Sunday, April 28, 2024

కొండగట్టు అంజన్నకు మరో రూ.500 కోట్లు

- Advertisement -
- Advertisement -

జగిత్యాల ః భారతదేశంలో అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు వచ్చేలా కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. అంజన్న క్షేత్ర అభివృద్దికి రూ.100 కోట్లు కేటాయించిన సిఎం కెసిఆర్ క్షేత్రాన్ని పరిశీలించి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించేందుకు బుధవారం ప్రత్యేక హెలికాప్టర్‌లో సిఎం కెసిఆర్ నాచుపల్లి జెఎన్‌టియుకు చేరుకోగా, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌లు సిఎంకు స్వాగతం పలికారు. నాచుపల్లి జెఎన్‌టియులోని హెలిప్యాడ్‌లో దిగిన సిఎం అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా అంజన్న సన్నిధికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు సిఎం కెసిఆర్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సిఎం కెసిఆర్‌కు అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు వేద ఆశీర్వచనం చేసి, స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

అంజన్న క్షేత్రాన్ని కలియతిరిగి ఎక్కడెక్కడ ఏఏ నిర్మాణాలు చేపడితే బాగుంటుందని ఆర్కిటెక్చర్ ఆనంద్‌సాయి, అధికారులను సిఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంజన్న క్షేత్రం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సిఎం కెసిఆర్ సుమారు రెండు గంటల పాటు సమీక్షించారు. దేవాలయాన్ని భక్తుల అవసరాలకు అనుగుణంగా విస్తరించడానికి సేకరించాల్సిన భూములు, సంబంధిత అంశాలపై లోకేషన్ మ్యాప్‌ను అధికారులు సిఎం కెసిఆర్ ముందుంచగా ఆయన సునిశితంగా పరిశీలించారు. కొండగట్టు అంజన్న స్థల పురాణం గురించి సిఎం కెసిఆరే స్వయంగా అధికారులకు వివరించారు. ప్రపంచాన్ని ఆకర్షించేలా అద్భుత ఆధ్మాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దుతామన్నారు. వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. కొండగట్టు క్షేత్ర అభివృద్ధి కోసం నిధులకు ఎలాంటి కొరత లేదని, అవసరమైతే రూ.1000 కోట్లు కేటాయించేందుకైనా సిధ్దమేనన్నారు.

వసతులు గొప్పగా ఉంటేనే క్షేత్రానికి వచ్చే భక్తులు పెరుగుతారన్నారు. యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణం సమయంలో చేపట్టిన సూక్ష్మ పరిశీలన, విస్తృత స్థాయి సమావేశాల మాదిరిగా అంజన్న ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను కూడా చేపడతామన్నారు. ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి గర్భాలయం మినహా ఆలయాన్ని విస్తరించాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఆగమ శాస్త్ర నియమాల మేరకు మూల విరాట్టును ముట్టుకోకుండా ఆలయ విస్తరణ జరగాలన్నారు. వాస్తు ప్రకారం ఏ నిర్మాణం ఎక్కడ చేపట్టాలో నిర్ణయించాలని సూచించారు. యేటా లక్షలాది మంది హనుమాన్ దీక్ష చేపడతారని, క్షేత్రానికి వచ్చే దీక్షాపరులకు అన్ని సౌకర్యాలతో కూడిన వసతులను ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. మంగళ, శని, ఆది వారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అలాగే హనుమాన్ జయంతి, ఇతర పండుగల సందర్భాల్లో భక్తుల తాకిడిని తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం వస్తున్న భక్తులతో పాటు ఆలయ అభివృద్ధి తర్వాత పెరుగనున్న రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు అందించేలా నిర్మాణ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.

ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బందులు కలుగకుండా క్యూలైన్‌ల నిర్మాణం, రవాణా సౌకర్యాలు, విశాలమైన ప్రధాన ద్వారం ఏర్పాటు చేయాలని సూచన చేశారు. హనుమాన్ జయంతికి భారతదేశంలోని సగం జనం కొండగట్టు అంజన్న వైపు మరలేలా ఆలయ నిర్మాణం జరగాలన్నారు. పార్కింగ్‌కు ఇబ్బందులు లేకుండా 86 ఎకరాల్లో సువిశాలమైన పార్కింగ్ ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ సూచించారు. కాళేశ్వరం నీటిని పైపుల ద్వారా కొండగట్టు గుట్టపైకి తరలించి భక్తులకు సరిపోయేలా నీటి వసతి కల్పించాలని ఆదేశించారు. విద్యుత్ సబ్ స్టేషన్, దవాఖాన, బస్టాండ్, పార్కింగ్ స్థలం, రోడ్ల నిర్మాణం, పుష్కరిణి, వాటర్ ట్యాంకులు, నీటి వసతి, కాటేజీల నిర్మాణం, దీక్షపరుల మంటపం, పోలీస్ స్టేషన్, కళ్యాణకట్ట తదితర మౌలిక వసతులను భవిష్యత్ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మించాలన్నారు. ప్రపంచంలోనే అత్యంత అద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు శిల్పులను సమకూర్చాలని యాదాద్రి రూపకర్త ఆనంద్‌సాయికి సిఎం కెసిఆర్ సూచించారు.

ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతుందని, అప్పటి దాకా ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి బాలాలయాన్ని నిర్మించాలని అధికారులకు తెలిపారు. గుట్టలపై నుంచి సహజంగా ప్రవహించే నీరు సంతులోని లొద్దిలోకి చేరుతుండగా అక్కడ నీటి లభ్యత గురించి, గుట్ట చుట్టూ ఉన్న చెరువుల గురించి సిఎం ఇరిగేషన్ అధికారులతో ఆరా తీశారు. గుట్ట మీద కాటేజీల నిర్మాణానికి దాతలను ఆహ్వానించాలని సిఎం సూచించగా, ఇప్పటికే శ్వేత గ్రానైట్స్ వారు నిర్మించిన కాటేజ్ ఆలయ విస్తరణలో పోతోందని, తగిన స్థలం సూచిస్తే కొత్తగా నిర్మిస్తామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొనగా, సిఎం గంగులను అభినందించారు. కళ్యాణకట్ట దగ్గర స్త్రీలు, పురుషులకు వేర్వేరుగా పుష్కరిణిలు ఏర్పాటు చేయాలన్నారు. కొండగట్టు అంజన్న అభయారణ్య ప్రాంతాన్ని మైసూర్, ఊటీ రహదారిలోని నీలగిరి కొండల్లో ఉన్న బందీపూర్, అభయారణ్యం మాదిరిగా తీర్చిదిద్దాలని అటవీ శాఖ అధికారి భూపాల్‌రెడ్డికి సిఎం సూచించారు.

కొండగట్టు స్థల పురాణం గురించి భక్తులకు తెలిసేలా పుస్తకాలను ముద్రించాలని, అలాగే రాష్ట్రంలోని అన్ని ఆలయాల స్థల పురాణ పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఆధ్మాత్మిక పర్యాటకుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని టూరిజం శాఖ ఎండి మనోహర్‌రావును సిఎం కెసిఆర్ ఆదేశించారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు మొదట మూల విరాట్టును దర్శించుకుని ఆ తర్వాత అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని, బేతాళ స్వామి, రాములవారి పాదుకల దర్శనం సర్కూట్‌ను అనుసరించి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. గుట్టమీదికి వచ్చే వివిఐపిల కోసం యాదగిరి గుట్టలో నిర్మించిన మాదిరిగా ప్రెసిడెన్షియల్ సూట్, వివిఐపి సూట్‌ల నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేసి వాస్తుల నియమాల మేరకు నిర్మాణాలు చేపట్టాలన్నారు. రెండు నెలల్లో కొండగట్టు అంజన్న ఆలయానికి నీటి సరఫరా జరిగేలా ఫ్లడ్‌ఫ్లో కెనాల్ నుంచి మిషన్ భగీరథ ద్వారా నీటిని తరలించే పనులను తక్షణమే చేపట్టాలని, ఆ నీటితోనే నిర్మాణ పనులు మొదలవుతాయని సిఎం స్మితా సభర్వాల్‌కు సూచించారు.

గుట్టపై అంజనాద్రి పేరుతో వేద పాఠశాలను నిర్మించేందుకు తగిన స్థలం ఎంపిక చేయాలన్నారు. రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా సాగిన సమావేశంలో ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి చర్యలు చేపట్టాలని అన్ని విభాగాల అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశాలిచ్చారు. ఈ మహాకార్యం పూర్తయ్యే వరకు తాను అనేక మార్లు కొండగట్టుకు వస్తానని సిఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపి దివికొండ దామోదర్‌రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, జడ్‌పి చైర్ పర్సన్ దావ వసంత, ఎంఎల్‌ఎలు సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్‌కుమార్, రసమయి బాల కిషన్, బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, కోరుకంటి చందర్, మండలి చీప్‌విప్ భానుప్రసాదరావు, ఎంఎల్‌సి ఎల్.రమణ, మాజీ ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణరావు, ఎఫ్‌డిసి చైర్మన్ అనిల్, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ రవీందర్‌సింగ్,

గెల్లు శ్రీనివాస్ యాదవ్, సిఎంఓ అధికారులు భూపాల్‌రెడ్డి, స్మితసబర్వాల్, ఆర్‌అండ్‌బి అధికారులు గణపతిరెడ్డి, రవీందర్‌రావు, మిషన్ భగీరథ ఇఎన్‌సి కృపాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా, ఆలయ స్తపతి ఆనంద్ సాయి, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్‌తేజ, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఇఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News