Saturday, April 27, 2024

సైబర్ నేరగాళ్ల సరికొత్త పంథా

- Advertisement -
- Advertisement -
Cyber criminals Fraud in name of EPFO
 తాజాగా ఇపిఎఫ్ పేరిట మోసాలు
 సైబర్ క్రైంకు క్యూ కడుతున్న బాధితులు

మనతెలంగాణ/హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాను ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు. శని,ఆదివారాల్లో నగరంలో పలువురు బాధితులు సుమారు రూ.40 లక్షలకు పైగా పోగొట్టుకుని సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్‌ద్వారా, మెసేజ్‌ద్వారా, ఈమెయిల్, క్యూఆర్‌కోడ్ ద్వారా లాటరీల ద్వారా వివిధ మార్గాల్లో ద్వారా సైబర్ నేరగాళ్లు ఖాతాదారుల డబ్బును కాజేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి పిఎఫ్ ఖాతా కూడా అతీతం కాదని మోసాలకు పాల్పడుతున్నారు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్) తన సోషల్ మీడియా పేజీలలో ఆన్‌లైన్ మోసాలను గురించి సభ్యులను హెచ్చరిస్తు ఒక సూచన చేసింది. ఇతరులతో ఇపిఎఫ్ సమాచారాన్ని పంచుకోవడం మానుకోవాలని సభ్యులను కోరింది. ఇపిఎఫ్‌వొ ఆధార్, పాన్, యూఎఎన్, బ్యాంక్‌ఖాతా, ఒటిపి ఆన్‌కాల్, వాట్సాప్ సోషల్ మీడియా వంటి వ్యక్తిగత వివరాలను ఎప్పుడు అడగొద్దని స్పష్టం చేసింది.

ఇపిఎఫ్ సేవలను పొందేందుకు పీఎఫ్ ఖాతాదారులను డబ్బు డిపాజిట్ చేయమని అడగదని తేల్చిచెప్పింది. ఈ విధంగా ఎవరైనా కాల్ చేస్తే సమాధానం ఇవ్వొద్దని సూచించింది. మరిన్ని ఫిర్యాదులు, పరిష్కారం కోసం ఖాతాదారులు ఇపిఎఫ్‌వొ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరింది.లేనిపక్షంలో టోల్‌ఫ్రీ నంబర్ 1800-118-005కు కాల్ చేయాలని సూచించింది. ఈక్రమంలో ఇపిఎఫ్ సభ్యులు కావాల నుకుంటే ప్రభుత్వం నిర్వహించే ఫ్లాట్‌పారమ్ యుఎంఎఎన్‌జి యాప్‌లో ఈ సేవల సమాచారాన్ని పొందవచ్చని తెలిపింది. ఇదిలావుండగా ఇటీవల ఉద్యోగాలు మారిన వారు ఇంకా తమ ఇపిఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదీలీ చేయని వారు ఇలాంటి సైబర్ దాడులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని వివరించింది. గతేడాది లాక్‌డౌన్ సమయంలో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరిగాయని కంపెనీ తెలిపింది. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిని అనేక లీగల్ ఏజెన్సీలు బయటపెట్టాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలని ఇపిఎఫ్ ఖాతాదారులను హెచ్చరించింది.

సైలెంట్‌గా సైబర్ నేరాలు..

