Monday, April 29, 2024

నేర రాజకీయాలను అడ్డుకోవాలి

- Advertisement -
- Advertisement -

భారత ప్రజాస్వామ్యం నేరచరితుల చేతిలో బందీ అయింది. స్వచ్ఛమైన రాజకీయాలు, విలువలతో కూడిన సేవాతత్పరులు, అభివృద్ధి రాజకీయాలు కనుచూపు మేరలో కనిపించనిస్థితి నెలకొన్నది. దురాజకీయాల ఉధృతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం కావడం ఆధునిక రాజకీయాల లక్షణ మైంది. గెలుస్తున్న ప్రతి ముగ్గురిలో ఒకరు నేరచరిత్ర కలిగిన వారేనని ఇటీవల ఎడిర్ సంస్థ అధ్యయనంలో తేలింది. మాజీ రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ రాజకీయ పార్టీలు నేర చరిత్రలేని వారికే టికెట్లు ఇస్తామని చెప్పే ధైర్యం లేదా అన్న ప్రశ్న నేటికీ ప్రశ్నగానే మిగిలింది. నేరచరిత వున్న రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు దేశానికి ఇబ్బంది. అధికారంలో ఇలాంటి వారు వుండడం ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు. 75 యేళ్ళ స్వాతంత్య్ర భారత దేశంలో చట్టసభలకు నేరచరిత్ర కలిగిన అభ్యర్థులు ఎన్నికయ్యే దౌర్భాగ్య పరిస్థితి నుండి భారత దేశం ఎప్పుడు బయటపడుతుంది.

రాజకీయాలలో నేరస్థుల ప్రవేశాన్ని కట్టడిచేయడానికి దశాబ్దాలుగా న్యాయ వ్యవస్థ ప్రయత్నం చేస్తూనే ఉంది. అయినా స్వార్థ, సంకుచిత రాజకీయ పక్షాలు ఎన్నికలలో నేరచరిత్ర కలిగిన అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించడంలో పోటీ పడడం వల్ల ప్రజాస్వామ్యం నేరస్వామ్యంగా రూపాంతరం చెందే పరిస్థితులు దాపురించే పరిస్థితుల పట్ల సామాజిక ఆర్థికవేత్తలు, న్యాయకోవిదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టసభలు ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన సాంఘిక, ఆర్థిక, పంపిణీ న్యాయం చేకూర్చని సంకట స్థితి నెలకొంది. ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు చేసిన హెచ్చరికలను, ఆదేశాలను స్వార్థ రాజకీయ పార్టీలు పెడచెవిన పెట్టడం వల్ల రాజకీయాలలో అవినీతి, బంధుప్రీతి, కుల, మత, ప్రాంతీయ తత్వం వేళ్ళూనుకొనిపోయింది. రాజకీయ పార్టీలు అవినీతిపరులకు. నేరచరితులకు, స్కాంలలో చిక్కుకున్న వారికి, ధనస్వాములకు, నల్లధనం ఉన్నవారికి, కండబలం గల రౌడీలకు, గుండాలకు, హింస, హత్యలు, కుట్రలు, దోపిడీలు, కుంభకోణాల్లో సంబంధాలు వున్న అభ్యర్థులకు, మాఫియా గ్యాంగులకు, స్మగ్లర్లకు, దేశద్రోహులకు పార్టీలు టికెట్లుఇచ్చి ఎన్నికల బరిలో నిలపడం వల్ల ఓటర్లను ప్రలోభాలకు ప్రభావితం చేస్తూ డబ్బు, మద్యం, నోటుకు ఓటు, ఉచితాల ప్రకటనతో చీర, సార, టివిలను ఎరగాచూపి ఓటును కొనే వికృత విషసంస్కృతి రాజ్యమేలడంవల్ల ఎన్నికల సమయం లో పవిత్రమైన ఓటును ఎన్నికల మార్కెట్‌లో (ఓటరును) ఒక వస్తువు స్థాయికి దిగజార్చడం ప్రజాస్వామ్యానికి విఘాతంగా పరిణమించిందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నేడు భారత రాజకీయాలు ఓట్లు, నోట్లు, సీట్ల కేంద్రంగా చెలామణి అవుతున్నాయి. రాజకీయాలలో నేరస్థుల సంఖ్య పెరగడంపట్ల సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ నేరస్థుల ప్రవేశంపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల మీద దాఖలైన క్రిమినల్ కేసులు దశాబ్దాలుగా విచారణ కొనసాగడం, వాయిదా పడడం, తీర్పులు రాకపోవడం వల్ల తన విచారాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ నేరస్థులపై ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని కోర్టులకు మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. కేసులు నమోదై అభియోగాలు, కోర్టులో ఆరోపణలు ఉన్నవారిపై విచారణ ఒక ఏడాదిలోపు పరిష్కారం చేయాలని సూచించడం జరిగింది.పార్లమెంట్‌లో కనీసం 43% ఎంపిలపె క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ సుప్రీమ్‌కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడైంది. ఇటీవల అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్(ఎడిఆర్) నేషనల్ ఎలక్షన్ వాచ్ శాసన సభకు పోటీ చేసే అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా రూపొందించిన నివేదిక ప్రకారం దేశంలో 28 రాష్ట్రాల అసెంబ్లీలకు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అసెంబ్లీలకు ఎన్నికైన శాసన సభ్యుల్లో 44% మంది నేరచరితులు అని తేలింది. మహిళలపై నేరాలకు పాల్పడిన శాసన సభ్యుల సంఖ్య 114 కాగా, వీరిలో 14 మంది 376 సెక్షన్ కింద అత్యాచార నిందితులు కావడం గమనార్హం.

