Saturday, April 27, 2024

ఎమ్మా… ‘అదిరిందమ్మా’…

- Advertisement -
- Advertisement -

Emma Raducanu wins US Open title

గ్రాండ్‌శ్లామ్ టైటిల్ సాధించిన తొలి క్వాలిఫైయర్‌గా రికార్డు

న్యూయార్క్: యుఎస్ ఓపెన్ మహిళల టెన్నిస్ సింగిల్స్‌లో సంచలనం నమోదైంది. మహామహులను మట్టి కరిపించి ఇద్దరు అన్‌సీడెడ్ క్రీడాకారులు బరిలోకి దిగిన ఫైనల్ పోరులో 18 ఏళ్ల బ్రిటీష్ యువ కెరటం ఎమ్మా రదుకాను సంచలన చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో కెనడాకు చెందిన 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌ను 6 4, 6 3 స్కోరుతో వరస సెట్లలో ఓడించి తొలి గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్‌ను గెలుచుకున్న తొలి క్వాలిఫైయర్‌గా రదుకాను చరిత్ర తిరగరాసింది.150 ర్యాంక్‌లో కొనసాగుతున్న రదుకాన తనకన్నా మెరుగైన స్థానంలో కొనసాగుతున్న 73వ ర్యాంక్ క్రీడాకారిణి లెలా ఫెర్నాండెజ్‌ను ఓడించింది. దీంతో 44 ఏళ్ల తర్వాత గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌ను గెలుచుకున్న బ్రిటన్ మహిళగా ఘనమైన రికార్డును ఎమ్మా నెలకొల్పింది. బ్రిటన్ తరఫున వర్జీనియా వేడ్ 1977లో తొలి గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌ను గెలుపొందింది.అంతేకాదు 17 ఏళ్ల వయసులోనే గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌ను దక్కించుకున్న క్రీడాకారిణిగా ఎమ్మా నిలిచింది. గతంలో రష్యా క్రీడాకారిణి మారియా షరపోవా కూడా 2004లో 17 ఏళ్ల వయసులోనే వింబుల్డన్ టైటిల్‌ను దక్కించుకుంది.

ఇక అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఎమ్మా మొదటినుంచి లెలాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఎక్కడ కూడా భారీ తప్పిదాలు చేయకుండా తొలి సెట్‌ను 6 4 తేడాతో గెలుచుకుంది. మొదటి సెట్‌ను గెలుచుకున్న ఆత్మ విశ్వాసంతో ఆడిన ఎమ్మా రెండో సెట్‌లో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. 6 3 తేడాతో ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా రెండో సెట్‌ను కూడా దక్కించుకుని వరస సెట్లలో గెలిచి తొలి గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌ను ఎగరేసుకు పోయింది. ఇటీవలి వింబుల్డన్ టోర్నీలో నాలుగో రౌండ్‌కు చేరుకోవడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించిన ఎమ్మా ఈ టోర్నమెంట్ ఆసాంతం ఒక్క సెట్‌ను కూడా కోల్పోవకపోవడం విశేషం. ఈ టోర్నీలో తాను ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలోను ఒక్క సెట్ కూడా ఆమె కోల్పోలేదు. ఇక టైటిల్‌ను గెలిచిన ఎమ్మా 2.5 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విజయంతోఆమె ర్యాంకింగ్ ఒక్కసారిగా 150నుంచి 23కు చేరింది. దీంతో ప్రస్తుతం బ్రిటన్‌లో తానే నంబర్ వన్ క్రీడాకారిణిగా నిలిచింది. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ఎమ్మా రదుకానును బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్2 అభినందనలతో ముంచెత్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News