Tuesday, May 14, 2024

దేశంలో సామూహిక వ్యాప్తి లేదు

- Advertisement -
- Advertisement -

ఐసిఎంఆర్ ప్రకటన
లాక్‌డౌన్ కారణంగా కరోనా వ్యాప్తి కట్టడి
0.73 శాతం మందికే సోకిన వైరస్
మరణాలు కూడా తక్కువే
అయితే ఇంకా ఎక్కువ మందికి వైరస్ సోకే ప్రమాదం
సీరమ్ టెస్టుల్లో వెల్లడయిన వాస్తవాలు

Corona virus no community transmission

న్యూఢిల్లీ : దేశమంతా కరోనా మహమ్మారి భయంతో వణికిపోతున్న సమయంలో భారత వైద్య పరిశోధనా మండలి( ఐసిఎంఆర్) చల్లటి కబురు అందించింది. దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి ఎంతమాత్రం లేదని ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ గురువారం మీడి యా సమావేశంలో వెల్లడించారు. అంతేకాదు లాక్‌డౌన్, కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందకుండా విజయవంతంగా అడ్డుకోగలిగాయని కోవిడ్19పై దేశంలో తొలిసారిగా నిర్వహించిన సీరమ్ పరీక్షలో వెల్లడయినట్లు ఆయన చెప్పారు. ఈ సీరమ్ పరీక్ష రెండు దశలుగా ఉంటుంది. దేశంలోని సాధారణ ప్రజల్లో ఎంత శాతం మంది కరోనా వైరస్ బారిన పడ్డారన్నది అంచనా వేయడం తొలి దశ అయితే హాట్‌స్పాట్ నగరాల్లోని కంటైన్మెంట్ జోన్లలో ఎంత శాతం ప్రజలకు కరోనా వైరస్ సోకిందో అంచనా వేయడం రెండో దశ.

మొదటి దశ పూర్తి కాగా, రెండో దశ కొనసాగుతోందని భార్గవ చెప్పారు. రాష్ట్రాల ఆరోగ్య విభాగాలు, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్‌ఎన్‌సిడిసి), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఓ)లతో కలిసి ఐసిఎంఆర్ ఈ సర్వేను నిర్వహిస్తోంది. ఈ సర్వే కింద నమోదు చేసుకున్న 83 జిలాల్లోని 26,400 మందిని ఈ అధ్యయనంలో భాగంగా సర్వే చేస్తారు. కాగా ఇప్పటివరకు 65 జిల్లాల్లో ఈ సర్వే పూర్తయింది. ఈ జిల్లాల్లోని జనాభాలో కేవలం 0.73 శాతం జనాభాకు మాత్రమే కరోనా వైరస్ సోకినట్లు ఈ సీరమ్ సర్వేలో తేలినట్లు భార్గవ చెప్పారు. లాక్‌డౌన్‌తో పాటుగా, కరోనా కట్టడికి తీసుకున్న చర్యల కారణంగా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగామని ఈ సర్వేలో తేలినట్లు భార్గవ చెప్పారు.

అయితే దేశ జనాభాలో ఇంకా అధిక శాతం ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని దీన్ని బట్టి తెలుస్తోందని, పట్టణప్రాంతాల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకన్నా పట్టణ ప్రాంతాల్లో 1.09 రెట్లు, పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల్లో 1.89రెట్లు ఎక్కువ ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. అంతేకాకుండా వైరస్ సోకిన వారిలో మరణాల రేటు కూడా చాలా తక్కువగా అంటే 0.08 శాతం మాత్రమే ఉందని, కంటైన్మెంట్ జోన్లలో వైరస్ ఎక్కువగా ఉన్నట్లు కూడా ఈ సర్వేలో తేలినట్లు భార్గవ తెలిపారు.

అయితే ఈ సర్వే ఇంకా కొనసాగుతోందని ఆయన చెప్పారు. దేశ జనాభాలో అత్యధిక శాతానికి ఈ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున మందులకన్నా కూడా భౌతిక దూరాన్ని పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు కర్చీఫ్ లేదా, టిష్యూ పేపర్ అడ్డుపెట్టుకోవడం లాంటివి పాటించడం చాలా అవసరమని భార్గవ చెప్పారు. పట్టణాల్లో మురికి వాడల్లో వైరస్ ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఇదివరకే సూచించినట్లుగా లాక్‌డౌన్ చర్యలు కొనసాగించాలిన అవసరం ఉందని ఆయన చెప్పారు. వైరస్ కట్టడికి చర్యలను రాష్ట్రప్రభుత్వాలు కఠినంగా అమలు చేయడం ద్వారా వైరస్ వ్యాప్తి, తీవ్రతను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని , ఈ విషయంలో ఉదాసీనత పనికి రాదని భార్గవ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News