Monday, April 29, 2024

సివిల్స్ ప్రజా సేవ చేసే అవకాశం ఇస్తుంది

- Advertisement -
- Advertisement -
లక్ష్యం ఉన్నతమైనదైతే ఏదైనా సాధిస్తాం
పేదరికం విద్యార్థుల ప్రతిభకు అడ్డు కాదు
బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం

హైదరాబాద్ :  ప్రజా సంక్షేమానికి అవసరమైన విధానాలను రూపొందించి వారికి సేవ చేస్తూ గౌరవాన్ని పొందే అవకాశం కేవలం సివిల్ సర్వీస్ లోనే లభిస్తుందని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం పేర్కొన్నారు. దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీస్ సాధించాలన్న లక్ష్యాన్ని చిన్నతనంలోనే ఎంచుకొని గమ్యాన్ని చేరుకునే అవకాశాలను సద్వినియోగం చేసుకొని నేటి యువత ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ ఏడాది సివిల్స్ టాపర్ లో గురుకుల విద్యాసంస్థల్లో చదివిన వారు ఉండడం అభినందనీయమన్నారు. గురుకుల విద్య అత్యున్నతమైన క్రమశిక్షణ నిస్తుందనడానికి సివిల్స్ టాపర్ గా నిలిచిన వారే నిదర్శనమన్నారు.

బీసీ గురుకులంలో ప్రాథమిక విద్యను, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి ఎన్నో అవరోధాలను అధిగమించి తాను సివిల్స్ సాధించానని, నేడు మరికొందరు యువత పేదరికాన్ని సవాల్ చేస్తూ సివిల్స్ టాపర్‌గా నిలవడం వారి నిబద్ధత కు నిదర్శనం అన్నారు. బిసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన సివిల్స్ విజేతలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా స్టడీ సర్కిల్ రూపొందించిన కెరియర్ గైడెన్స్ కరపత్రాన్ని విడుదల చేశారు. ప్రతిభ ఉన్న వారికి సివిల్స్ , గ్రూప్స్ కోచింగ్ సంక్షేమ శాఖ అందిస్తుందని ఆయన చెప్పారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో స్టడీ సెంటర్ ను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ ఓటమి పాఠాలను గెలుపు బాటలుగా మార్చుకోవాలన్నారు. ఎన్నో అవాంతరాలను అధిగమించి విజయం సాధించిన సివిల్స్ ర్యాంకర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా ఓయూ సివిల్స్ సర్వీసెస్ అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ చింత గణేషం మాట్లాడుతూ సివిల్స్ సాధించాలని ఆసక్తి ఉన్నవాళ్లకి ఉస్మానియా యూనివర్సిటీ అవకాశాలను కల్పిస్తుందని, ప్రతి ఏటా సివిల్స్ విజేతలతో ముఖాముఖి నిర్వహించి యువతకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సివిల్స్ లో ఆలిండియా మూడవ ర్యాంకు సాధించిన ఉమా హారతి, 35ర్యాంకర్ సాంకేత్ కుమార్, 60 ర్యాంకర్ సాయి ప్రణవ్, 94వ ర్యాంకర్ సాయి కృష్ణ, 200 ర్యాంకర్ మహేష్ కుమార్, 410 ర్యాంకర్ రేవయ్య, 510 ర్యాంకర్ ప్రణీత్, 548 ర్యాంకర్ హిమ వంశీ, 646 ర్యాంకర్ అపూర్వ తదితరులు పాల్గొని తాము సివిల్ సాధించడంలో ఎదుర్కొన్న అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం విశ్వసాహితీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మానాన్న అనురాగం డాన్స్ కాంపిటీషన్లో విజేతలకు అవార్డులు అందించారు. ఫస్ట్ బహుమతి మహేశ్వరం గేట్ ఎంజెపి స్కూల్ విద్యార్థులు,
2వ బహుమతి క్యాండర్ ష్రైన్ గ్రూప్, మూడవ బహుమతి కేశంపేట దౌలతాబాద్ ఎంజెపి బాయ్స్ స్కూల్ విద్యార్థులు అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ చల్లమల్ల వెంకటేశ్వర రావు, ప్రొఫెసర్ మంగు, సైకాలజిస్ట్ వీరేందర్, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలా చారి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, బిసి సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు చంద్రశేఖర్, అలోక్ కుమార్, తిరుపతయ్య, జిల్లా స్టడీ సర్కిల్ డైరెక్టర్స్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, ఎంజెపి, ఇతర స్కూల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News