Saturday, April 27, 2024

పుకార్లు నమ్మొద్దు

- Advertisement -
- Advertisement -

corona

 

వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించవద్దు

ఐటి కంపెనీలు మూడు నెలలు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి : రాష్ట్ర ఐటిశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్
వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్
ఒకే కేసు నమోదైంది, రాష్ట్రంలో ఎక్కడా వైరస్ రాలేదు : డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ డా. శ్రీనివాస్

మన తెలంగాణ/సిటిబ్యూరో : కరోనాపై వస్తున్న పుకార్లను నమ్మొద్దని తెలంగాణ రాష్ట్ర ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. మైండ్ స్పేస్ మొత్తం ఖాళీ అయిందనే పుకార్లు నిజం కావని ఆయన పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం సిపి సజ్జనార్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐటి సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడారు. రహేజా మైండ్ స్పేస్‌లో చాలా బిల్డింగ్‌లు ఉన్నాయని, వాటినిలోని బిల్డింగ్ నంబర్20లో ఉన్న డిఎస్‌ఎం కంపెనీలో ఓ ఉద్యోగికి కరోనా లక్షణాలు ఉన్నాయని తెలిసిందని, శాంపిళ్లను పూణే ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. డిఎస్‌ఎం కంపెనీలో 350మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్న ఉద్యోగితో 23 మంది పనిచేస్తున్నారని, వారు తమకు తామే ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

విదేశాలకు వెళ్లిన వారి నుంచి ఇక్కడికి కరోనా వచ్చిందని ఆయన వెల్లడించారు. ఇక్కడి వారికి ఎవరికీ రాలేదని అన్నారు. వ్యాధి ప్రబలకుండా జాత్త్రలు తీసుకుంటున్నామని, మైండ్ స్పేస్ భవనాల యాజమాన్యం అన్ని జాగ్రత్తలు తీసుకుందని పేర్కొన్నారు. సైబరాబాద్‌లోని అన్ని కార్యాలయాలు రేపటి నుంచి యధావిధిగా పనిచేస్తాయని తెలిపారు. ఐటి కంపెనీలు వర్క్ ఫ్రం హోం ప్రకటించవద్దని, ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న మహిళ కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆమె భర్త పనిచేసే కంపెనీ ఉద్యోగులకు ఒక రోజు వర్క్ ఫ్రం హోం ఇచ్చారని తెలిపారు. పూర్వ సమ్మిట్‌లో కూడా చాలా కంపెనీలు ఉన్నాయని, అక్కడి ఉ న్న కంపెనీలు వాటిలో ఉన్న వారు కూడా రేపటి నుంచి యధావిధిగా పనిచేస్తారని తెలిపారు. ఐటి కంపెనీలు వర్క్‌ఫ్రం హోంను ప్రకటించవద్దని, దీంతో భయాందోళనలు నెలకొంటాయని తెలిపారు. మూడు నెలల వరకు ఐటి కంపెనీలు తమ ఉద్యోగులను విదేశాలకు పంపించవద్దని కోరారు. ఈ సందర్భంగా వారు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

పుకార్లు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : విసి సజ్జనార్,సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఐటి కారిడార్ ఖాళీ అయిందని పుకార్లు పుట్టిస్తున్న వారిపై నిఘా పెట్టామని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ స్పష్టం చేశారు. భవనాలను శుభ్రం చేయడానికే ఖాళీ చేశారని తెలిపారు. కరోనాపై అవగాహన కల్పించాలని,గాలి ద్వారా వ్యాధి రాదని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు ఒకే కేసు నమోదయిందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణలో ఎక్కడా కరోనా వైరస్ రాలేదని తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి ఇక్కడికి వచ్చిందని తెలిపారు. అతడి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా నెగిటీవ్ వచ్చిందని అన్నారు. ఐటి కారిడార్‌లో పనిచేస్తున్న మహిళ ఇటలీ నుంచి వచ్చిందని, ఆమె శాంపిళ్లను పూణేకు పంపించామని తెలిపారు. ఇద్దరి శాంపిళ్లకు సంబంధించిన రిజల్ట్ గురువారం ఉదయం వరకు వస్తాయని తెలిపారు. కరోనా వచ్చిన యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, అతడు కోలుకుంటున్నాడని తెలిపారు.

Dont believe the rumors on corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News