Monday, April 29, 2024

దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్ ‌విడుదల

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో ఒక లోక్‌సభ స్థానం, 56 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నవంబర్ 3, 7 తేదీలలో జరుగుతాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం తెలియచేస్తూ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. సభ్యుల మృతి, ఇతరత్రా కారణాలతో ఆయా చట్టసభల స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. దీనితో ఉప ఎన్నికల నిర్వహణ అనివార్యం అయింది. ఉప ఎన్నికలు జరిగే స్థానాలలో తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక నియోజకవర్గం కూడా ఉంది. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాలమరణంతో దుబ్బాక ఉప ఎన్నికకు వెళ్లనుంది. అక్కడ నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరుగుతుందని ఇప్పటి షెడ్యూల్‌తో వెల్లడైంది. ఇటీవలే బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాల అభ్యర్థనలు , వ్యతిరేకతలను పరిగణనలోకి తీసుకుని ఈ ఉప ఎన్నికల నిర్వహణ తేదీలను వెల్లడించింది.

అయితే నాలుగు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల గురించి ఈ దశలో ఇసి ఎటువంటి సమాచారం వెలువరించలేదు. నవంబర్ 3వ తేదీన 54 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ఉంటాయి. ఇక బీహార్‌లో ఓ లోక్‌సభ స్థానానికి, మణిపూర్‌లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నవంబర్ 7వ తేదీన జరుగుతాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు అంతా ఒకేసారి నవంబర్ 10 వ తేదీన జరుగుతుందని, అదే రోజు ఫలితాలు వెలువరిస్తారని తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అదేరోజు క్రమక్రమంగా వెలువడుతాయి.

అయితే.. కేరళ, తమిళనాడు, అసోం, పశ్చిమ బెంగాల్‌ల్లో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకుఉప ఎన్నికలు ఈ దశలో నిర్వహించడం లేదని, ఈ మేరకునిర్ణయం తీసుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. వీటిలో అసోంలో రెండు, బెంగాల్‌లో ఒకటి, కేరళలో రెండు, తమిళనాడులో రెండు స్థానాలు ఉన్నాయి. బీహార్‌లోని వాల్మీకీ నగర్ లోక్‌సభ స్థానానికి, మధ్యప్రదేశ్‌లోనే ఏకంగా 28 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి ఎమ్మెల్యేల నేపథ్యంలో ఈ స్థానాలకు ఖాళీ ఏర్పడింది. అప్పట్లో జ్యోతిరాదిత్య సింధియా ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో తిరుగుబాటు తలెత్తింది. ఈ క్రమంలో శాసనసభ్యత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారు. దీనితో కమల్ నాథ్ ప్రభుత్వం బలం పడిపోయింది. అక్కడ బిజెపి అధికారంలోకి వచ్చింది. మొత్తం 63 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. అయితే వివిధ కారణాలు, కోర్టు కేసులు ఉండటంతో కొన్ని స్థానాలలో ఉప ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిందని అధికారులు తెలిపారు.

Dubbaka By-Election 2020 Schedule Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News