Friday, May 3, 2024

రాజస్థాన్ సిఎం సోదరుడిపై ఇడి నజర్

- Advertisement -
- Advertisement -

ED raids Rajasthan CM Ashok Gehlots brother

 వ్యాపార భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు
దేశంలోని 13 చోట్ల
ఎరువుల కుంభకోణం కేసులో దర్యాప్తు
మోడీది ‘రెయిడ్ రాజ్ ’ పాలన : కాంగ్రెస్ నేత సూర్జేవాలా

న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసెయిన్ గెహ్లాట్ నివాసం, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులు బుధవారం దాడులు జరిపారు. ఎరువుల కుంభకోణం,డబ్బు అక్రమ తరలింపు(మనీ లాండరింగ్) కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు నిర్వహించామని ఇడి అధికారులు తెలిపారు. దేశంలోని 13 చోట్ల (రాజస్థాన్ (6), బెంగాల్(2), గుజరాత్(4), ఢిల్లీ(1) దాడులు జరిపినట్టు ఇడి తెలిపింది. రాజస్థాన్‌లో అగ్రసెయిన్‌తోపాటు కాంగ్రెస్ మాజీ ఎంపికి సంబంధించిన కార్యాలయాలపైనా దాడులు జరిపింది. వీరిద్దరికీ వ్యాపార సంబంధాలున్నాయి. ఇడి..ఆర్థిక నేరాలపై దర్యాప్తు జరిపే కేంద్ర సంస్థ అన్నది తెలిసిందే.

అగ్రసెయిన్‌కు అనుపమ్‌కృషి అనే విత్తనాలు, ఎరువుల కంపెనీ ఉన్నది. ఈ సంస్థ అక్రమంగా విదేశాలకు మురియేట్ ఆఫ్ పొటాష్(ఎంఒపి)ని సరఫరా చేసినట్టు 200709లో కస్టమ్స్ విభాగం కేసు నమోదు చేసింది. దేశంలోని రైతులకు సరఫరా కావాల్సిన ఎరువుల్ని విదేశాలకు దారి మళ్లించారన్నది కేసు సారాంశం. దీనిపై దర్యాప్తును 2013లోనే ఇడికి అప్పగించారు. కస్టమ్స్ విభాగపు దర్యాప్తు సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డిఆర్‌ఐ) ఎఫ్‌ఐఆర్ ఆధారంగా డబ్బు అక్రమ తరలింపు నిరోధక చట్టం(పిఎంఎల్‌ఎ)కింద దర్యాప్తు బాధ్యతను తాము తీసుకున్నట్టు ఇడి తెలిపింది. ఈ కుంభకోణం విలువ రూ.60 కోట్లుగా ఇడి తెలిపింది. దీనికి సంబంధించిన ఆధారాల కోసమే దాడులు జరిపినట్టు వారు తెలిపారు. అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్‌కు గతంలో వ్యాపార భాగస్వామిగా ఉన్న రతన్‌కాంత్‌శర్మ అనే జైపూర్ వ్యాపారవేత్త సంస్థలపైనా ఇడి దర్యాప్తు జరుపుతోంది.

ఈ నెల 13న ఆదాయం పన్నుశాఖ అధికారులు రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు వ్యాపారులకు చెందిన 40 చోట్ల దాడులు నిర్వహించారు. రూ.12 కోట్లతోపాటు పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పన్ను ఎగవేత కేసులు నమోదు చేశారు. ఈ సంస్థలతో రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నేతలకు సంబంధాలున్నట్టు చెబుతున్నారు.ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతున్న నాటకీయ పరిణామాల మధ్య ఇడి దాడులు రాజకీయ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. తమ నేతలకు సంబంధించిన వ్యాపార సంస్థలపై దాడుల వెనుక కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నదని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ప్రధాని మోడీ పాలన ‘రెయిడ్ రాజ్ ’ను తలపిస్తోందని, దాడులకు తాము భయపడమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్రం ఆడిన గిమ్మిక్కులు పనిచేయకపోవడం వల్లే గెహ్లాత్ సోదరుని ఇళ్లపై దాడులని సూర్జేవాలా విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News