Monday, April 29, 2024

గాయత్రి బ్యాంకు సేవలు దేశమంతా విస్తరించాలి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల : వినియోగదారులకు చక్కని సేవలందిస్తూ 23 శాఖలతో రాష్ట్రమంతా విస్తరించిన గాయత్రి బ్యాంకు సేవలు దేశమంతా విస్తరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గాయత్రి బ్యాంకు నూతన భవనాన్ని నిర్మించుకుని నూతనంగా జగిత్యాల పట్టణంలో మరో శాఖను ఏర్పాటు చేయగా శుక్రవారం మంత్రి ఈశ్వర్ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జెడ్‌ఫి చైర్‌పర్సన్ దావ వసంతతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జగిత్యాల జిల్లా కేంద్రంగా ప్రారంభమైన గాయత్రి బ్యాంకు అకుంఠిత దీక్ష, పట్టుదల, వినియోగదారులకు చక్కని సేవలందిస్తూ 23 బ్రాంచీలను ఏర్పాటు చేసుకుని రాష్ట్రమంతా విస్తరించడం అభినందనీయమన్నారు. జగిత్యాలలో రెండో బ్రాంచీ ఏర్పాటుతో పాటు అన్ని వసతులతో కూడిన హెడ్ ఆఫీస్ భవనాన్ని నిర్మించుకోవడం చాల ఆనందంగా ఉందన్నారు. నమ్మకమైన బ్యాంకింగ్ సేవలను వినియోగదారుల ముంగిట్లోకి తీసుకువచ్చి ఖాతాదారుల నమ్మకాన్ని చూరగొన్నారన్నారు.

రూ.25 లక్షల వాటాధనంతో ప్రారంభించబడిన బ్యాంకు 23 సంవత్సరాల్లో రూ.1360 కోట్ల డిపాజిట్లు, రూ.970 కోట్ల రుణాలు, 7 లక్షల మంది వినియోగదారులను కలిగి బ్యాంకు అన్ని విధాలుగా మంచి అభివృద్దిని సాధించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన కో ఆపరేటివ్ బ్యాంకుగా నిలవడం హర్షనీయమన్నారు. బ్రాంచీల విస్తరణ ద్వారా బ్యాంకులు ప్రజల ఆర్థిక పరిపుష్టికి కారణమవుతాయని, ప్రజలు బ్యాంకు లో ఖాతా తెరిచి లావాదేవీలు నిర్వహించుకోవడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణతో పాటు కుటుంబ ఆర్థిక స్థితులు మెరుగుపడతాయన్నారు.

బ్యాంకు అభివృద్దికి కారణమైన బ్యాంకు పాలకవర్గాన్ని, ముఖ్య కార్యనిర్వహణాధికారిని, సిబ్బందిని మంత్రి అభినందించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, గాయత్రి బ్యాంకు మొదటి నుంచి వినియోగదారుల కోణంలో ఆలోచిస్తూ వారి అవసరాలకు అనుగుణంగా పనివేళలు, సత్వర సేవలు అందిస్తోందని, తద్వారా గాయత్రి బ్యాంకు మా బ్యాకు అని ప్రతి వినియోగదారుడు భావించేలా సేవలు అందిస్తున్నారన్నారు.

వినియోగదారులకు చక్కని సేవలందించడంతో పాటు గాయత్రి బ్యాంకు బ్రాంచీలను ఏర్పాటు చేసుకుని 408 మందికి ