Monday, April 29, 2024

ట్రంప్ బోణీ

- Advertisement -
- Advertisement -

డోనాల్డ్ ట్రంప్ ఘనంగా బోణీకొట్టాడు. ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక కావడానికి అయోవా రాష్ట్రం నుంచి సోమవారం జరిగిన ప్రైమరీ పోటీలో ట్రంప్ 50 శాతానికి మించిన ఓట్లతో గెలుపొందడం మామూలు విజయం కాదు. గత అధ్యక్షుడుగా అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ ప్రదర్శించిన విపరీత పోకడలు స్వదేశంలోనూ, ప్రపంచమంతటా ఆయన పట్ల వ్యతిరేకతను పెంచాయి. అదే సమయంలో తక్కువ జీతాల ఉద్యోగాలతో, నిరుద్యోగంతో బాధపడుతున్న తెల్ల అమెరికన్ల మద్దతును చూరగొన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రస్తుత డెమొక్రాటిక్ అధ్యక్షుడు జో బైడెన్‌కు గట్టి పోటీ ఇవ్వగలిగారు. రెండు సార్లు పోటీ చేసే అవకాశాన్ని వినియోగించుకొని రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం మళ్ళీ బరిలో దిగారు. మిగతా అన్ని రాష్ట్రాలలో జరిగే పార్టీ ప్రైమరీలలో మెజారిటీ నిరూపించుకోగలిగితే ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థిత్వం ఖరారు కావడం, అధ్యక్షుడుగా మరోసారి ఎన్నికవ్వడమూ అసాధ్యం కాకపోవచ్చునని భావిస్తున్నారు.

ట్రంప్‌పై కొనసాగుతున్న కేసుల్లో దోష నిరూపణ జరిగి శిక్షలు పడితే పదవిలో ఉండగా జైలుకి వెళ్లే పరిస్థితి కూడా ఎదురు కావొచ్చు. అయోవా ప్రైమరీలో 51% ఓట్లు ట్రంప్‌కి పడ్డాయి. ఆయన సమీప అభ్యర్థి ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటీస్‌కి 21%, ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా పనిచేసిన నిక్కీ హేలీకి 19% లభించాయి. తన సమీప అభ్యర్థి మీద ట్రంప్ 30 పాయింట్ల ఆధిక్యతను సాధించాడు. ఇది రిపబ్లికన్ పార్టీ ప్రైమరీల్లో ఇంతకు ముందు ఎవరూ సాధించని ఆధిక్యత అని అంటున్నారు. 2016 లో ఇదే అయోవా ప్రైమరీలలో ట్రంప్ ఓడిపోయాడు. అయితే ఆ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై విజయం సాధించాడు. ఆ విధంగా అమెరికా మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిని పొందే అవకాశాన్ని కోల్పోయింది. ట్రంప్‌పై పలు రకాల కేసులు 90కి పైగా వున్నాయని సమాచారం. అందులో ఆయన కంపెనీలపై నమోదైనవి కూడా వున్నాయి. బ్యాంకుల నుంచి ఎక్కువ రుణం పొందడం కోసం తన కంపెనీల రికార్డులను తారుమారు చేసినట్టు ఆరోపణలున్నాయి.

అలాగే మహిళలపై అత్యాచారం కేసులు, వివాహేతర సంబంధాల కోసం చెల్లింపులు చేశాడన్న ఆరోపణ సైతం నమోదైంది. 2021 జనవరి 6న గత అధ్యక్ష ఎన్నిక ఫలితంపై అధికార ప్రకటన విడుదల కాకుండా చేయడానికి పార్లమెంటు మీదికి 2000 మందిని ఉసిగొల్పాడన్న కేసూ వుంది. ఆ దాడిలో మూకలు పార్లమెంటు భవనం క్యాపిటల్ లోకి చొరబడి విధ్వంసాన్ని సృష్టించారు. కాల్పుల్లో కొంత మంది మరణించారు. అధ్యక్షుడుగా ట్రంప్ తీసుకొన్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. పర్యావరణ పరిరక్షణకు అమెరికా ప్రకటించిన విరాళాలను ఉపసంహరించుకోడం, కోవిడ్ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు సాయాన్ని నిరాకరించడం వంటి నిర్ణయాలు విమర్శలకు గురయ్యాయి. అమెరికా ప్రజాస్వామిక లక్షణాన్ని తుడిచివేసి ప్రపంచం ముందు తలవంచుకొనేలా చేస్తాడనే భయాలు ట్రంప్ పట్ల చోటు చేసుకొన్నాయి. ఆయన అధ్యక్షుడైన ఎన్నికల్లో దొడ్డి దారిలో విజయాన్ని సాధించడానికి కుట్ర పన్నాడనే ఆరోపణను కూడా ట్రంప్ మోస్తున్నాడు.

అయితే దేశంలోని అసంతృప్త శ్వేత జాతీయుల తరపున నిలబడే వీరుడుగా ఆయనకున్న పేరు మళ్ళీ అధ్యక్షుడిని చేస్తుందనే భయాలు వున్నాయి. ఇది 160 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన రిపబ్లికన్ పార్టీ పరువునూ మంట గలుపుతుందనే అభిప్రాయం నెలకొన్నది. అయితే ప్రజాస్వామ్య ధర్మబద్ధంగా ప్రజలు ఎన్నుకొనే నాయకున్ని అమెరికా భరించక తప్పదు. ఇది ఏ దేశానికైనా వర్తిస్తుంది. జో బైడెన్ హయాంలో దేశీయంగా కొనసాగుతున్న ప్రజాస్వామిక విధానాలను ట్రంప్ విడనాడితే చేయగలిగిందేమీ వుండదు. అది ప్రపంచం మీద దుష్ప్రభావం చూపించే ప్రమాదమున్నది. ఒక్కరోజైనా నియంతగా వ్యవహరించాలని తాను ఆశిస్తున్నట్టు ట్రంప్ గతంలో వెలిబుచ్చిన ఆకాంక్ష మానవాళికి అత్యంత హానికరమైనది. అమెరికా విధానకర్తలు పునరాలోచనలో పడవలసిన పరిణామానికి దారి తీస్తుంది. అయితే ట్రంప్ అయోవా ప్రైమరీలలో సాధించిన విజయమే అంతిమ విజయం కాబోదు.

మిగతా రాష్ట్రాల ప్రైమరీలు సాగుతున్నకొద్దీ ఆయన సమీప ప్రత్యర్థిగా ఎవరు బలపడతారో చూడాలి. భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామి మొదటి అడుగులోనే వెనుకడుగు వేసి పోటీ నుంచి తప్పుకోడం, ట్రంప్ మద్దతుదారుగా ప్రకటించుకోడం విశేష పరిణామం. తాను అధ్యక్షుడుగా ఎన్నికైతే రామస్వామి ఉపాధ్యక్షుడు కాగలడని ట్రంప్ ప్రకటించడం మరో విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News