Thursday, May 9, 2024

రక్షణ కిట్లు వేగంగా అందించండి: ఈటల

- Advertisement -
- Advertisement -

Etela Rajender

 

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా రక్షణ కిట్లను వేగంగా అందించాలని మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర వైద్యసహాయ మంత్రిని కోరారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో నెలకొన్న సమస్యలపై మంత్రి ఈటల సోమవారం కేంద్ర వైద్యశాఖ సహాయమంత్రి అశ్వినికుమార్ చౌబేతో ఫోన్‌లో మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ఉందని, సిఎం, వైద్యాధికారులు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. మర్కజ్‌లింక్ లేకపోతే రాష్ట్రంలో కరోనా కట్టడి మరింత సులువుగా మారేదని మంత్రి ఈటల కేంద్ర సహాయ మంత్రికి వివరించారు. ఏదెమైనా కరోనా తీవ్రతను తగ్గించేందుకు సిఎం కేసిఆర్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారన్నారు. ఇప్పటికే కొవిడ్ చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రులను కూడా సిద్ధం చేశామని తెలిపారు. అయితే గతంలో 1000 వెంటిలేటర్స్ కావాలని కేంద్రాన్ని కోరామని, కానీ వాటిని ఇప్పటి వరకు అందించలేదని గుర్తుచేశారు. వాటిని వెంటనే అందజేయాలని మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు రాష్ట్రంలో కొత్తగా టిమ్స్(తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్) హాస్పిటల్‌ను కూడా ఏర్పాటు చేశామని కేంద్రమంత్రికి వివరించారు. అయితే దీనిలో వైద్యపరికరాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర సహకరించాలని కోరారు. మరోవైపు పిపిఇ కిట్లు, ఎన్ 95 మాస్కులు కేంద్రం నుంచి ఆశించినంతగా రావడం లేదని తెలిపారు.

గతంలో ఈ కిట్లను హెచ్‌సిఎల్ నుంచి పంపిణీ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది కానీ, ఇప్పటి వరకు తగినంత రాలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వైద్యపరికరాల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేయాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం వైద్యుల రక్షణ కోసం పెద్ద మొత్తంలో పిపిఇ కిట్లు, ఎన్ 95 మాస్కులు సేకరిస్తుందని, కానీ ప్రైవేట్ సంస్థల్లో ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. కావున కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుందన్నారు. అదే విధంగా ఐసిఎంఆర్ అనుమతించిన తొమ్మిది ల్యాబ్‌లలో కరోనా నిర్థారణ పరీక్షలు వేగంగా చేస్తున్నామని, ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో ల్యాబ్ ఎక్విప్‌మెంట్లు కూడా అందించాలన్నారు. రాష్ట్రంలో కరోనా ఫ్రీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు పనిచేస్తుందని, దీనిలో భాగంగానే లాక్‌డౌన్ ముగింపు సమయాన్ని కేంద్ర విధించిన మే 3ను 7 వరకు పొడిగించామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో విదేశాల విమానాలకు అనుమతులు ఇవ్వొద్దని, ఇంకిన్ని రోజులు కఠినంగా వ్యవహరించాలని కేంద్రమంత్రి అశ్వినికుమార్‌ను రాష్ట్ర వైద్యమంత్రి ఈటల రాజేందర్ కోరారు.

Etela Rajender Phone to Union Medical Help Minister

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News