Sunday, April 28, 2024

ఎపి భవన్ విభజనపై ఎట్టకేలకు ఒప్పందం

- Advertisement -
- Advertisement -

కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సమక్షంలో రెండు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్‌ల ఉన్నతస్థాయి సమావేశం
తెలంగాణకు 8.5 ఎకరాలు, ఎపికి దాదాపు 11.5 ఎకరాల భూమి కేటాయించేలా అంగీకారం
త్వరలోనే ఆమోదం తెలుపనున్న కేంద్ర హోం శాఖ
అనంతరం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సిఎం రేవంత్

మనతెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీలోని ఎపి భవన్ ఆస్తుల పంపకాలపై ఎపి, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఎట్టకేలకు ఏకాభిప్రాయం కుదిరింది. ఈ మేరకు సోమవారం కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సమక్షంలో రెండు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్‌ల ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎపి భవన్ ఆస్తుల పంపకాలపై ఒప్పందం కుదిరింది. తెలంగాణకు దాదాపు 8.5 ఎకరాల భూమి, ఎపికి దాదాపు 11.5 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించారు. ఎపి భవనం మొత్తం 19.73 ఎకరాలు కాగా, దాని విలువ దాదాపు రూ.10,000 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఎపి భవన్‌లో నివాస, నివాసేతర భవనాలు ఉన్నాయి. ఎపి భవన్‌లో శబరి, స్వర్ణముఖి, గోదావరి బ్లాక్‌లు ఉన్నాయి.
పలు పెండింగ్ అంశాలు కేంద్రం దృష్టికి…
రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కేంద్ర హోం శాఖ అధికారులను కోరానని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డా.మల్లు రవి పేర్కొన్నారు. సోమవారం కేంద్ర హోంశాఖ అధికారులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్టు ఆయన తెలిపారు. సమావేశం అనంతరం తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ తో కలిసి తెలంగాణ భవన్‌లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ అధికారులతో సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించామని, రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఢిల్లీలోని ఎపి, తెలంగాణ భవన్ విభజన, ఆస్తుల పంపకానికి ఇరు రాష్ట్రాలు అంగీకార పత్రాలను చేసుకున్నాయన్నారు. దీనికి సంబంధించి త్వరలో కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని ఆయన చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలను తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌తో చర్చించి త్వరలో కేంద్ర అధికారులను కలిసి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.
కేంద్ర హోం శాఖ నిర్ణయం తరువాత కేబినెట్ ఆమోదం
ఎన్డీఆర్‌ఎఫ్ నిధుల గురించి కూడా హోంశాఖ అదనపు కార్యదర్శితో చర్చించామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వస్తే వాటిని పరిశీలిస్తామని అదనపు కార్యదర్శి చెప్పారన్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి అదనపు ఐపిఎస్ అధికారులనే కేటాయించే అంశాన్ని కూడా కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు. ప్రస్తుత ఉమ్మడి భవన్ ప్రాంగణంలోని శబరి బ్లాక్ లో మూడున్నర ఎకరాలు, పటౌడి హౌస్‌లో ఐదున్నర ఎకరాల భూమిని తెలంగాణకు, గోదావరి బ్లాక్ , పటౌడి హౌస్, నర్సింగ్ హాస్టల్ భూ భాగం ఆస్తులు ఎపికి కేటాయించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. త్వరగా నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ అదనపు కార్యదర్శిని కోరినట్లు ఆయన చెప్పారు. కేంద్ర హోం శాఖ నిర్ణయం తర్వాతే తెలంగాణ భవన్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదిస్తుందని, ఆ తర్వాత సిఎం రేవంత్ రెడ్డి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని డా. మల్లు రవి పేర్కొన్నారు.

AP Bhavan 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News