Monday, April 29, 2024

గోషామహల్ సర్కిల్.14లో కరోనా ‘విజృంభణ’

- Advertisement -
- Advertisement -

Goshamahal

 64కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
వైరస్ విజృంభిస్తున్నా పట్టించుకోని జిహెచ్‌ఎంసి
ఎస్‌బిఐ బ్యాంకు ఉద్యోగి మృతి
60 మంది ఉద్యోగులకు హోం క్వారంటైన్‌కు తరలింపు

గోషామహల్: జిహెచ్‌ఎంసి సర్కిల్-14 పరిధిలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగి పోతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గోషామహల్ సర్కిల్ పరిధిలో నగరంలోనే పేర్గాంచిన బేగంబజార్, మహరాజ్‌గంజ్, ముక్తార్‌గంజ్, ఉస్మాన్‌గంజ్ మార్కె ట్లు ఈ సర్కిల్‌లోనే ఉన్నాయి. గోషామహల్ సర్కిల్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు శరవేగంగా విస్తరిస్తుండటం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది.

ఆదివారం నాటికి సర్కిల్ పరిధిలో 60 కరోనా కేసులు నమోదు కాగా తాజాగా సోమవారం ధూల్‌పేట్ శివలాల్‌నగర్‌లో మరో నలుగురికి పాజిటివ్ వచ్చింది. కోఠి బ్యాంక్‌స్ట్రీట్‌లోని ఎస్‌బిఐ కమర్షియల్ బ్యాంక్‌లో మెస్సెంజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి కరోనా సోకి చికిత్సలు పొందుతూ మరణించాడు. దీంతో బ్యాంకు అధికారులు 60 మంది ఉద్యోగులను హోం క్వారంటైన్‌కు తరలించారు. గోషామహల్ సర్కిల్ పరిధిలో నగరంలోనే ఖ్యాతి గాంచిన మార్కెట్లు ప్రముఖ వ్యాపార వాణిజ్య కేంద్రాలు, మురికివాడలు, బస్తీలు అధికంగా ఉండటంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది.

కామాటిపురాలో ఒకే భవనంలోని 24 మందికి కరోనా పాజిటివ్ వచ్చినా, జుంగుర్‌బస్తీలో ఒకే ఇంట్లోని 15 మందికి పాజిటివ్ వచ్చినా జిహెచ్‌ఎంసి అధికారులు కేవలం కామాటిపురాలోని భవనాన్ని మాత్రమే కంటైన్మెంట్ చేసి చేతులు దులుపుకున్నారే తప్ప కామాటిపురాను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించలేదు. అదే విధంగా జుంగుర్‌బస్తీలో 15 మందికి కరోనా పాజిటివ్ వచ్చిన ఇంటిని మాత్రమూ కంటైన్మెంట్ చేసి, జుంగుర్‌బస్తీని కంటైన్మెంట్ చేయకపోవడం పట్ల స్థానికులు జిహెచ్‌ఎంసి అధికారుల తీరు పట్ల ఆగ్రహంతో పాటు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్‌ఎంసి కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు సర్కిల్ పరిధిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని కోరుతున్నారు.

ధూల్‌పేల్‌లో నలుగురికి…

గోషామహల్ సర్కిల్ పరిధిలోని ధూల్‌పేట్ శివలాల్‌నగర్‌కు చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. బిఎస్‌ఎన్‌ఎల్ కార్మికురాలు (60)కి కరోనా పాజిటివ్ రావడంతో ఆమె ఇంట్లో నివసించే 20 మందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించి, పరీక్షలు చేయగా ఆమె కోడళ్లు (28), (25)లతో పాటు ఆమె కుమార్తె (26), మనవరాలు (10)లకు సోమవారం పాజిటివ్‌గా నిర్థ్దారణ అయ్యింది.

హోం క్వారంటైన్‌కు 60 మంది బ్యాంకు ఉద్యోగులు

కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థానిక ప్రధాన కార్యాలయంలోని కమర్షియల్ బ్రాంచ్‌లో మెసేంజర్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి క రోనా పాజిటివ్‌తో మృతిచెందాడు. కాచిగూడ డివిజన్ పరిధిలోని నింబోలిఅడ్డలో నివసించే (57) సంవత్సరాల వయస్సు గల వ్యక్తి ప్రతిరోజూ బ్యాంకుకు వచ్చే వినియోగదారులు ఇచ్చే వోచర్లను బ్యాంకు ఉద్యోగులకు అందజేస్తుంటాడు.

అతనికి కొన్ని రోజుల క్రితం దగ్గు, జ్వరం రావడంతో సెలవులో ఉన్నాడు. కాగా ఈ నెల 14న అతను బ్యాంకులోని డిస్పెన్సరీలో చికిత్సలు చేయించుకున్నా తగ్గకపోవడంతో మెరుగైన చికిత్సల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా అతన్ని పరీక్షించిన వైద్యులు గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేయగా అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

సోమవారం సదరు వ్యక్తి మృతి చెందడంతో వైద్య సిబ్బంది నింబోలిఅడ్డ కామ్‌గార్‌నగర్‌లోని అతని కుటుంబ సభ్యులతో పాటు ఎస్‌బిఐ కమర్షియల్ బ్యాంక్‌లో పనిచేస్తున్న 60 మంది ఉద్యోగులను హోం క్వారంటైన్‌కు తరలించారు. ఉద్యోగుల ఫోన్ నెంబర్‌లు, చిరునామాలు సేకరించిన బ్యాంకు అధికారులు చిన్న జ్వరం, దగ్గు వచ్చిన వెంటనే తమను సంప్రదించాలని బ్యాంకు ఉద్యోగులకు వైద్యసిబ్బంది ఆదేశాలు జారీ చేశారు.

 

Coronavirus Outbreak in Goshamahal Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News