అధికార పక్షం, ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలలో నేరచరితులు ప్రవేశాన్ని అడ్డుకోలేకపోతున్నాయి. గతంలో ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో రాజకీయ పార్టీలు నేరస్థులకు సీట్లు కేటాయించాయి. రెండో విడత జరిగిన పోలింగ్‌లో పోటీ చేసిన వారిలో 25% మంది పై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్ పేర్కొంది. 2018లో చట్టసభల సభ్యులపై నమోదైన కేసుల సంఖ్య 4110 ఉండగా, 2021 నాటికి 4984 సంఖ్య చేరింది. ఈ కేసులో దాదాపు మూడు దశాబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులు అసంఖ్యాకంగా ఉన్నాయి.2320 కేసులు ప్రస్తుత చట్టసభ సభ్యులపై నమోదై ఉన్నాయి.1675 కేసులు మాజీ ప్రజాప్రతినిధులపై ఉన్నా యి. 1991 కేసులుపై అభియోగాలు ఇంకా దాఖలు కాని స్థితిలో ఉన్నాయి. 264 కేసులు వివిధ హైకోర్టులో స్టే వుండడం వల్ల విచారణ ముందుకు సాగడం లేదు. ఈ కోవకు చెందిన కేసుల సంఖ్య ఉత్తరప్రదేశ్ 1339 కేసులతో మొదటి స్థానంలోఉంది. రాజకీయ పార్టీలకు, నేరస్థులకు మధ్య ఉన్న సంబంధం రోజురోజుకు బలపడుతుంది అని గణాంకాలు చెబుతున్నాయి.

