Monday, April 29, 2024

లాభార్జన సరకుగా విద్యుత్

- Advertisement -
- Advertisement -

విద్యుత్ పంపిణీ విషయంలో దేశంలో ఇప్పటికే అక్కడక్కడా ఫ్రాంచైజీ సిస్టవ్‌ు అమల్లో ఉంది. ఈ బిల్లు పాసైతే ఫ్రాంచైజీ విధానంలో కాకుండా ప్రైవేటు కంపెనీలు నేరుగానే రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇకపోతే డిస్కవ్‌ులు క్రమంగా క్రాస్ సబ్సిడీని ఎత్తివేయాల్సి ఉంటుందని కేంద్రం ఇది వరకే అనేక సందర్భాల్లో చెబుతూ వస్తోంది. వాస్తవానికి పేద వర్గాలు అందులోనూ లోటెన్షన్ (ఎల్టీ)లో 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను వాడే వినియోగదారులను ఆదుకోవడానికి డిస్కవ్‌ులు ఓపెన్ యాక్సెస్ (బహిరంగ విపణి)లో కరెంట్ కొంటున్నవారి నుంచి అదనపు క్రాస్ సబ్సిడీని వసూలు చేస్తున్నాయి. విద్యుత్ బిల్లులు చెల్లించలేని గృహ వినియోగదారులకు శ్లాబులవారీగా బిల్లును వసూలు చేస్తున్నాయి.

Growing in suburban areas Electrical connections

 

