Monday, April 29, 2024

గంటన్నరలోనే దహన సంస్కారాలు

- Advertisement -
- Advertisement -

Cremation within an hour and half At Erragadda Cemetery

ప్రయోగాత్మకంగా గ్యాస్ ఆధారిత క్రిమిటోరియం,  ఒక మృతదేహానికి మూడు సిలిండర్ల గ్యాస్
ఎర్రగడ్డ శ్మశాన వాటికలో ప్రయోగం,  50 నిమిషాల్లోనే పూర్తైన దహన సంస్కారాలు

హైదరాబాద్:  కరోనా సోకి మరణించడం ఓ శాపంగా మారగా, వారి దహన సంస్కారాలు సైతం ఇటు కుటుంబ సభ్యులకు అటు అధికారులకు ఓ సవాల్‌గా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు తాజాగా గ్యాస్ ఆధారిత క్రిమిటోరియం ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. నగరంలో కరోనా బాధితుల సంఖ్య అంతకుఅంతా పెరుగుతుండడంతో ఈవ్యాధితో మృత్యవాత పడుతున్న వారిసంఖ్య సైతం పెరుగుతోంది. దీంతో వారి దహన సంస్కారాలు ఓ పెద్ద సమస్యగా మారింది. కొవిడ్19 నియమ నిబంధనల ప్రకారం కరోనా వ్యాధితో మృతి చెందిన వారిని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో స్థానిక పోలీసుల సమక్షంలో అంత్యక్రియలను అన్ని జాగ్రత్తలతో ఎంపిక చేసిన సిబ్బంది ద్వారా మాత్రమే నిర్వహించాల్సి ఉంది.

దీంతో నగరవాసులు మాత్రమే కాకుండా రాష్ట్ర నలుమూలాల నుంచి కరోనా చికిత్స నిమిత్తం నగరానికి వచ్చి ఆసుపత్రుల్లో మృత్యువాత పడుతున్న వారిని సైతం నగరంలో దహన సంస్కారాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో కరోనా వ్యాధితో మరణించిన వారిని ప్రస్తుతం నగరంలో ఎర్రగడ్డలోని శ్మశాన వాటికతో పాటు జిహెచ్‌ఎంసి ఎంపిక చేసిన శ్మశానవాటికల్లో కట్టెలతో దహనం చేస్తుండగా, బన్సీలాల్‌పేట్, గోల్నాకల్లో శ్మశాన వాటికల్లో ఎలక్ట్రిక్ క్రిమిటోరియం ఇప్పటికే ఉండగా అమీర్‌పేట్‌లో ఇటీవలే అందుబాటులోకి తెచ్చారు. అయితే ఇక్కడ పరిమితి సంఖ్యలో దహన సంస్కరాలు నిర్వహిస్తుండడంతో పెద్ద సంఖ్యలో మాత్రం ఖాష్టాలు (కట్టెలతో దహన సంస్కరాలు) నిర్వహిస్తున్నారు.

అసలే వర్షకాలం కావడంతో శ్మశాన వాటికల్లో రోజు 10ల సంఖ్యలో మృతదేహాలు వస్తుండడం, అవి కరోనా భారినపడి మరణించిన వారివి కావడంతో యుద్ధ్ద ప్రాతిపదికన దహనం చేయాల్సి ఉండడంతో అప్పుడప్పుడు వర్షం కురువడం, దీంతో మృతదేహాలు సరిగ్గా దహనం కాని పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను పూర్తిగా అధిగమించడమే లక్షంగా నగరంలో 4 ఎలక్ట్రికల్ క్రిమిటోరియంలతో పాటు మరో 10 గ్యాస్ ఆధారిత క్రిమిటోరియంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందులో భాగంగా తాజాగా ఎర్రగడ్డలోని శ్మశాన వాటికలో ప్రయోగత్మాకంగా తొలి గ్యాస్ ఆధారిత క్రిమిటోరియంను ఏర్పాటు చేశారు.

గంటన్నరలో దహన సంస్కారాలు

ఎర్రగడ్డ శ్మశాన వాటికలో ప్రయోగత్మాకంగా ఏర్పాటు చేసిన గ్యాస్ ఆధారిత క్రిమిటోరియం ద్వారా గంటన్నర వ్యవధిలోనే దహన సంస్కారాలు పూర్తి కానున్నాయి. 1200 డిగ్రీల ఫారెన్ హీట్‌తో పని చేయనున్న ఈ గ్యాస్ ఆధారిత క్రిమిటోరియం ద్వారా ఒక మనిషి మృతదేహాన్ని పూర్తిగా దహనం చేసేందుకు 3 సిలిండర్లు అవసరం అవుతాయని జిహెచ్‌ఎంసి అధికార వర్గాలు వెల్లడించాయి. సుమారు రూ.7.5లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన ఈ గ్యాస్ అధారిత క్రిమిటోరియాలను అతి తక్కువ స్థలంలో ఏర్పాటు చేసే అవకాశం ఉండడమే కాకుండా వాటిని ఎక్కడికైన సులభంగా తరలించే వెసులుబాటు ఉండడంతో ఎంతో ఉపయోగపడనున్నాయి. అయితే ఎర్రగడ్డలో ఏర్పాటు చేసిన గ్యాస్ ఆధారిత క్రిమిటోరియం పనితీరును పరిశీలించేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు మంగళవారం ఓ మృతదేహాన్ని దహానం చేయగా కేవలం 50 నిమిషాలు సమయం మాత్రమే పట్టినట్లు సమాచారం.

Cremation within an hour and half At Erragadda Cemetery

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News