ఎస్‌బిఐ ఏటీఎంల నుంచి భారీ మొత్తంలో నగదు కట్ అయినట్లు మహబూబ్‌గంజ్ బ్రాంచ్‌కు చెందిన మేనేజర్ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బ్యాంకుకు సంబంధించిన ఎటిఎం మిషన్ల నుంచి వేరే బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వారు వేర్వేరు ఎటిఎంలలో రూ.7 లక్షల 30 వేల 400 నగదు డ్రా చేశారు. డ్రా చేసిన వ్యక్తులకు మిషన్ నుంచి డబ్బులు రాలేదంటూ తమ బ్యాంకుకు వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. వారి బ్యాంకు ఖాతా వివరాలను చెక్ చేయగా ఆయా ప్రాంతాల్లో నగదు విత్‌డ్రా అయినట్లు తమకు సిస్టంలో చూపిస్తోందన్నారు. ఈక్రమంలో రూ .7లక్షల 30వేల 400 ఎలా పోయాయో, ఎవరు తీశారో చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. అలాగే ఎస్‌బిఐ కెవైసి అప్‌డేట్ చేయకపోతే అకౌంట్ రద్దు అవుతుందని నమ్మించి మోసం చేశారంటూ శ్రీనగర్‌కాలనీకి చెందిన చంద్రవర్మ ఫిర్యాదు చేశారు. తన ఫోన్ నంబర్‌కు మెసేజ్ పంపిన వ్యక్తి కాల్ చేసి మెసేజ్ ఓపెన్ చేయమన్నట్లు పేర్కొన్నారు. అది ఓపెన్ చేశాక ఓటీపీ చెప్పడంతో ఆ వెంటనే అకౌంటులోంచి రూ.6 లక్షల 41వేల 59 స్వాహా చేసినట్లు ఆయన ఫిర్యాదు చేశారు.అదేవిధంగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగమంటూ తనని మోసం చేశారంటూ ప్రేమ్‌నగర్‌కు చెందిన కల్యాణి ఫిర్యాదు చేశారు.

కునాల్ అనే వ్యక్తి కాల్ చేసి ఇండిగోలో ఉద్యోగముందని ఇంటర్వ్యూకు ప్రిపేర్ కావాలన్నాడు. ముందుగా రూ.2100 చెల్లించి ఇంటర్వ్యూకు రాగా అకౌంట్‌లో కనీసం రూ.25 వేలు మెయింటెన్ చేయాలన్నాడు. ఇలా ఆధార్, పాన్ తదితర డాక్యుమెంట్లు అడిగి తన నుంచి పలు దఫాలుగా రూ.2 లక్షల 36 వేల 112 కాజేసినట్లు ఫిర్యాదు అందింది. అదేవిధంగా అమెజాన్‌లో పార్ట్‌టైం జాబ్ ఉందని ఓ వ్యక్తి కాల్ చేసి మోసం చేశాడని ఎస్సార్‌నగర్‌కు చెందిన విమల్‌కుమార్ గుప్తా ఫిర్యాదు చేశారు. ఉద్యోగం కోసమంటూ రూ.1.8 లక్షలు సైబర్ కేటుగాళ్లు తమ అకౌంట్‌లలో వేయించుకున్నట్లు తెలిపారు. ఓఎల్‌ఎక్స్‌లో తాను పెట్టిన సోఫా నచ్చి ఓ వ్యక్తి ఫోన్ కొంటానంటూ నమ్మించాడు. క్యూఆర్ కోడ్ పంపి రూ.1.49 లక్షలు దోచుకున్నట్లు నల్లకుంటకు చెందిన ఆశీష్‌కుమార్ ఫిర్యాదు చేశారు.

క్రిప్టో కరెన్సీలో లాభాలు వస్తాయంటూ నమ్మించి రూ.1.91 లక్షలు పెట్టుబడి పెట్టించి తనని మోసం చేశారంటూ తిలక్‌నగర్‌కు చెందిన రమేష్ పోలీసుల్ని ఆశ్రయించారు. అలాగే యూసఫ్‌గూడకు చెందిన సుప్రదకు ఓ వ్యక్తి కాల్ చేసి మీరు ఆపిల్-13 ఫోన్‌ను గిఫ్ట్‌గా గెలుచుకున్నారంటూ నమ్మించారు. ఓ లింక్ పంపామని, దానిని ఫిల్ చేసి క్లెయిమ్ చేస్తే మీకు ఫోన్ పంపిస్తామన్నారు. ఫిల్ చేశాక వొటిపి వస్తుందని.. అది చెప్పమనడంతో సుప్రద చెప్పింది. అంతే క్షణాల వ్యవధిలో అకౌంట్‌లో నుంచి రూ.5 లక్షల 54 వేల 986 నగదు మాయమైంది. సైబర్ నేరగాళ్ల మోసాలకు గురైన బాధితులు సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌కు క్యూకడుతున్నారు. దీంతో పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News