Monday, April 29, 2024

ఉద్యమాలే కొల్లూరి చిరంజీవి ఊపిరి

- Advertisement -
- Advertisement -

Doctor chiranjeevi fight for dalit

 

విద్యార్థి దశ నుంచి మొదలు విశ్రాం తి దశ వరకు ఒక ఐదు దశాబ్దాల పాటు విరామమెరుగక వివిధ ఉద్యమాలతో మమేకమై తోటివారిని ముందుకు నడిపించిన మార్గదర్శి కొల్లూరి చిరంజీవి. వరంగల్ ఎంజిఎం కళాశాలలో మెడిసిన్ చదువుతూ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను సంఘటిత పరిచిన రాష్ర్ట నాయకుడు, మాజీ మావోయిస్టు, బహుజన సమాజ్‌పార్టీ అగ్రనేత, బహుజనోద్యమాల స్ఫూర్తి, సాహితీ చింతనాపరుడు, ప్రజా ఉద్యమాలనేత, దండోరా దరువు కొల్లూరు చిరంజీవి సోమవారం (08/03/ 2021) నాడు అస్తమించారు. ఆయన మరణంతో బహుజనుల తరపున బలంగా మాట్లాడే గొంతుక మూగబోయింది. ప్రశ్నించే వారి అండ తొలగిపోయింది. ఆయన భౌతికంగా చనిపోయినా ఆయన అభిమానుల గుండెల్లో చిరంజీవిగానే ఉంటాడు.
1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో విద్యార్థులందరినీ మమేకం చేసి పోరుబాట నడిపించిండు. తరచూ హైదరాబాద్ వచ్చి విద్యార్థి శ్రీధర్ రెడ్డి, మల్లికార్జున్ వంటి నాయకులతో చర్చలు జరిపేవాడు. 1972లో హైదరాబాద్‌లో విరసం సభలకు హాజరయిన చిరంజీవి అనంతర కాలంలో కొండపల్లి సీతరామయ్య, కె.జి.సత్యమూర్తి లాంటి ఉన్నత స్థాయి నాయకులతో కలిసి మావోయిస్టు ఉద్యమంలో పాల్గొన్నాడు. కులాంతర వివాహం చేసుకున్నాడు. ప్రేమించి పెళ్ళాడిన తోటి మెడికో చెబుతున్నా వినకుండా విప్లవాదర్శంతో రహస్యోద్యమంలోకి వెళ్ళిండు. ఎన్నో డాక్యుమెంట్లకు రూపకల్పన జేసిండు. కారంచేడు సంఘటన తర్వాత ఉద్యమం నుంచి బయటికొచ్చి అంబేడ్కర్ వాదాన్ని ప్రచారం చేసిండు. అంబేడ్కర్ స్ఫూర్తితో కాన్షిరావ్‌ుతో కలిసి బహుజన సమాజ్ పార్టీలో తొలి దశలో కీలక నాయకుడిగా పనిచేసిండు. ఒక రకంగా కాన్షిరావ్‌ుకు కుడిభుజంగా ఉన్నాడని చెప్పవచ్చు. కాన్షిరావ్‌ుతో కలిసి దేశవ్యాప్తంగా పర్యటించిండు. బిఎస్‌పి ‘థింక్‌టాంక్’లో చిరంజీవి ప్రధాన వ్యక్తిగా ఉండిండు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1969 ఉద్యమకారుల సమాఖ్యను ఏర్పాటు చేసి ఎనుకటి పోరు తరాన్ని ఒక్క తాటి మీదికి తెచ్చిండు. బహుజన సాహితీ మిత్రులకు లక్డీకాపూల్‌లోని తన జెన్ హోటల్ మేనేజ్‌మెంట్ వొకేషనల్ కాలేజీని అడ్డాగా ఇచ్చిండు. ఇందులో కొన్నేండ్ల పాటు బహుజన మిత్రులం సింగిడి తెంగాణ రచయితల సంఘం తరపున సాహితీ సభలను ప్రతినెలా నిర్వహించుకున్నాము. ఏడో నిజావ్‌ుకు దక్కాల్సిన ఖ్యాతి దక్కలేదంటూ దక్కన్ డెమోక్రటిక్ సెక్యులర్ అలయెన్స్ తరపున ఉద్యమాలు చేసిండు. సేవ్ ఉర్దూ లాంగ్వేజ్, బీఫ్ బచావో అందోళన్ ఇట్లా ఎన్నో ప్రజోద్యమాల్లో భాగస్వామి అయిండు.
దళిత సాహిత్యానికి చిరంజీవి చుక్కాని అయ్యిండు. అవును 1997లో నాగప్పగారి సుందర్రాజు కథలు ‘మాదిగోడు’ ఎంతో శ్రమకోర్చి తానే ప్రచురించిండు. ప్రచురించడమే కాదు అర్ధవంతమైన, దళిత సాహిత్యోద్యమానికి దిశా నిర్దేశం చేసే విపులమైన ముందుమాట రాసిండు. అందులో “డప్పుకొట్టి, దండోరా వేసి మరీ చెప్పాల్సి వస్తుంది ‘కుల సిఫిలిస్’తో కుళ్ళి కంపుకొడుతున్న బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థని విశ్లేషించాలన్నా, దాని మూలాలను వెతకాలన్నా దానిని శస్త్ర చికిత్స చేయాలన్నా ఈ వ్యాధిగ్రస్తపు సమాజాన్ని రక్షించాలన్నా ఒక మాదిగోడో, మాలోడో, డక్కలోడో, చాకలోడో, మంగలోడో, కమ్మరోడో, గౌండ్లోడో, నేతకాడో, కటికోడో, దూదేకులోడో లేదా ఇలాంటి శూద్రుడో, అతిశూద్రుడో పూనుకోవాలి. అట్టడుగు సమాజం నుండి రచయితలు రావాలి. సామాజిక విప్లవకారులు ఉద్భవించాలి. తప్పెట పుల్లలతో అసలు సిసలైన తెలుగు సాహిత్యాన్ని సాంప్రదాయవాదుల ఖైదు నుండి, బ్రాహ్మణవాదుల కబంధ హస్తాల నుండి తెలుగు సాహిత్యాన్ని విముక్తి చేయడానికి సన్నద్ధం కండి.” అంటూ పిలుపునిచ్చిండు. తాను చెప్పిన మాటలను జీవితమంతా పాటించిండు. ఎక్కడా ద్వంద్వనీతికి పాల్పడలేదు.
