Monday, April 29, 2024

నవంబర్‌లో ‘పీక్’కు కరోనా!: ఐసిఎంఆర్ వెల్లడి

- Advertisement -
- Advertisement -

అప్పటికి ఐసియు బెడ్స్, వెంటిలేటర్ల కొరత ఏర్పడవచ్చు
తారస్థాయి సమయాన్ని జాప్యం చేసిన లాక్‌డౌన్
ఇన్‌ఫెక్షన్ రేటు, మరణాలూ తగ్గడానికి కారణమైంది
ఐసిఎంఆర్ తాజా అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ: యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారి భారత్‌లో నవంబర్ మధ్య నాటికి తారస్థాయికి చేరుకుంటుందని ఓ అధ్యయనంలో వెల్లడయింది. అప్పుడు ఐసొలేషన్ పడకలతో పాటుగా ఐసియు బెడ్స్, వెంటిలేటర్ల కొరత ఏర్పడవచ్చని ఆ అధ్యయనం అంచనా వేసింది. అయితే ఎనిమిది వారాల లాక్‌డౌన్ వల్ల కరోనా ‘పీక్’కు చేరుకోవడం కొంత కాలం వాయిదా పడిందని తెలిపింది. అదే సమయంలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాల మెరుగుకు లాక్‌డౌన్ ఉపయోగపడిందని తెలిపింది. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) ఏర్పాటు చేసిన ఆపరేషన్ రిసెర్చ్ గ్రూపు ఈ అధ్యయనం నిర్వహించింది. కరోనా మహమ్మారి నియంత్రణకు కేంద్రం విధించిన లాక్‌డౌన్ వల్ల వైరస్ గరిష్ఠస్థాయికి చేరుకోవడం సుమారు 34 రోజులనుంచి 76 రోజుల వరకు వాయిదా పడిందని పరిశోధకులు తేల్చారు. అలాగే 69నుంచి 97 శాతం ఇన్‌ఫెక్షన్ రేటును తగ్గించడానికి ఇది తోడ్పడిందని ఆ అధ్యయనం లో తేలింది. లాక్ డౌన్ తర్వాత సుమారు 60 శాతం ప్రజారోగ్య వ్యవస్థ పటిష్ఠమైందని పేర్కొంది.

ఈ ప్రజారోగ్య చర్యలు నవంబర్ మొదటివారం వరకు డిమాండ్‌ను తట్టుకోగలుగుతాయని, ఆ తర్వాత కొరత ఏర్పడవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ఐసొలేషన్ పడకలు 5.4 నెలలు, ఐసియు బెడ్స 4.6 నెలలు, వెంటిలేటర్లు 3.9 నెలల పాటు సరిపోకపోవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అయితే ఒక వేళ లాక్‌డౌన్ విధించక పోయి ఉన్నా, మౌలిక సదుపాయాలపై దృష్టిపెట్టకపోయి ఉంటే ఎదురయ్యే డిమాండ్‌తో పోలిస్తే ఇది 83 శాతం తక్కువేనని వారు తెలిపారు. అదే సమయంలో ప్రజారోగ్య వ్యవస్థను 80శాతం మెరుగుపరిచి ఉంటే ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వీలయ్యేదని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడ్డారు. కాగా లాక్‌డౌన్ సమయంలో టెస్టింగ్, చికిత్స, రోగుల ఐసొలేషన్ లాంటి వాటి కోసం అదనంగా ఏర్పాటు చేసుకున్న సదుపాయాల కారణంగా వైరస్ తారస్థాయికి చేరుకున్న సమయంలో కేసుల సంఖ్య 70 శాతం, మొత్తం కేసులు దాదాపు 27 శాతం తగ్గుతాయని ఆ అధ్యయనం అంచనా వేసింది. అలాగే మరణా సంఖ్య కూడా దాదాపు 60 శాతం మేర తగ్గించగలిగామని శాస్త్రజ్ఞులు ఆ అధ్యయనంలో అభిప్రాయపడ్డారు. కాగా మొత్తగా కరోనా మహమ్మారిపై వెచ్చించే మొత్తం దేశ స్థూల ఉత్పత్తి( జిడిపి)లో 6.2 శాతం ఉండవచ్చని అధ్యయనం అంచనా వేసింది.

COVID-19 peak in India may arrive mid Nov: ICMR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News