఆరంభ దశలో లద్థాఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెంబడి1,597 కిలోమీటర్ల పొడవునా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. సంప్రదింపుల పర్వంతో తాత్కాలికంగా కవ్వింపులకు కళ్లెం పడింది. అయితే ఎప్పటికప్పుడు చైనా సైనికుల కదలికలతో ఇప్పటికీ ఈ హిమపర్వత ప్రాంతాలలో ఉద్రిక్తత ఎడతెగని తంతుగానే అయింది.

ఈ దశలో ఇప్పుడు దీపావళితరువాత విరుచుకుపడే చలిని తట్టుకునే విధంగా సైనికుల శరీరాలు, వారి మానసిక స్థితి ఏ విధంగా ఉందనేది ఇప్పుడు జరిగే కీలక పరీక్షలతో వెల్లడవుతుంది. అత్యంత దుర్భర వాతావరణ పరిస్థితిని తట్టుకుంటూ అటు కాలంతో ఇటు శత్రు సైన్యంతో తట్టుకుంటూ సాగేందుకు సరిహద్దుల సైన్యం సమాయత్తం అయింది. మరీ ఇక్కడి సరిహద్దులోని సంక్లిష్టతల నడుమ ఈ శీతాకాలం ధాటిని తట్టుకుంటూ వీర జవాన్లు తమ శారీరక ధారుఢ్యాన్ని చాటుకునేందుకు సిద్ధం అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News