Monday, April 29, 2024

కిట్టీ పార్టీలతో కోట్లకు టోపీ

- Advertisement -
- Advertisement -

Couple Fraud with name of Kitty parties

బాధితుల ఫిర్యాదుతో శిల్పా చౌదరి, శ్రీనివాస్ దంపతుల అరెస్టు

రూ.20 నుంచి 25 కోట్ల వరకు మోసం ధనిక
కుటుంబాల పిల్లలు, కోడళ్లే టార్గెట్ 10ఏళ్లుగా
సాగుతున్న దందా రూ.1.05కోట్లు ఇచ్చిన
దివ్యారెడ్డి ఇచ్చిన నాలుగు చెక్కులు
చెల్లకపోవడంతో అనుమానం అడగడానికొచ్చిన
దివ్యకు బౌన్సర్లతో బెదిరింపు 20 మంది నుంచి
ఫిర్యాదులు బాధితుల్లో టాలీవుడ్ ప్రముఖులు

మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని, అధిక వడ్డీ ఇస్తామని చెప్పి పలువురి వద్ద కోట్లాది రూపాయలు తీసుకుని మోసం చేసిన దంపతులను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిపేట సిగ్నేచర్ విల్లాలో ఉంటున్న శిల్పాచౌదరి, శ్రీనివాస్ దంపతులు సినిమాల నిర్మాణంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. బడాబాబుల పిల్లలు, కోడళ్లను టార్గెట్‌గా చేసుకుని శిల్పా చౌదరి కిట్టీ పార్టీలు నిర్వహిస్తోంది. పార్టీకి వచ్చిన వారికి తన వ్యాపారానికి సంబంధించిన పలు విషయాలు చెప్పి బుట్టలో వేసేది. దాదాపుగా పదేళ్ల నుంచి కిట్టీ పార్టీలు నిర్వహిస్తోంది. అప్పటి నుంచి పలువురికి మాయమాటలు చెప్పి కోట్లాది రూపాయలు వసూలు చేసింది. రియల్ ఎస్టేట్, అధిక వడ్డీ ఇస్తానని, ఎవరికి కావాల్సింది వారికి చెప్పేది. ఈ క్రమంలోనే పుప్పాలగూడకు చెందిన దివ్యరెడ్డి, శిల్పా చౌదరికి పరియం ఏర్పడింది.

ఇద్దరి మధ్య పదేళ్ల నుంచి పరిచయం ఉంది. దీంతో అధిక వడ్డీ ఇస్తానని శిల్పా చౌదరి చెప్పడంతో దివ్యరెడ్డి రూ.1.05కోట్లు ఇచ్చింది. డబ్బులు తీసుకున్న తర్వాత దివ్యకు అనుమానం రాకుండా ఉండేందుకు నాలుగు చెక్కులు ఇచ్చింది. వాటిని దివ్యరెడ్డి బ్యాంక్‌లో వేయగా బౌన్స్ అయ్యాయి. దీంతో డబ్బులు అడిగేందుకు వెళ్లిన దివ్యను బౌన్సర్లతో బెదిరించింది. డబ్బులు ఇవ్వకపోవడంతో పలుమార్లు ఒత్తిడి చేసింది. అయినా కూడా శిల్పా చౌదరి డబ్బులు తిరిగి ఇవ్వలేదు, దీంతో బాధితురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె బ్యాంక్ ఖాతాలను కూడా పరిశీలించారు. దివ్య నుంచి కోటి రూపాయలకు పైగా శిల్పా చౌదరి తీసుకున్నట్లు పోలీసులకు తెలిసింది. శిల్పాచౌదరి, ఆమె భర్త శ్రీనివాసరావును శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కిలాడీ దంపతులను కస్టడీకి ఇవ్వాల్సిందిగా రాజేంద్రనగర్ కోర్టులో నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో వీరి మోసాలు మరిన్ని బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు నార్సింగి పోలీసులకు శిల్పాచౌదరి చేతిలో మోసపోయిన ఇరవైమంది ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన వారు బయటికి వచ్చి ఫిర్యాదు చేయాలని నార్సింగి పోలీసులు కోరుతున్నారు.

శిల్పచౌదరి చేతిలో మోసపోయిన హీరోలు…

శిల్ప చౌదరి మాటలు నమ్మి టాలీవుడ్‌కు చెందిన ముగ్గురు హీరోలు కూడా డబ్బులు ఇచ్చి మోసపోయినట్లు తెలిసింది. ఇందులో ఓ ప్రముఖ హీరో ఉన్నట్లు తెలిసింది. అలాగే అతడితోపాటు మరో ఇద్దరు హీరోలు కూడా నిందితురాలికి డబ్బులు ఇచ్చినట్లు తెలిసింది. కిలాడి లేడీకి సినీ ఇండస్ట్రీతో పరిచయం ఉండడంతో ఓ సినిమాను నిర్మించింది. శిల్ప దంపతులు సహేరి అనే సినిమా తీశారు, కాని సినిమాపై వివాదం చెలరేగడంతో రిలీజ్ కాకుండా ఆగిపోయింది. అధిక వడ్డీ ఇస్తానని చెప్పడంతో వ్యాపారవేత్తలు, ఫైనాన్సర్లు, లాయర్లు, సినీ ప్రముఖులు డబ్బులు ఇచ్చినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News