Saturday, April 27, 2024

ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా అడవులు,పార్కులు

- Advertisement -
- Advertisement -

అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్, చెత్త సేకరణకు ప్రత్యేక బృందాలు, రీ సైకిల్ కేంద్రాల ఏర్పాట్లు

Forests and parks as plastic free areas
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని అడవులు, రక్షిత ప్రాంతాలు, అర్బన్ ఫారెస్ట్ పార్కులను పూర్తి ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా మార్చేందుకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది. అడవుల సమీప ప్రాంతాల ప్రజలతో.. అటవీ రహదారుల్లో ప్రయాణించే వారు విసిరే వస్తువులతో ఆ ప్రాంతాల్లో ప్లాస్టిక్, చెత్తా చెదారం పేరుకుపోతోంది. ఇలా పోగుపడిన చెత్త వన్యప్రాణులతో పాటు, అటవీ ప్రాంతాలకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తోంది. చాలా చోట్ల అగ్నిప్రమాదాలకు కారణం అవుతోంది. దీనిని నివారించేందుకు అటవీశాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ప్లాస్టిక్ రహిత, బాధ్యతాయుతమైన పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా అధికారులు కార్యాచరణ చేపట్టారు.

అమ్రాబాద్ తరహా రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ..

శ్రీశైలం దారిలో అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాంతంలోని 65 కిలో మీటర్ల మేర కొన్నేళ్లుగా చెత్త సేకరణ, విడదీసి ప్లాస్టిక్ రీసైకిలింగ్ కు పంపే విధానం విజయవంతంగా కొనసాగుతోంది. అమ్రాబాద్ అటవీ ప్రాంతం, రహదారికి ఇరువైపులా ఇప్పుడు పరిశుభ్రంగా మారింది. ఇదే విధానాన్ని మిగతా ప్రాంతాల్లో కూడా చేపట్టాలని రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయించింది. ఉన్నతాధికారుల సూచన మేరకు కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో ఇటీవల చెత్త తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించారు. సుమారు వెయ్యి కేజీల ప్లాస్టిక్, ఇతర చెత్తను అటవీ ప్రాంతాల నుంచి సేకరించారు. రెండు టైగర్ రిజర్వులు (అమ్రాబాద్, కవ్వాల్) మూడు జాతీయ ఉద్యాన వనాలు (కెబిఆర్, మృగవని, హరిణ వనస్థలి), నాలుగు అభయారణ్యాల్లో (పాకాల, కిన్నెరసాని, పోచారం, ఏటూరునాగారం), అటవీ అర్బన్ పార్కులు(109), జూ పార్కుల్లో ప్లాస్టిక్ ను పూర్తిగా నియంత్రించాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (హెచ్‌ఓఓఎఫ్) ఆర్.ఎం. డోబ్రియల్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని అటవీ ప్రాంతాల్లో చెత్త సేకరణను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయటం, రీ సైకిల్ పాయింట్ల ఏర్పాటు, చెత్తను విడతీయడం (సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్), బెయిలింగ్, ప్రాసెసింగ్ యూనిట్ కు తరలింపును దశల వారీగా చేపట్టనున్నారు. ఈ విధానంలో అడవులపై ఆధారపడే జీవించే స్థానికులకు కొంత ఉపాధి కూడా దొరికే అవకాశం ఉంది.

బాధ్యతాయుతమైన పర్యావరణ పర్యాటకం..

అటవీ ప్రాంతాల నుంచి ప్రయాణించే వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అటవీ శాఖ విజ్ఞప్తి చేసింది. ప్లాస్టిక్ బాటిల్స్, రేపర్స్, ఇతర చెత్తను, సిగరెట్ పీకలను అటవీ ప్రాంతాల్లో విసిరివేయొద్దని పిసిసిఎఫ్ కోరారు. అడవులు, వణ్యప్రాణులకు ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న అనర్థాలు, పర్యావరణపరంగా పొంచి ఉన్న ముప్పుపై అందరూ అవగాహనతో వ్యవహరించాలని సూచించారు.అడవుల్లో ఉన్న దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, వ్యూ పాయింట్లు, వాటర్ ఫాల్స్, ఫారెస్ట్ అర్బన్ పార్కులకు సందర్శకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని, అదే సమయంలో ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా పేరుకు పోవడం బాధాకరం అన్నారు. ప్లాస్టిక్ రహిత, బాధ్యతాయుతమైన పర్యావరణ పర్యాటకాన్ని (రెస్పాన్సిబుల్ ఎకో టూరిజం) ప్రోత్సహిస్తామని, దీనికి సమాజంలోని అన్ని వర్గాలు, స్వచ్చంద సంస్థల సహకారం కావాలని అటవీశాఖ విజ్జప్తి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News