Saturday, April 27, 2024

మళ్లీ అణు పరీక్షలకు సిద్ధమవుతున్న చైనా!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చైనా మరోసారి అణు పరీక్షలకు సిద్ధమవుతోందా? అమెరికా ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్‌లో వివరంగా ప్రచురించిన కథనాన్ని బట్టి చూస్తే అది నిజమేనని ధ్రువపడుతోంది. వాయువ్య చైనాలోని మారుమూల జింజియాన్ అటానమస్ రీజియన్‌లోని లోప్ నుర్ అణు పరీక్షా కేంద్రాన్ని తిరిగి యాక్టివేట్ చేస్తున్న దృశ్యాలను కూడా ఆ పత్రికా కథనంలో ప్రచురించారు. ఎన్‌డి టీవీన్యూస్ చానల్ ఈ చిత్రాలను సంపాదించింది. ఈ చితత్రాలను పరిశీలించినట్లయితే చైనా త్వరలోనే పూర్తి స్థాయిలో అణు పరీక్షలు, లేదా రసాయనిక పేలుడు పదార్థాలను ఉపయోగించి అణు సామర్థ్య పరీక్షలను నిర్వహించే స్థితిలో ఉంటుందని అర్థమవుతోంది. ఇదంతా చూస్తే చైనా ఇటీవలి కాలంలో తాను అభివృద్ధ్ధి చేసిన అణు వార్‌హెడ్‌లను పరీక్షించడంతో పాటుగా కొత్త తరం బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులకు అమర్చిన వార్‌హెడ్‌ల సామర్థాన్ని పరీక్షించాలని అనుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రముఖ అంతర్జాతీయ ఇంటెలిజన్స్ నిపుణుడు డాక్టర్ రెన్నీ బాబియార్జ్ అందించిన సాక్షాధారాల అధారంగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ విశ్లేషణ జరిపింది. అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ మాజీ విశ్లేషకుడైన ఈయన చైనా తొలి అణు పరీక్షా కేంద్రమైన లోప్ నుర్ అణు స్థావరంపై అనేక సంవత్సరాలు అధ్యయనం చేశారు.1964 అక్టోబర్ 10న చైనా తన తొలి అణు పరీక్షను ఈ లోప్ నుర్ కేంద్రంలోనే జరిపింది.‘ లోప్ నుర్ కేంద్రంలో చురుగ్గా జరుగుతున్న కార్యకలాపాలు అమెరికా చైనా సంబంధాల్లో అత్యంత సున్నితమైన క్షణాల్లో ఒకటి’ అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక అంటోంది. రానురాను వివాదాస్పదంగా మారుతున్న ఇరు దేశాల మధ్య సంబంధాలను స్థిరీకరించడానికి తాను ప్రయత్నిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంటున్నారని, గత నెల చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో దీనికి సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని కూడా కోరారని ఆ పత్రిక పేర్కొంది. అయితే న్యూయార్క్ టైమ్స్ వార్తా కథనాన్ని ‘ ఎండమావిలో నీళ్లను వెతుకుతున్నట్లు’గా ఉందంటూ చైనా కొట్టిపారేసింది. అంతేకాదు ‘చైనా అణు బూచి’ భయాన్ని రేపడానికి ప్రయత్నిస్తోందంటూ మండిపడింది.

అయితే ఈ పత్రిక సంపాదించిన చిత్రాలను బట్టి చూస్తే లోప్ నుర్ అణు పరీక్షా కేంద్రాన్ని అప్‌గ్రేడ్ చేసే కార్యకలాపాలు జోరుగా సాగుతున్నట్లు స్పష్టం అవుతుంది. అక్కడ ఉన్న కొద్ది పాటి భవనాలు 2017 నాటికల్లా చుట్టూ భద్రతా కంచెలతో అత్యధునాతన భవనాలుగా మారిపోయాయని ఆ పత్రిక పేర్కొంది. ఈ నిర్మాణాల్లో భారీ పేలుళ్లు జరపడానికి అనువైన పటిష్టమైన బంకర్ కూడా ఉందని ఆ పత్రిక తెలిపింది. అలాగే అక్కడ ఒక ఎయిర్ బేస్, మలాన్ పేరుతో ఒక టౌన్‌షిప్‌కు సంబంధించిన ఫొటోలు కూడా వాటిలో ఉన్నాయి. పదేళ్ల క్రితం దాకా చైనా వద్ద దాదాపు 50 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు మాత్రమే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య వెయ్యికి చేరుకుందని, వీటిలో సగానికి పైగా అణ్వస్త్రాలను మోసుకెళ్లగల సామర్థం కలిగినవే కావడం విశేషం. అయితే ఈ పరిణామాలు 1998లో పోఖ్రాన్‌లో అణు పరీక్ష తర్వాత అణు పరీక్షలపై ఏకపక్షంగా మారటోరియం ప్రకటించిన భారత్‌కు మాత్రం ఆందోళన కలిగించే విషయమేననడంలో ఎలాంటి సందేహం లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News