Monday, April 29, 2024

ఆర్థిక బలోపేతానికి…మాంటెక్ మంత్రం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర ఉన్నతాధికారులతో శనివారం ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్ అహ్లూవాలియా ప్రత్యేకంగా భేటీ కావడం ప్రత్యేకతను సంతరించుకొంది. “ఎన్నికల్లో పజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి, అభయహస్తంలోని అన్ని పథకాలను విజయవంతంగా అమలుచేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం… మీ ప్రభుత్వాన్ని విజయతీరాలకు చేరుస్తామని…” ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్ అహ్లూవాలియా భరోసాను ఇచ్చారని తెలిసింది.

ఏకంగా 45 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో సి ఎం రేవంత్‌రెడ్డి బృందానికి అనేక సలహాలు, సూచనలు చేసి ఉంటారని, తప్పకుండా ఆయన సలహాలు రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలుచేసేవిగా ఉంటాయని, ఆర్థిక సంక్షోభంలోఉన్న ప్రభుత్వ ఖజానాకు అవసరమైన వనరుల సమకూరే విధంగా పలు సూచనలు చేసి ఉంటారని ఆర్థికశాఖలోని పలువురు సీనియర్ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను (ఆరు గ్యారెంటీలు) విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన ఆర్థిక వనరులను సమీకరించుకోవడం, అప్పుల ఊబిలో నుంచి బయటపడటం, కొత్తగా అప్పులు చేయాల్సి వచ్చినా… అది కూడా నామమాత్రంగానే ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకోవడం, అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిరాఘాటంగా అమలు చేయడం వంటి అనేక సవాళ్ళతో ప్రభుత్వం త్వరలోనే 2024-25వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా హైదరాబాద్‌కు వచ్చి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందంతో భేటీ కావడంతో హాట్‌టాపిక్ అయ్యింది.

మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా, ఆయన బృందంలోని సభ్యుడు మోదీలు ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్తు రంగాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అభయహస్తంలోని ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించారు. ఈ పథకాల అమలుకు ఎన్ని నిధులు అవసరమవుతాయోననే వివరాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చిచూస్తే తెలంగాణలో ఏయే రంగాల్లో ఎక్కడెక్కడ ఆదాయం తగ్గుతుంది, అందుకు గత కారణాలను విశ్లేషించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తమ సంస్థ సిద్ధంగా అహ్లూవాలియా హామీ ఇచ్చారు. ప్లానింగ్ బోర్డ్ సామర్థం పెంచేందుకు అవసరమైన సూచనలను సింగ్ చేశారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవలి కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో సోలార్ పవర్, ఇతర విద్యుత్తు ఉత్పత్తి అవకాశాల గురించి చర్చించారు. సోలార్ పవర్ రంగంలో ఉత్పత్తి సామర్థ్ధం పెంచుకునేందుకు తెలంగాణ ప్రాంతంలో ఏయే ప్రాంతాల్లో అవకాశాలు ఉన్నాయోననే అంశంపై ఒక అవగాహనకు వచ్చారు. విద్యుత్ రంగాల్లో ఉత్పత్తి సామర్థం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి తమ సంస్థ పనిచేసేందుకు సిద్దంగా ఉందని అహ్లూవాలియా ముఖ్యమంత్రికి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది గనుక తాము కూడా ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్‌నే ప్రవేశపెడితే బాగుంటుందా..? లేక ఏడాదికి సరిపడా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టుకుంటే మేలు జరుగుతుందా..? అనే అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేరుకే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌గా చెప్పారేగానీ పద్దులు, గణాంకాలన్నీ పూర్తిస్థాయి బడ్జెట్‌నే ప్రతిబింభించాయని, అందుచేత కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చేదేమీలేదని తేలిపోయింది గనుక ఏ బడ్జెట్‌ను ప్రవేశపెట్టుకున్నా ఇబ్బందులేమీ ఉండదని సూచించినట్లు తెలిసింది.

ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఈనెల ఒకటో తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం జరుగకపోగా కనీసం అమలులో ఉన్న కేంద్ర పథకాలకు కూడా పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వకుండా వేధిస్తున్న అంశాలు, 2014కు పూర్వం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోని ప్రజా సంక్షేమ పథకాలను రద్దు చేయడంతో రాష్ట్రాలకు ముఖ్యమంత్రి తెలంగాణ వంటి కొత్త రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలు, ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులపై చర్చించారని వివరించారు. దీనికితోడు కేంద్ర ప్రభుత్వ సంస్థలే అయిన నీతి ఆయోగ్, 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులను కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేయకుండా, తెలంగాణ రాష్ట్రానికి గడచిన అయిదేళ్ళ కాలంలో ఏకంగా ఒక లక్షా 35 వేల కోట్ల రూపాయల నిధులను ఎగ్గొంటిందని, ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి అదనపు నిధులను ఆశించే అవకాశాలు లేవని ఈ సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో 2024-25వ ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ను ఏ విధంగా తయారు చేసుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని సిఎం రేవంత్‌రెడ్డి కోరినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన అహ్లూవాలియా పలు కీలకమైన సలహాలు, సూచనలు చేశారని, అవి తప్పకుండా ఈ బడ్జెట్‌లోనే ప్రతిబింభిస్తాయని, తప్పకుండా ఆరు గ్యారెంటీల అమలు, ఒకటో తేదీన్నే ఉద్యోగులకు జీతాలు చెల్లించే ప్రక్రియలను కూడా పూర్తి చేస్తామని ఆ అధికారులు ధీమాగా వివరించారు. అంతేగాక కేంద్రంపై ఆధారపడకుండా, అతిగా అప్పు లు చేయకుండా, ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం పరిధిలోనే అప్పులు ఉండేటట్లుగా తగిన జాగ్రత్తలు తీసుకొని, ప్రజలపై ఎలాంటి అదనపు పన్నుల భారాన్ని మోపకుండానే విజయవంతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుకోవచ్చునని, అందుకు తగినట్లుగా ఆదాయ వనరులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని, తెలంగాణ ప్రజలు మెరుగైన, సంతోషకరమైన (లైవ్లీహుడ్) జీవితాన్ని అనుభవించడానికి చేపట్టిన పథకాలన్నీ విజయవంతంగా అమలవుతాయని మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా ఎంతో భరోసాతో ముఖ్యమంత్రికి సూచించారని ఆ అధికారులు వివరించారు.
జిఎస్‌టి పన్నుల వసూళ్ళల్లో, రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలను సమకూర్చుకోవడంలో ఎక్కడైనా లోపాలు, మిస్సింగ్‌లు ఉంటే వాటిపై దృష్టిపెట్టి ఖచ్చితంగా పన్నుల వసూళ్ళల్లో నూటికినూరు శాతం రిజల్ట్ సాధించాలనే అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని పెంచుకొంటూ, ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా అనవసరమైన, వృధా ఖర్చులను తగ్గించుకునేటట్లుగా పక్కాగా, ప్రణాళికాబద్ధంగా వ్యయం జరిగేటట్లుగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలని అహ్లూవాలియా సూచించినట్లు తెలిసింది. అంతేగాక మున్సిపల్ వ్యవహారాలు, నీటిపారుదలశాఖ, విద్యుత్తు, పంచాయితీరాజ్, రూరల్ డవలప్‌మెంట్, ఆర్ అండ్ బి తదితర ఇంజనీరింగ్ విభాగాల్లోని కొందరు అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యి కొన్ని అవసరంలేని పనులను కూడా చేసి బిల్లులు పెడుతుంటారని, వాటిపైన దృష్టిసారించాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. అంతేగాక హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని మరికొన్ని నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు మెం డుగా ఉన్నాయని, ఆ రంగం నుంచి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి దృష్టిపెట్టాలని నిర్ణయానికి వచ్చా రు. దీనికితోడు ఆర్థికశాఖ నిర్వహణలో కూడా కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగాల్లో జరుగుతున్న వృధా పనులు, కేవలం కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యి జరుగుతున్న వర్క్‌పైన దృష్టిపెట్టాలని, అం దుకు విజిలెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. మొత్తంమీద ప్రభుత్వ ఖజానాకు అన్యాయంగా గండికొట్టే వారిపై దృష్టిపెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News