ప్రజా ప్రయోజనాలకు ప్రభుత్వ రంగంలో ఉన్న విద్యుత్ సంస్థలకు తీవ్ర నష్టం చేకూర్చే విద్యుత్ చట్ట సవరణ బిల్లు- 2022ను కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. విద్యుత్ రంగంలోని భాగస్వాములందరితో చర్చించకుం డా, ఏకపక్షంగా ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ సభలో ప్రవేశపెట్టిన సమయంలోనే విద్యుత్ రంగ ఉద్యోగులు, ఇంజినీర్లు దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా నిరసనలు తెలిపారు. లోక్‌సభలో ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నివేదించారు. 1948లో విద్యుత్ చట్టాన్ని అంబేడ్కర్ తీసుకొస్తూ విద్యుత్తును లాభార్జన సరుకుగా చూడరాదని, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని పేదలకు అందుబాటులో ఉండేలా చూడడం ప్రభుత్వ కనీస బాధ్యత అని నొక్కి చెప్పారు.
2003లో వాజ్‌పేయి ప్రభుత్వం మార్కెట్ శక్తుల ప్రయోజనాలకు అనుగణంగా ఈ చట్టానికి కొన్ని మార్పులు చేర్పులు చేసింది. బడా కార్పొరేట్లకు, బహుళజాతి సంస్థలకు విద్యుత్ రంగం తలుపులు బార్లా తెరవడానికి అడ్డంకిగా ఉన్న కొద్దిపాటి నిబంధనలను కూడా మోడీ ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా తొలగించేస్తున్నది. విద్యుత్ రంగానికి ఉన్న ప్రాముఖ్యత ఆధారంగా, రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలోని 7వ షెడ్యూల్‌లో ఉన్న విద్యుత్‌ను రాష్ట్రాలతో, భాగస్వాములతో సంప్రదింపులు జరపకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కి లాభాలను ప్రైవేటీకరించి, నష్టాలను జాతీయికరించే బిల్లును తీసుకొచ్చింది. ప్రస్తుతం సవరించిన బిల్లులో ప్రతిపాదించిన అంశాలలో ఏమున్నదో ఒకసారి పరిశీలిస్తే విద్యుత్ రంగంలో రాష్ట్రాల అధికారాలను కేంద్రం తన ఆధీనంలోకి తెచ్చుకొని ఫెడరల్ వ్యవస్థకు భంగం కలిగించి, విద్యుత్ వ్యవస్థను కేవలం కొన్ని ప్రైవేట్ సంస్థల ఆధీనంలోకి తీసుకురాబోతున్నది. ఇదే జరిగితే ఇప్పటి వరకూ ప్రభుత్వరంగంలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు వ్యవసాయ రంగానికి, మారుమూల గ్రామాలకు, పేద కుటుంబాలకు ఇస్తున్న విద్యుత్ రాయితీని ఇక నుండి కేవలం లాభాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని పని చేసే ప్రైవేట్ కంపెనీలతో ఇప్పించలేదు.
కేవలం పెట్టుబడిదారీ వర్గాలకు మాత్రమే ప్రయోజనం కలిగించే ఈ చట్ట సవరణ బిల్లు రోజూ రెక్కాడితేనే డొక్కాడిస్తూ బతుకు బండిని లాగుతున్న పేదల పాలిట శాపంగా మారి దశాబ్దాలుగా పేదలకు ఇస్తున్న రాయితీలను లాక్కోవడమే అవుతుంది. అంతేగాకుండా ఈ చట్ట సవరణ బిల్లు పేదలకు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు విద్యుత్ అందుబాటులో లేకుండా చేసి టారిఫ్ ని నిర్ణయించే హక్కును కేంద్రానికి ఇస్తుంది. ఇది 2017 ఏప్రిల్ 11న రాష్ట్రాల విద్యుత్ బోర్డుల పాత్రపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఉంది. అలాగే సంవత్సరం క్రితం మూడు నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు సుదీర్ఘంగా సాగించిన రైతుల ఉద్యమాన్ని విరమింపజేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఈ ప్రతిపాదిత బిల్లు ఉపసంహరణ ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ బిల్లును తీసుకొచ్చి రైతులకు కూడా మరోసారి ద్రోహం చేస్తుంది.
ఇకపై సివ్‌ు కార్డులు, ఇంటర్నెట్ కనెక్షన్ల మాదిరిగానే కరెంటును కూడా మనకు నచ్చిన కంపెనీ నుంచి కొనుక్కునే రోజులు రాబోతున్నాయి. దానిలో భాగంగానే విద్యుత్ పంపిణీ (డిస్కవ్‌ు) వ్యవస్థలో లైసెన్స్ రాజ్‌ను తొలగించడానికి వడివడిగా కేంద్రం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందితే పంపిణీ వ్యవస్థలో కూడా భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ బిల్లులో అనేక ఇతర అంశాలున్నప్పటికీ డిస్కవ్‌ుల డీలైసెన్సింగే చాలా కీలకం. ఇది అమల్లోకి వస్తే విద్యుత్ పంపిణీపై డిస్కవ్‌ుల గుత్తాధిపత్యం పోయి విద్యుత్ వ్యాపారానికి లైసెన్స్ కోసం విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సి)లో ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది.
కానీ అనుమతుల విషయంలో ఇఆర్‌సి పాత్ర కూడా పరిమితంగానే ఉంటుంది. దరఖాస్తు పెట్టుకున్న 60 రోజుల్లోగా ఇఆర్‌సి ఆమోదించకపోతే ఆటోమేటిక్ గా ఆమోదం (డీవ్‌‌డు టు అప్రూవల్) లభించినట్లే పరిగణిస్తారు.ఈ మేరకు కేంద్రం విద్యుత్ చట్ట సవరణ బిల్లులో క్లాజులను పొందుపరిచింది. విద్యుత్ పంపిణీ విషయంలో దేశంలో ఇప్పటికే అక్కడక్కడా ఫ్రాంచైజీ సిస్టవ్‌ు అమల్లో ఉంది. ఈ బిల్లు పాసైతే ఫ్రాంచైజీ విధానంలో కాకుండా ప్రైవేటు కంపెనీలు నేరుగానే రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇకపోతే డిస్కవ్‌ులు క్రమంగా క్రాస్ సబ్సిడీని ఎత్తివేయాల్సి ఉంటుందని కేంద్రం ఇది వరకే అనేక సందర్భాల్లో చెబుతూ వస్తోంది. వాస్తవానికి పేద వర్గాలు అందులోనూ లోటెన్షన్ (ఎల్టీ)లో 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను వాడే వినియోగదారులను ఆదుకోవడానికి డిస్కవ్‌ులు ఓపెన్ యాక్సెస్ (బహిరంగ విపణి)లో కరెంట్ కొంటున్నవారి నుంచి అదనపు క్రాస్ సబ్సిడీని వసూలు చేస్తున్నాయి. విద్యుత్ బిల్లులు చెల్లించలేని గృహ వినియోగదారులకు శ్లాబులవారీగా బిల్లును వసూలు చేస్తున్నాయి. వీరికి ప్రభుత్వ సహాయంతో పాటు భరించే వర్గాల నుంచి వసూలు చేసి భరించలేని పేద వర్గాలకు ఇచ్చే క్రాస్ సబ్సిడీ విధానం ఉంది.
