Thursday, May 9, 2024

కందుల సమస్యపై సిఎం సీరియస్

- Advertisement -
- Advertisement -

పంటసాగు వివరాలు ఎఇఒలు సరిగ్గా నమోదు చేయకపోవడంపై ఆగ్రహం
మార్క్‌ఫెడ్ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
కేంద్రాల వద్ద వాపోతున్న రైతులు
కందులే వేశామని చెప్పినా.. పట్టించుకునే నాథుడే కరువు

Lentils

మన తెలంగాణ/హైదరాబాద్: కందుల కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులపై ముఖ్యమంత్రి కెసిఆర్ సీరియస్ అయినట్లు తెలిసింది. పంట కొనుగోళ్లలో అన్నదాతలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకూడదని ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మద్ధతు ధరకు మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలలో కందులను అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతుంటే, రైతు సమన్వయ సమితులు ఏం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పరిస్థితులు చక్కదిద్దపోతే వేటు తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. పలు మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను మన తెలంగాణ ప్రతినిధిక్షేత్రస్థాయిలో పరిశీలించగా అనేక సమస్యలతో కంది రైతులు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఇందులో ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలలో ఆన్‌లైన్ కందులు సాగు చేసినట్లు నమోదై ఉంటేనే కొంటామని అధికారులు స్పష్టం చేస్తుండటంతో రైతులకు దిక్కుతోచడం లేదు. కొత్తగా ఆన్‌లైన్‌లో పేరు రావడమేంటి అని వాపోతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రం వరకు తీసుకువచ్చిన పంటను, గతిలేని పరిస్థితుల్లో మళ్లీ వ్యాపారి దగ్గరుకు తీసుకెళ్లి తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. అయినా అధికారులు ఏవేవో కొత్త నిబంధనలు తీసుకొస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు.

వేసింది కంది.. ట్యాబ్‌లో పత్తి

పంట కొనుగోళ్లపై మార్క్‌ఫెడ్ కొత్త పద్ధతిని పాటిస్తోంది. వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు సమగ్ర సమాచార సేకరణ (ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్)లో భాగంగా తీసుకున్న వివరాల ఆధారంగానే కొనుగోళ్లు చేపడుతోంది. పంట సాగు సమయంలో ఎఇఒలు రైతు వారీగా ఏ పంట, ఏ సర్వే నెంబర్‌లో ఎంత మొత్తంలో సాగు చేశారో అందులో నమోదు చేస్తారు. ఆ తరువాత పంట ఉత్పత్తులు మార్కెట్ వచ్చే సమయంలో ఈ వివరాలను ఆధారంగా తీసుకుని మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు చేపడుతుంది. వాస్తవానికి దళారులను ఆరికట్టేందుకు ఇది మంచి పద్ధతే. అయితే ఎఇఒలు ప్రతీ రైతును సందర్శించి పంట సాగు వివరాలు తీసుకోలేదు. ఎప్పటిలాగే ర్యాండమ్‌గా ఆ రైతు పత్తి వేసి ఉంటాడు.. ఫలనా రైతు వరి వేసి ఉంటాడు అని తోచినట్లు ట్యాబ్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్ నమోదు చేశారు. ఇప్పుడు పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు ఆ వివరాలనే ఆధారంగా చేసుకుంటుడంతో పంట సాగు చేసినా, ఆ ఉత్పత్తిని అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. ఎప్పుడూ పట్టాదారు పాసుపుస్తకం చూసి కొనుగోళ్లు చేస్తుండేవారని, ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఎంట్రీ ఉండాలని చెబుతున్నారని ఎందో తెలుస్తలేదని యదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘంలో కందుల అమ్మకానికి వచ్చిన రైతులు మన తెలంగాణతో వాపోయారు. వాస్తవం ఏమిటంటే ఎఇఒలు ఆన్‌లైన్‌లో పంటల సాగు వివరాలు నమోదు చేస్తున్నారని 90 శాతం మంది రైతులకు తెలియదు. అదే సమయంలో వీటి ద్వారానే కొనుగోళ్లు ఉంటాయనే కనీస అవగాహన కూడా అన్నదాతలకు లేదు. దీంతో తాము నిజంగానే పంట సాగు చేశామని, పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు వెంట పెట్టుకుని కందుల సంచులను కొనుగోలు కేంద్రం తీసుకువచ్చి పంట తీసుకోవాలని ప్రాధేయపడుతున్నారు. కొందరైతే చేసేదేమి లేక తెచ్చిన కందులను వెనక్కి తీసుకెళ్తున్నారు. ఇలా చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతుండగా, పేరు ఆన్‌లైన్‌లో ఉన్నా అమ్మేందుకు రైతులకు తిప్పలు తప్పడం లేదు.

సంతకాలు తెచ్చేందుకు తిప్పలు

ఎఇఒ, విఆర్‌ఒ ద్వారా సంతకాలు తీసుకు రావాలని, అలాగే కొనుగోలు కేంద్రంలో రెండు, మూడు రోజుల ముందే టోకెన్ తీసుకోవాలని చెబుతుండటంతో ఎక్కడని తిరగాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఎఇఒ అందుబాటులో ఉన్నా, విఆర్‌ఒ దొరకడం లేదు. విఆర్‌ఒ ఉన్నా.. ఎఇఒ అందుబాటులో ఉండటం లేదు. దీంతో మద్ధతు ధరకు అమ్ముకోవడం గగనమైపోతుందని, ప్రైవేట్‌లో క్వింటాకు రూ.1500 వరకు నష్టపోయినా సరే అని అటువైపు వెళ్తున్నారు. ఆన్‌లైన్‌లో ఎంట్రీ లేకున్నా తమను అనుమతించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సిఎం కెసిఆర్ రైతుబంధు ఇస్తున్నారని, మద్దతు ధర కూడా ఇస్తున్నందున అధికారులు ఇటువంటి వాటిపై తగిన చర్యలు తీసుకునేలా చూడాలని చెబుతున్నారు. ఈ ఖరీఫ్‌లో 7.20 లక్షల ఎకరాల్లో కంది పంట సాగైంది. ఇందులో 2.95 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తోంది. అయితే కేంద్రం 47,500 మెట్రిక్ టన్నులకే అనుమతించింది. రెండో ముందస్తు అంచనాల నివేదిక ప్రకారం 25 శాతం కొనుగోళ్లు చేపట్టాలని ఈ మేరకు 51,750 మెట్రిక్ టన్నులకు పరిమితి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News