Sunday, April 28, 2024

ప్రజల కోసం.. మోడీని లేకుండా చేయాల్సిందే..

- Advertisement -
- Advertisement -

భోపాల్: రాజ్యాంగ పరిరక్షణ, మైనార్టీల భవిష్యత్తు కోసం ప్రధాని మోడీని చంపేందుకు సిద్ధం కావాలని మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత రాజా పటేరియా వివాదాస్పద వ్యాఖ్యలకు దిగారు. జనం కోసం జనమే మోడీని లేకుండా చేయాల్సి ఉందని ఘాటుగా స్పందించారు. వెంటనే రాష్ట్రంలోని పన్నా జిల్లాలోని పవాయ్ పోలీసు స్టేషన్‌లో కాంగ్రెస్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి అయిన పటేరియాపై సోమవారం ఎఫ్‌ఐఆర్ దాఖలు అయింది. జిల్లా నేతగా పేరొందిన పటేరియా చేసిన వ్యాఖ్యలు సోమవారం ఉదయం సామాజిక మాధ్యమంలో ప్రచారం పొందాయి.

ఇందులో ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడుతూ మోడీ లేకుండా చేసేందుకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగానే ఆయన తన ఘాటు ప్రసంగంలో మోడీ అంతమొందించేందుకు సిద్ధం కండనే వ్యాఖ్యలు చేయడం తీవ్రస్థాయిలో దుమారానికి దారితీశాయి. వెంటనే ఆయన తమ ప్రసంగంలో మోడీని లేకుండా చేయడం అంటే మోడీని ఎన్నికలలో చిత్తుగా ఓడించడం అని తెలియచేసుకున్నారు. మోడీతో పలు అనర్థాలు జరుగుతున్నాయి. ఆయన ఎన్నికల ప్రక్రియను దెబ్బతీశారు. సమాజాన్ని కులాలు, మతాల ప్రాతిపదికన విభజిస్తూ పాలిస్తున్నారు. ఆయన హుకుమత్‌తో దేశంలో దళితులు, ఆదివాసీలు, మైనార్టీల భవిత ప్రమాదంలో పడుతుంది. కులాలు మతాలు, భాషల వారీగా విభజన రేఖలను సృష్టిస్తున్న వ్యక్తి లేకుండా పోవాలని పవాయ్ టౌన్‌లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పిలుపు నివ్వడం వివాదాస్పదం అయింది.

ఈ అంశంపై ఆయనపై భారతీయ శిక్షా స్మృతిలోని 451, 504, 505,506 సెక్షన్ల మేరకు ఎఫ్‌ఐఆర్ బుక్ అయింది. శాంతిభద్రతల విచ్ఛిన్నానికి, పరిధి దాటి మాట్లాడటం, దుష్ప్రవర్తనకు దిగడం వంటి అభియోగాలు ఈ సెక్షన్ల పరిధిలోకి వస్తాయి. ప్రధాని మోడీపై ఈ వ్యాఖ్యలకు సంబంధించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ నిజస్వరూపం ఇటువంటి వ్యాఖ్యలతో తరచూ స్పష్టం అవుతూ వస్తోందని తెలిపారు. భారత్ జోడో యాత్ర నిర్వహణ వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు ఈ కాంగ్రెస్ నేత పరుష పదజాలంతో వెలుగులోకి వచ్చాయని విమర్శించారు.

దేశ ప్రధానిపై ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలకు దిగిన వ్యక్తిపై వెంటనే పోలీసు కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్‌పిని సిఎం పాటిల్ ఆదేశించారు. అంతకు ముందు కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో క్లిప్‌ను రాష్ట్ర బిజెపి అధ్యక్షులు విడి శర్మ వెల్లడిస్తూ, ప్రధానిని అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపారు. మరో వైపు రాష్ట్ర బిజెపి ప్రతినిధి బృందం ఒకటి డిజిపిని కలిసింది. పటేరియాను అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేసింది.

ఓడించాలనేదే నా ఉద్ధేశం: కాంగ్రెస్ నేత వివరణ
అయితే మోడీపై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని కాంగ్రెస్ నేత పటేరియా తరువాత వివరణ ఇచ్చుకున్నారు. ప్రధాని మోడీని ఎన్నికలలో ఓడించేందుకు, ఈ విధంగా రాజకీయంగా ఆయనను అంతమొందించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలనేదే తన మాటల్లోని ముఖ్యాంశం అని తేల్చిచెప్పారు. రాజ్యాంగం, దళితులు, మైనార్టీల రక్షణకు మోడీని అధికారంలో లేకుండా చేయాల్సి ఉందనేదే తన ఉద్ధేశం అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News