Monday, April 29, 2024

ఉత్తరాఖండ్ అల్లర్లలో ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

100 మందికిపైగా పోలీసులకు గాయాలు

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని హల్దానీలో అక్రమంగా నిర్మించిన ఒక మద్రాసాను, పక్కనే ఉన్న మసీదును కూల్చివేయడానికి వ్యతిరేకంగా జరిగిన హింసాకాండలో ఐదుగురు మరణించగా 100 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. పథకం ప్రకారం ఘర్షణలు జరిగాయని అధికారులు శుక్రవారం తెలిపారు. వాహనాలను దగ్ధం చేసి పోలీసు స్టేషన్‌కు నిప్పుపెట్టిన స్థానికులు ఘర్షణల సందర్భంగా రుళ్లు రువ్వడంతో ఆ ప్రాంతంలో అధికారులు కర్ఫూ విధించారు.

గాయపడిన వారిలో అత్యధికులు పోలీసులేనని, మద్రాసాను, మసీదును కూల్చివేసిన మున్సిపల్ కార్మికులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. గురువారం జరిగిన హింసాకాండలో ఐదుగురు మరణించగా వంద మందికి పైగా పోలీసులు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. హల్దానీలోని కొన్ని ప్రాంతాలలో భారీ ఎత్తున పోలీసులను మోహరించిన దృశ్యాలు శుక్రవారం ఉదయం టీవీలలో కనిపించాయి. ఉత్తరాఖండ్ వ్యాప్తంగా హైఅలర్ట్‌ను ప్రకటించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. హింసాకాండను పురస్కరించుకుని ఇంటర్‌నెట్‌ను నిలిపివేసినట్లు వెల్లడించింది.

నైనిటాల్‌లోని అన్ని స్కూళ్లు, కాలేజీలను మూసివేయాలని పాలనా యంత్రాంగం ఆదేశించింది. హింసాకాండ తీవ్రం కావడంతో హల్దానీలోని అన్ని దుకాణాలను మూసివేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లో కూడా హైఅలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో వాహనాల తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సోషల్ మీడియా కార్యకలాపాలపై కూడా అధికారులు నిఘా వేసి ఉంచారు. నైనిటాల్ జిల్లా మెజిస్ట్రేట్ వందనా సింగ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు, జిల్లా యంత్రాంగం ఎవరినీ రెచ్చగొట్టడం కాని హాని కాని చేయలేదని వీడియోలను బట్టి అర్థమవుతోందని చెప్పారు.

సిసిటివిల ద్వారా నిందితులను గుర్తిస్తున్నట్లు ఆమె చెప్పారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు అక్రమ కట్టడాల తొలగింపు జరిగిందని, ప్రజలను తగలబెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆమె తెలిపారు. ప్రభుత్వ స్థలంలో మద్రాసా, మసీదును అక్రమంగా నిర్మించారని సీనియర్ ఎస్‌పి ప్రహ్లాద్ మీనా తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు పోలీసులు, ప్రొవిన్షయల్ ఆర్మ్ కానిస్టేబులరీ(పిఎసి) సమక్షంలో కూల్చివేతలు జరిగాయని ఆయన చెప్పారు.

కాగా, కూల్చివేతలను నిరసిస్తూ మహిళలతోసహా పెద్ద సంఖ్యలో స్థానికులు వెలుపలకు వచ్చి హింసాకాండకు దిగారని ఆయన చెప్పారు. అపోలీసు గస్తీ కారుతోసహా అనేక వాహనాలకు వారు నిప్పు పెట్టారని, సాయంత్రానికి బన్‌భూల్‌పురా పోలీసు స్టేషన్ కూడా తగలబడిపోయిందని ఆయన తెలిపారు. దీంతో షూట్ ఆన్ సైట్‌కు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారని ఆయన వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News