Monday, April 29, 2024

చైనీస్‌కు బ్యాంక్ ఖాతా ఇచ్చిన యువకుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సైబర్ నేరాలు చేస్తున్న చైనా దేశస్థులకు బ్యాంక్ ఖాతా నంబర్ ఇచ్చి సహకరిస్తున్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… ఎపిలోని తిరుపతికి చెందిన నేష్‌నార్ సిరీష్ కుమార్ చైనాకు చెందిన సైబర్ నేరస్థులకు కమీషన్ తీసుకుని బ్యాంక్ ఖాతా ఇచ్చాడు. హైదరాబాద్, లోయర్ ట్యాంక్‌బండ్‌కు చెందిన బాధితుడికి సైబర్ నేరస్థులు వాట్సాప్, టెలీగ్రామ్‌లో కాంటాక్ట్ అయ్యారు. తాము ఇచ్చిన చిన్న చిన్న గేమ్స్‌కు ఆడాలని, కొన్ని వస్తువులు ఆన్‌లైన్‌లో పెడుతామని వాటికి రేటింగ్ ఇవ్వాలని చెప్పారు. వీటి కోసం ముందుగా తక్కువ మొత్తంలో డిపాజిట్ చేయాలని, దానికి గాను కమీషన్ ఇస్తామని చెప్పారు. దీనిని నమ్మిన బాధితుడు వారు చెప్పినట్లు చేశాడు. దీంతో వారు బాధితుడికి మొదట్లో డబ్బులు పంపించారు. తక్కువ పెట్టుబడిపెడితే తక్కువ కమీషన్ వస్తుందని, ఒకేసారి ఎక్కువ డబ్బులు పెడితే ఎక్కువ కమీషన్ ఇస్తామని చెప్పారు.

దీనిని నమ్మిన బాధితుడు దశల వారీగా రూ.60లక్షలు సైబర్ నిందితులకు పంపించాడు. వాటిని తీసుకున్న నిందితులు బాధితుడి ఫోన్, మెసేజ్‌లకు స్పందించడం మానివేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి డబ్బులు తిరుపతికి చెందిన వ్యక్తి బ్యాంక్ ఖాతాకు వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకోగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సిరీష్ బ్యాంక్ ఖాతాలో సైబర్ నేరస్థులు రూ.1.5కోట్లు బదిలీ చేసినట్లు తెలుసుకున్నారు. సిరీష్ గతంలో చైనాకు వెళ్లి అక్కడ సైబర్ నేరస్థులను కలుసుకున్నట్లు తెలిసింది. వారు అక్కడి నుంచి ఇండియన్స్‌ను దోచుకుంటుండగా సిరీష్ బ్యాంక్ ఖాతాలో డబ్బులు వస్తున్నాయి.

ఇలా వచ్చిన డబ్బులను నిందితుడు చైనా వారికి బిట్‌కాయిన్స్ తదితర రూపాల్లో పంపిస్తున్నాడు. నిందితుడిపై పోలీసులు 420, 419,66(సి)(డి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ మధుసూదన్ రావు, ఎస్సై సతీష్ రెడ్డి, ఎఎసైస ఎన్‌ఎస్‌ఎస్ ప్రకాష్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News