ఇక నుండి ఈ బిల్లుతో క్రాస్ సబ్సిడీ విధానం కూడా రద్దు అవుతుంది. మరోవైపు డిస్కవ్‌ుల మనుగడ అంతా హెచ్‌టి వినియోగదారుల మీదే ఆధారపడి ఉంటుంది. ఎల్‌టి వినియోగదారులకు అందులోనూ 200 యూనిట్ల లోపు వాడే వినియోగదారుల నుంచి వచ్చే బిల్లులతో డిస్కవ్‌ులకు వ్యాపార పరంగా పెద్దగా గిట్టుబాటు కాదు. పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులే వాటికి అండగా ఉంటున్నారు. కొత్త బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే ఈ వర్గాలను ప్రైవేటు కంపెనీలు ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వ్యవసాయ రంగంలోని వినియోగదారులతో పాటు 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే వారు మాత్రమే డిస్కవ్‌ులకు మిగులుతారు. దీంతో ఈ పంపిణీ సంస్థలు ఆర్థికంగా నష్టపోయి క్రమంగా వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. అదే జరిగితే విద్యుత్ ఉద్యోగుల కొలువులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న డిస్కవ్‌ులు భవిష్యత్‌లో మనుగడ సాగించడం కూడా కనాకష్టంగా మారుతుంది. సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు (ఆర్‌పిఒ) విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. కొనుగోలు చేసే మొత్తం విద్యుత్‌లో 7.5 శాతం సోలార్, పవన విద్యుత్ ఉండాలని కేంద్రం చెబుతోంది.
రాష్ట్రాలు ఆ మేరకే విద్యుత్‌ను కొంటున్నాయి. ప్రతిపాదిత సవరణ బిల్లులో ఈ వాటా 20 శాతం ఉండాలని పేర్కొన్నారు. దీని కోసం జాతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్‌ఎల్‌డిసి)ని శక్తిమంతం చేయబోతున్నారు. దీనితో దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రానికి, ఎంత మేరకు విద్యుత్ కావాలి, ఎవరి నుంచి విద్యుత్ ఇవ్వాలనేది ఇక నుండి ఎన్‌ఎల్‌డిసియే చూసుకోనుంది. అంతేగాకుండా బహిరంగ మార్కెట్ నుంచి కరెంట్ కొనుగోలు చేయాలన్నా దీని అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్‌ను క్రమబద్ధం చేయడమే బాధ్యతగా ఉన్న ఎన్‌ఎల్‌డిసి ఇక కరెంట్ సరఫరాపై పూర్తి అజమాయిషీని తీసుకుంటుంది. దీని వల్ల జెన్‌కో కేంద్రాలు నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్ కంపెనీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న సౌర, పవన విద్యుత్ ప్లాంట్లకు ప్రాధాన్యం పెరుగుతుంది. విద్యుత్ రంగం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ రాష్ట్రాల అధికారాలను కేంద్రం లాక్కొని ఎన్‌ఎల్‌డిసి చేతుల్లో పెట్టబోతుంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ చట్ట సవరణ బిల్లు వల్ల ప్రైవేటు కంపెనీలకు లాభాలు, ప్రభుత్వ రంగంలోని విద్యుత్ సంస్థలకు అపారమైన నష్టాలు కలిగి, వినియోగదారులపై భారీగా ఛార్జీల భారం పడుతుంది. రాష్ర్ట ప్రభుత్వాలది ప్రేక్షక పాత్రే అవుతుంది. విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయాక ప్రైవేట్ సంస్థల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తుంది. ప్రైవేట్ సంస్థలు పెట్టుబడి పెట్టకుండా దేశంలోని కొన్ని లక్షల కోట్ల విలువైన నెట్‌వర్క్‌ను ఉపయోగించి విద్యుత్ వ్యాపారం చేసుకుని లాభాలు దండుకునే అవకాశం ప్రైవేట్ సంస్థలకు కల్పించడానికి ఉపయోగపడుతుంది.
ప్రైవేటు కంపెనీలు వస్తే విద్యుత్ రంగంలో పోటీ పెరుగుతుందని, సేవలు మెరుగుపడతాయనడం ఇంతవరకు ఎక్కడా రుజువు కాలేదని స్పష్టం. విద్యుత్ సంస్కరణల వల్ల వ్యసాయ రంగంపై యేటా లక్ష కోట్ల అదనపు భారం పడబోతోంది. ఇరిగేషన్ ఖర్చు 500 శాతం దాకా పెరుగుతుంది. 2018- 19 సంవత్సరపు పవర్ ఫైనాన్స్ కమిషన్ నివేదిక ప్రకారం మొత్తం విద్యుత్ విక్రయాల్లో 22.4 శాతం వ్యవసాయ రంగానికి వెచ్చించారు. ఆ సంవత్సరం విద్యుత్ సరఫరా వ్యయం సగటున యూనిట్ 6 రూపాయల 13 పైసలు అని తేలింది. ఈ భారాన్నంతటిని రైతులు మోయాల్సి వస్తే యేటా లక్ష కోట్ల రూపాయల దాకా చెల్లించుకోవాల్సి ఉంటుంది. బడా కార్పొరేట్లకు, బహుళజాతి సంస్ధలకు విద్యుత్ రంగంపై గుత్తాధిపత్యం కల్పించడమే ఈ బిల్లు అసలు ఉద్దేశం. అయిదేళ్లలో 10 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ల రుణ బకాయిలను మాఫీ చేసిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ చట్ట సవరణ బిల్లు రూపంలో మరో కానుక ఇచ్చేందుకు సిద్ధమైంది. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో దేశ ప్రజలంతా కలిసికట్టుగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలి.

నాదెండ్ల శ్రీనివాస్
9676407140

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News