చట్టసభల సభ్యులపై నమోదైన కేసులను సత్వరమే విచారించాలన్న పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది.జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలో ధర్మాసనం ఈ కేసు విచారణకు తీసుకుంది. దీని ప్రాధాన్యతను గుర్తించి అత్యవసర విచారణ జరపాలని పేర్కొన్నది. సీనియర్ న్యాయవాది కోర్టు సహాయకులు హన్సారియ పిటిషన్ దాఖలు చేశారు. నేరస్థులు రాజకీయాల్లోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అన్న హన్సారియా సూచన హర్షణీయం. తక్షణ జాతీయ అవసరంగా ప్రభుత్వం గుర్తించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సూచనను రాజకీయ పార్టీలు ఆమోదించాలి. స్వాగతించాలి. సిబిఐ, ఇతర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు ప్రక్రియను వేగవంతం. చెయ్యాలి అవినీతి, కుంభకోణాల మీద విచారణ చేసే సంస్థలు అధికార పక్షానికి, అధికార పార్టీకి వత్తాసుగా మారిందన్న విమర్శలు వున్నాయి. దర్యాప్తులో అనవసరపు జాప్యం చోటు చేసుకుంటున్నదనే విమర్శలు లేకపోలేదు. దశాబ్దాలు దాటినా దర్యాప్తు పూర్తి కాలేదు. సిబిఐ విచారణ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడం విచారం. దర్యాప్తు సంస్థలు పాలక పక్షాలకు అనుకూలంగా ఉన్నంత కాలం ప్రభుత్వాలు రాజ్యాంగ రక్షణ చట్టాలను అమలు చేసి సామాన్యులకు సంక్షేమ ఫలితాలు అందించలేవు.

రాజ్యాంగ ప్రసాదించిన సాంఘిక ఆర్థిక సామాజిక పంపిణీ న్యాయం జరగడం లేదు. కనీస అవసరాలు తీరక జీవన ప్రమాణాలు మెరుగుపడే పరిస్థితులులేవు. చట్టసభల్లో పోటీచేసే అభ్యర్థుల అఫిడవిట్లను ఆన్‌లైన్‌లో పెట్టాలి. అంతేకాకుండా అభ్యర్థులపై విచారణలో పెండింగ్‌లో ఉన్న కేసు వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని 2020లో అన్ని పార్టీలను సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ వీటిని పార్టీలు పాటించడం లేదు. తమపై నమోదైన కేసు వివరాలను ట్యాంపరింగ్ చేస్తున్న సంఘటనలు చోటు చేసుకోవడం విచారకరం. కొందరు ప్రజాప్రతినిధులు తమ పలుకుబడిని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమ మీద నమోదైన కేసులను ఉపసంహరించుకుంటున్నారు. హైకోర్టు అనుమతి లేకుండా కేసులను ఉపసంహరించరాదని ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలు అమలుకు నోచుకోలేదు. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల పరిష్కారానికి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని 2018లో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఇప్పటి వరకు కమిటీ ఏర్పాటు కాలేదు. అధికార పార్టీకి నేర రహిత రాజకీయ వ్యవస్థ నిర్మాణం పట్ల, రాజ్యాంగం అమలు పట్ల అవగాహన కలిగి చిత్తశుద్ధితో అమలు చేయాలన్న దృక్పథం కలిగి వుండాలి.

చట్టసభల్లో నేరస్థులను అడ్డుకునే విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు, ఆదేశాలను, సుప్రీమ్‌కోర్టు సూచనలు అమలుచేసే విశ్వసనీయత పాలనలో చోటు చేసుకోవడం తక్షణ రాజకీయ అనివార్యంగా పరిణమించింది.రాజకీయ పార్టీలు తమ విధానాలను పునఃసమీక్షచేసుకోవాలి. రాజకీయ పార్టీల ఉదాసీనతతో చట్ట సభల్లో నేరస్థుల సంఖ్య పెరిగి ప్రజలకు చట్టబద్ధ పాలన, జవాబుదారీతనం, పారదర్శకత లోపించి ప్రగతి పురోగతి ఎండమావిగా తయారయింది. ప్రజాస్వామ్యం బలహీనపడి ప్రజలకు మెరుగైన పాలన కరువై నేర కార్యకలాపాలు పెరుగుతాయి. సామాజిక అసమానతలు, చట్టాల ఉల్లంఘన ప్రజల ఆస్తులకు రక్షణ కొరవడుతుంది. ఆర్థిక, సామాజిక జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు జరిగే ఎన్నికల్లో డబ్బు ప్రభావం ప్రవాహమైంది. ఎన్నికల్లో గెలవడం దోచుకోవడం, దాచుకోవడం ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించడం తక్కువ ధరకు ప్రభుత్వ భూములను విక్రయించడం, రాజకీయ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవడం నేటి రాజకీయాల లక్షణమైంది. ఎన్నికల కమిషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేర వివరాలు పోలింగ్ బూత్ వద్ద ఏర్పాటు చెయ్యాలి. ఎన్నికైన అభ్యర్థి ప్రమాణ పత్రాన్ని పోలింగ్ బూత్ వద్ద ఏర్పాటు చెయ్యాలి. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చేసే ఎన్నికల వ్యయం మీద వున్న నియంత్రణ చట్టాలను కఠినంగా అమలు చెయ్యాలి.

