Monday, April 29, 2024

విద్యుత్ నిర్వహణ, మరమ్మత్తు పనులు సమర్ధవంతంగా పూర్తి చేయండి

- Advertisement -
- Advertisement -

సమీక్షా సమావేశంలో ఎస్‌పిడిసిఎల్ సిఎండి ముషారఫ్ ఫరూఖీ ఆదేశం

మన తెలంగాణ / హైదరాబాద్ : రానున్న వేసవి, రబీ సీజన్లలో ఏర్పడే అధిక విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేలా విద్యుత్ పంపిణీ వ్యవస్థను మెరుగుపర్చాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి ముషారఫ్ ఫరూఖీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంస్థ ప్రధాన కార్యాలయంలో సిజిఎం , సూపరింటెండింగ్ ఇంజినీర్లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో సిఎండి మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల శ్రేయస్సుకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని, వారు ఎదుర్కొనే సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా అధికారులకు సిఎండి పలు సూచనలు చేసారు. వీటిలో అన్ షెడ్యూల్ విద్యుత్ అంతరాయాలు నివారించాలని, ఒక వేళ అంతరాయాలు కలిగితే ఆ అంతరాయానికి గల కారణాలు విశ్లేషించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అన్ని 11 కెవి ఫీడర్ల ఎనర్జీ ఆడిట్ చేయాలని, ఒక వేళ సప్లై చేసిన విద్యుత్ కు బిల్లింగ్ కు వ్యత్యాసం ఉంటే ఆ పరిధిలోని సర్వీసులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. మరీ ముఖ్యంగా విద్యుత్ వాడకం బిల్లులను జారీ చేయడంతో పాటు ఏవైనా బిల్లింగ్ సంబంధిత ఫిర్యాదులు నమోదయితే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. విద్యుత్ నష్టాల తగ్గింపు కోసం అనధికార విద్యుత్ వాడకం నివారించడంతో పాటు దీని కోసం ప్రతి సర్వీసును క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. విద్యుత్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గతం మాదిరి కాకుండా అతి తక్కువ సమయంలో కేవలం 2 గంటల్లో మాత్రమే 11 కేవీ, 33 కేవీ ఫీడర్ల, సబ్ స్టేషన్ల నిర్వహణ పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. సెక్షన్ స్థాయిలో చేపట్టే నిర్వహణ, మరమ్మతులపై చేపట్టే ప్రాంతాల సమాచారం, విద్యుత్ నిలిపి వేసే సమయం వివరాలను మెసేజ్‌ల ద్వారా గాని లేదా ప్రాంతీయ వార్తా పత్రికల ద్వారా గాని ఒక రోజు ముందుగానే వినియోగదారులకు తప్పనిసరిగా తెలియజేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి 20 నుండి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశమున్నందున ఆ లోగానే నిర్వహణ పనులు పూర్తి చేయాలని సిఎండి అన్నారు. గతేడాది దక్షిణ డిస్కం పరిధిలో 9,860 మెగావాట్ల పీక్ డిమాండ్‌తో పాటు రాష్ట్రంలో 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదు అయ్యిందని, ఈ సారి కూడా అదే స్థాయిలో డిమాండ్ నమోదయ్యే అవకాశమున్నదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో గతేడాది మే నెలలో 3756 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌తో, 79.33 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగిందని, ఈ ఏడాది కూడా మే నెలలో దాదాపు 4000 మెగావాట్ల గరిష్ట డిమాండ్, 8,3- 85 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదయ్యే అవకాశమున్నదని సిఎండి ముషారఫ్ ఫరూఖీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News