1969 తెలంగాణ ఉద్యమకారుల సమాఖ్యను ఏర్పాటు చేసి ఢిల్లీ వరకు వెళ్ళి అప్పటి రాష్ర్టపతికి వినతిపత్రాలు సమర్పించిండు. అక్కడే ధర్నాలు నిర్వహించిండు. దళిత మేధావి వర్గాన్ని ఒక్క దగ్గరికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేసిండు. ఉర్దూ భాష పట్ల ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా వ్యవహరించడం లేదంటూ ఆ భాషను రక్షించడానికి ఉద్యమాలు చేసిండు. ఎన్నో సభలు, సమావేశాలు నిర్వహించిండు. హైదరాబాద్‌పై పోలీసు చర్యను ఉత్సవంగా నిర్వహించాలనే వారికి వ్యతిరేకంగా బుద్ధిజీవులను సంఘటితపరిచిండు. 1969 ఉద్యమ సహచరుడు ఆరిఫుద్దీన్‌తో కలిసి ఇందుకు వ్యతిరేకంగా ఎన్నో సభలు, సమావేశాలను నిర్వహించిండు. అట్లాగే ప్రతి సంవత్సరం నిజాం జయంతి రోజు ఆయన సమాధి వద్దకు దళిత బహుజన విద్యార్థులతో కలిసి వెళ్ళి నివాళి అర్పించేవాడు. హిందూ ముస్లిం మైత్రి ఒకవైపు, దళిత బహుజన మైత్రి కోసం మరోవైపు అవిశ్రాంతంగా కృషి చేసిన మేధావి, ఉద్యమ యోధుడు కొల్లూరి చిరంజీవి.
మేము ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం తరపున నిర్వహించే బహుజన సాహిత్య కార్యక్రమాలకు ఎంతో అండగా నిలిచేవాడు. అంతేగాకుండా తన అనుభవాన్ని, జ్ఞాపకాలను పంచుకుంటూ వివిధ సందర్భాల్లో ఆధునిక కాలంలో బహుజనులకు అగ్రవర్ణాల వారు ఎట్టా అన్యాయం చేస్తున్నారో విడమరిచి చెప్పేవాడు. చెప్పడమే గాదు కార్యాచరణ కూడా ఇచ్చేవాడు.
తెలంగాణ సాధన కోసం, అవిశ్రాంతంగా ఎలాంటి లౌల్యాలకు, ప్రలోభాలకు లోను గాకుండా కొట్లాడిన అతి కొద్ది మందిలో చిరంజీవి గారొకరు. చిన్నవాళ్ళను సైతం కలుపుకొని పోయి పెద్ద ఉద్యమాలను నిర్మించిండు. నాకు సార్‌తో ప్రత్యేకమైన అనుబంధమున్నది. అటు మావోయిస్టు ఉద్యమంలోనూ, ఆ తర్వాత బహుజన్ సమాజ్ పార్టీలో దళితులు అందులో మాలలు, మాదిగలు ఎట్లాంటి పాత్ర పోషించిందీ వివరంగా చెప్పేవాడు. భావజాలాన్ని సిద్ధాంతంగా మలచడంలోనూ, సిద్ధాంతాన్ని ఆచరణ యోగ్యంగా అమలు చేయడంలోనూ థియరిటికల్‌గా సిద్ధహస్తుడు. ఐదు దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాలతో మమేకమై దళిత, బహుజనుల అభ్యున్నతి కోసం అహరహం శ్రమించిన ఆ గొంతుక వినపడదంటే బాధగా ఉన్నది. ఆయన బాటలో పయనించి సార్ ఆశయాల సాధనే సరైన నివాళి.
పదుల సంఖ్యలో జరిగిన సమావేశాల్లో చిరంజీవి గారితో కలిసి గంటల కొద్ది సమయాన్ని వెచ్చించి ఎన్నో అంశాలను చర్చించేవాళ్ళము. బహుజన సమస్యలపై సీరియస్‌గా ఒక పత్రిక తీసుకురావాలని చిరంజీవి గారికుండేది. అందుకోసం ఎన్నో సార్లు చర్చలు కూడా జరిపాము. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితులు అంతకంతకూ దిగజారుతుండడంతో అది సాధ్యము కాలేదు. చిరంజీవి సార్ లేని లోటు భార్య చంద్రావతి, కూతురు అజితకే గాకుండా మొత్తం తెలంగాణ దళిత, బహుజన సమాజానికి పూడ్చలేనిది. చిరంజీవి స్మారకంగా ప్రభుత్వం ఏదైనా సంస్థకు ముఖ్యంగా వైద్య సంస్థకు ఆయన పేరు పెట్టుకున్నట్లయితే మనల్ని మనం గౌరవించుకున్నట్టుగా ఉంటుంది.

సంగిశెట్టి శ్రీనివాస్
9849220321

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News