Saturday, April 27, 2024

ధోనికి సంకటం!

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్‌లో రాణించి తిరిగి టీమిండియాలో చోటు సంపాదించాలనుకున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆశలపై కరోనా వైరస్ నీళ్లు చల్లిందనే చెప్పాలి. ఈ ఏడాది జరిగే ఐపిఎల్‌లో రాణించడం ద్వారా మళ్లీ జాతీయ జట్టులోకి రావాలని భావించిన ధోనికి ప్రస్తుతం సంకట పరిస్థితి నెలకొంది. కరోనా వల్ల ఇప్పటికే ఐపిఎల్‌ను వాయిదా వేశారు. ఈ నెల చివర్లో ప్రారంభం కావాల్సిన ఐపిఎల్ 13వ సీజన్‌ను కరోనా వల్ల తాత్కాలికంగా వాయిదా వేయక తప్పలేదు. ప్రస్తుతం కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 15న కూడా ఐపిఎల్ ప్రారంభం కావడం అనుమానంగానే కనిపిస్తోంది. రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న ఈ ఏడాది ఐపిఎల్ జరగడం దాదాపు అసాధ్యంగానే మారింది. విదేశీ ఆటగాళ్లకు వీసాల మంజూరీలో కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. అంతేగాక పలు దేశాలు కూడా తమ ఆటగాళ్లను విదేశాలకు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐపిఎల్‌లో విదేశీ క్రికెటర్లు ఆడడం దాదాపు అసాధ్యంగానే తయారైంది. అంతేగకా కరోనా భయం నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లోనే ఐపిఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలనే కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే భారత క్రికెట్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక, విదేశీ క్రికెటర్లు లేకుండా, ఖాళీ మైదానాల్లో ఐపిఎల్‌ను నిర్వహించినా పెద్దగా ప్రయోజనం ఉండక పోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా జట్ల ఫ్రాంచైజీల యాజమాన్యాలు ఐపిఎల్‌ను రద్దు చేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇదే జరిగితే ఈ ఏడాది పొట్టి క్రికెట్‌ను ఆస్వాదించే పరిస్థితి అభిమానులకు లేక పోవచ్చు.
ధోని కష్టాలు రెట్టింపు
ఒక వేళ అనుకున్నట్టే ఐపిఎల్ ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్ రద్దయితే మాత్రం భారత స్టార్ క్రికెట్ మహేంద్ర సింగ్ ధోని కష్టాలు రెట్టింపు కావడం ఖాయం. కిందటి ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్ తర్వాత ధోని మళ్లీ క్రికెట్ ఆడనే లేదు. సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. ఈ మధ్యలో జరిగిన పలు సిరీస్‌లకు ధోనిని టీమిండియాకు ఎంపిక చేయలేదు. యువ క్రికెటర్లకు పెద్ద పీట వేస్తూ సెలెక్టర్లు ధోనిని జాతీయ జట్టుకు దూరంగానే ఉంచారు. దీంతో ప్రపంచకప్ సెమీస్ తర్వాత ధోని ఒక్క మ్యాచ్‌లో కూడా భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించలేదు. కాగా, ఐపిఎల్‌లో ఆడడం ద్వారా మళ్లీ క్రికెట్‌కు శ్రీకారం చుట్టాలని ధోని భావించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథిగా ఉన్న ధోని కొన్ని రోజులుగా కఠోర సాధన చేస్తున్నాడు. ఐపిఎల్‌లో రాణించడం ద్వారా మళ్లీ టీమిండియాలో రీ ఎంట్రీ ఇవ్వాలన్నదే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీని కోసం గంటల తరబడి నెట్స్‌లో శ్రమించాడు. అయితే అనుకోకుండా కరోనా వైరస్ తెరపైకి రావడం, దాని ప్రభావంతో ఐపిఎల్ జరగడం ప్రశ్నార్థకంగా మారడం ధోనికి మింగుడు పడడం లేదు. ఐపిఎల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ధోనికి ఈ పరిణామాలు ఎంతో బాధకు గురిచేశాయనే చెప్పాలి. ఈసారి ఐపిఎల్‌కు ధోని ప్రత్యేక ఆకర్షణగా మారాడు. అతను ఎలా రాణిస్తాడో చూడాలని కోట్లాది మంది అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూశారు. కానీ, కరోనా మహమ్మరి ప్రభావం ఐపిఎల్‌పై కూడా పడడంతో ధోని నిరాశలో కూరుకు పోయాడనే చెప్పాలి. ఇక, ఐపిఎల్ వాయిదా పడడంతో ప్రాక్టీస్‌ను మధ్యలోనే వదిలేసిన ధోని సొంత నగరం రాంచీకి చేరుకున్నాడు.

Dhoni Reaches to Ranchi from Chennai after Call off IPL

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News