Monday, April 29, 2024

సందేశ్‌ఖలిలో మళ్లీ నిరసనలు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కల్లోలిత సందేశ్‌ఖలిలో శుక్రవారం సరికొత్తగా నిరసనలు ప్రజ్వరిల్లాయి. గ్రామస్థులను వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టిఎంసి నేతల ఆస్తులకు ఆగ్రహోదగ్రులైన స్థానికులు నిప్పంటించారు. అంతే కాదు. వారు దోషుల పట్ల పోలీసులు క్రియాశూన్యతకు వ్యతిరేకంగా ప్రదర్శనలు కూడా నిర్వహించారు. అశాంతి సమయంలో సందేశ్‌ఖలి ఝుప్‌ఖలి ప్రాంతంలోకి పోలీస్ వాహనాల ప్రవేశాన్ని నిరోధించేందుకై నివాసులు పెద్ద దుంగలతో రోడ్లపై అవరోధాలు ఏర్పాటు చేసి, వాటికి నిప్పు అంటించారు. వరుసగా రెండవ రోజు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. టిఎంసి నాయకులపై దౌర్జన్యాలు, వారి నివాసాల విధ్వంసం వార్తలు వచ్చాయి.

బెంగాల్ డిజిపి రాజీవ్ కుమార్ ఈ పరిస్థితికి స్పందిస్తూ, వరుసగా రెండవ రోజు కల్లోలిత ప్రాంతానికి వెళ్లి, అశాంతికి బాధ్యులపై కఠిన చర్య తీసుకుంటామని శపథం చేశారు. కర్రలు చేత బూనిని నిరసనకారులు బెల్మజూరులో ఒక చేపల యార్డ్ సమీపంలో గుడిసెలను దగ్ధం చేయడమే కాకుండా పరారీలో ఉన్న నిందితుడు, టిఎంసి నేత షాజహాన్ షేఖ్‌పైన, అతని సోదరుడు సిరాజ్‌పైన తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. వారు దగ్థం చేసిన గుడిసెలలో ఒకటి సిరాజ్‌కు చెందినదని వెల్లడైంది. ‘ఏళ్ల తరబడి పోలీసులు ఏమీ చేయలేదు. అందుకే మేము మా భూమిని, గౌరవాన్ని తిరిగి సంపాదించేందుకు సర్వమూ చేస్తున్నాం’ అని ఒక ప్రదర్శకుడు చెప్పాడు. ఆ తరువాత పోలీసులు జోక్యం చేసుకుని ఆగ్రహోదగ్రులైన జనాన్ని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. మధ్యాహ్నం డిజిపి కుమార్ ఆ ప్రాంతానికి వచ్చి స్థానికులతో చర్చలు జరిపారు.

‘మీ ఫిర్యాదులు దాఖలు చేయండి. మేము చర్య తీసుకుంటాం. ఇక్కడ ఒక పోలీస్ శిబిరం ఏర్పాటు చేస్తాం. అయితే, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దని మీకు చిత్తశుద్ధితో విజ్ఞప్తి చేస్తున్నాను’ అని కుమార్ నివాసులతో చెప్పారు. అనంతరం కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, ‘పోలీసులు చర్య తీసుకుంటారు. ఈ ప్రాంతంలో ప్రశాంతత పునరుద్ధరణకు మేము కంకణం కట్టుకున్నాం’ అని తెలిపారు. గ్రామస్థుల నుంచి అక్రమంగా లాక్కున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు, అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లు డిజిపి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News