Sunday, April 28, 2024

రాజకీయ పార్టీ ప్రకటించిన రైతు సంఘాలు

- Advertisement -
- Advertisement -

Farmers' Associations declared by political party

పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటన

చండీగఢ్: సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిర్విరామంగా సాగిన రైతు పోరాటంనుంచి రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. ఆందోళన సమయంలో రాజకీయ పార్టీ ఊసెత్తని రైతు సంఘాల నేతలు.. కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను వెనక్కి తీసుకున్న అనంతరం రాజకీయ పార్టీ ప్రకటన చేయడం గమనార్హం. అంతేకాదు, రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీలో ఉంటుందని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. 22 రైతు సంఘాలతో ‘సంయుక్త సమాజ్ మోర్చా’ పేరిట ఏర్పడిన ఈ పార్టీ రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రాథమిక వార్తలను బట్టి తెలుస్తోంది. పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయబోమని రైతుల ఆందోళనకు నాయకత్వం వహించిన 32 రైతు సంఘాలతో ఏర్పడిన సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టంగా ప్రకటించిన కొద్ది గంటలకే ఈ రాజకీయ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి పోటీ చేయదని, ఎన్నికల ప్రయోజనాల కోసం ఏ వ్యక్తి, లేదదా సంస్థ తమ కూటమి పేరును ఉపయోగించుకోరాదని శనివారం లూథియానాలో జరిగిన సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. పార్టీ ఏర్పాటు ప్రకటన గురించి శనివారం చండీగఢ్‌లో రైతు సంఘం సీనియర్ నేత బల్బీర్ సింగ్ రాజేవాలా చండీగఢ్‌లో మాట్లాడుతూ, ‘400 భిన్న ఆలోచనలున్న సంఘాలు అన్నీ కలిసి ‘ సంయుక్త సమాజ్ మోర్చా’ అనే పార్టీని ఏర్పాటు చేశాయి. రైతు సమస్యలే ప్రధానంగా ఈ పార్టీ ఏర్పడింది. ఎన్నికలను బహిష్కరించాలనే పిలుపు మానుంచి ఎప్పుడూ రాలేదు. అలాగే రాబోయే ఎన్నికల్లో పోటీ గురించి ఇంకా పూర్తి అవగాహనకు రాలేదు. అయితే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా పోటీ చేస్తాం’ అని చెప్పారు. కాగా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇష్టపడని రైతు సంఘాలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీతో చేతులు కలపవచ్చని తెలుస్తోంది. రైతులు కొనసాగించిన ఆందోళనకు కేజ్రివాల్ మొదటినుంచి మద్దతు కొనసాగిస్తూ వచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News