Saturday, April 27, 2024

‘మన పత్తి.. దేశంలోనే అత్యంత నాణ్యమైనది’: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మన పత్తి…దేశంలోనే అత్యంత నాణ్యమైనది
అంతర్జాతీయంగా డిమాండ్ కల్పించేందుకు ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలి
పత్తికున్న విశిష్ట లక్షణాలను గుర్తించి వాటిని ప్రచారం చేయడానికి అవసరమైన వ్యూహం రూపొందించాలి
దీని కోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిపుణులతో ఓ సదస్సు నిర్వహించాలి
వ్యవసాయ విస్తరణపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష

CM KCR Review meeting on Agricultural expansion

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో పండే పత్తి దేశంలో కెల్లా అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రపంచంలోకెల్లా అత్యంత నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో మన రాష్ట్రం ఒకటి అని సిఎం వెల్లడించారు. తెలంగాణలో పండే పత్తి స్టేపుల్ (దూది పింజ) పొడవు దేశంలో కెల్లా అత్యంత పొడవుగా వస్తుందని, గట్టితనం కూడా ఎక్కువని సిఎం అన్నారు. అత్యంత నాణ్యతతో కూడిన తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ కల్పించేందుకు ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ పత్తికున్న విశిష్ట లక్షణాలను గుర్తించి, వాటిని ప్రచారం చేయడానికి అవసరమైన వ్యూహం రూపొందించాలని కోరారు. దీనికోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిపుణులతో ఓ సదస్సు నిర్వహించాలని సిఎం చెప్పారు. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా మరింత డిమాండ్ రావడానికి అనుగుణంగా పత్తి ఏరిన తర్వాత శుద్ధి చేయడం, ప్యాక్ చేయడం లాంటి పనులను జాగ్రత్తగా నిర్వహించే విషయంలో రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని కోరారు.

రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణపై ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. పత్తిలో ఏమాత్రం చెత్తా చెదారం, మట్టి పెళ్లలు, దుమ్ము చేరకుండా చూడాలన్నారు. ‘దేశంలో ఎక్కువ విస్తీర్ణంలో పత్తిని సాగు చేస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతున్నదన్నారు. పత్తికి దేశీయంగా, అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉందన్నారు. పైగా తెలంగాణ పత్తి పింజ పొడవు ఎక్కువ కాబట్టి మరింత డిమాండ్ ఉందన్నారు. ఇరిగేటెడ్ వాటర్ (సాగునీరు) ద్వారా సాగు చేసే భూముల్లో పంట మరింత బాగా వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎక్కువ కట్టుకున్నందున సాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. కాబట్టి కాల్వల కింద పత్తిని సాగు చేస్తే మరింత లాభసాటిగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. “పత్తికి మంచి మార్కెట్ రావడానికి ప్రభుత్వం కూడా అవసరమైన చర్యలు తీసుకున్నది. తెలంగాణ ఏర్పడక ముందు జిన్నింగ్ మిల్లుల సంఖ్య కేవలం 60 మాత్రమే ఉం, వాటిని 300 కు పెంచేలా చర్యలు తీసుకున్నది. పత్తి పంట ఎక్కువ పండే ప్రాంతాల్లో జిన్నింగ్ మిల్లులు నెలకొల్పేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది” అని సిఎం చెప్పారు.

“పత్తి సాగులో అనేక కొత్త పద్ధతులు వచ్చాయి. కొత్త వంగడాలు కూడా వచ్చాయి. ఒకేసారి పంట వచ్చే (వన్ టైమ్ పిక్ కాటన్) విత్తనాలు వస్తున్నాయి. వాటిని తెలంగాణలో పండించాలి” అని సిఎం కోరారు. “రైతులు లాభసాటి పంటలనే పండించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో చర్యలు ప్రారంభించాం. రైతులు కూడా ప్రభుత్వ సూచనలు పాటించి నియంత్రిత పద్ధతిలో సాగు చేస్తున్నారని సిఎం అభినందించారు. ఇది మంచి సంప్రదాయమన్నారు. మార్కెట్లో పత్తికి, నూనె గింజలకు, పప్పులకు మంచి డిమాండ్ ఉందన్నారు. అలాగే కూరగాయలకు కూడా మంచి ధర వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో వాటిని మరింత ఎక్కువగా పండించాలని సూచించారు. కందుల విస్తీర్ణం 20 లక్షలకు పెంచాలని, ఆయల్ పామ్ విస్తీర్ణం 8 లక్షలకు పెరగాలని సిఎం అన్నారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, కమిషనర్ అనిల్, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శులు శేషాద్రి, స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

CM KCR Review meeting on Agricultural expansion

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News