ఎన్నికలకు ముందు పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రజాప్రతినిధులు ఆస్తులు, అప్పుల వివరాలు బహిరంగంగా ప్రకటించాలి. రాజకీయాలలో ఉత్తమ ప్రమాణాలు సాధించడానికి ‘ఆలిండియా పొలిటికల్ సర్వీస్ కమిషన్’ నెలకొల్పి ఈ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అర్హత పొందిన అభ్యర్థులకు చట్టసభల్లో పోటీ చేయటకు అర్హులుగా నిర్ణయించే (ఎలిజిబిలిటీ టెస్ట్) చట్టాన్ని రూపొందించాలి. రాజకీయ పార్టీలు ఉత్తములను, ఉత్తమ ప్రతినిధులను ప్రజాభీష్టాన్ని, ఆకాంక్షలను నెరవేర్చే ప్రతిభ, సామర్ధ్యం కలిగిన సంఘ సేవకులకు టిక్కెట్లు ఇవ్వాలి. మేధావులు శాస్త్రవేత్తలు న్యాయ నిపుణులు, పాలనావేత్తలు, ఆర్థిక వేత్తలు చట్టసభలో ప్రవేశించాలి. జాతీయ చట్టాల నిర్మాణ ప్రక్రియలో క్రియా శీల పాత్ర పోషించి రాజ్యాంగ లక్ష్యాలైన సాంఘిక, సామాజిక, ఆర్థిక, పంపిణీ, న్యాయం నెరవేర్చే కార్యక్రమాల అమలు దిశగా ప్రజాప్రతినిధులు ప్రవర్తించాలి. ప్రజా మేనిఫెస్టో రూపొందించి సమస్యల గుర్తింపు పరిష్కార మార్గాలతో అభివృద్ధి వ్యూహాలను అమలు చేసే అంకిత భావం, శక్తి సామర్ధ్యాలు ఉన్న వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలి. నేరరహిత రాజకీయాలతో పార్టీలు ముందుకు రావాలి. ఉత్తమ ప్రజా ప్రతినిధులతో, ఉన్నత విలువలతో రాజకీయ రంగంలో నెలకొన్న నేరమయ రాజకీయాలకు చరమగీతం పాడాలి. భారత దేశ ప్రజాస్వామ్యాన్ని మనీ మాఫియా కోరల్లో నుండి విముక్తి చేయాలి. నేర రహిత రాజకీయ భారత్ ఆవిర్భావానికి ముందుకు రావాలి. రాజకీయ పార్టీలు, పౌర సమాజం విజ్ఞత గల ఓటర్లు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవా సంస్థలు, మహిళా సంఘాలు నేరమయ రాజకీయాలకు కల్లెం వేసే దిశగా ఉద్యమి స్థాయిని ఆశిద్దాం. భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వుంటే సరిపోదు, ఆదర్శవంతమైన దేశంగా పరిణామం చెంది ప్రపంచంలో ఆదర్శ ప్రజాస్వామ్య వ్యవస్థగా వెలుగొందాలని ఆశిద్దాం.

– నేదునూరి కనకయ్య, 9440245771.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News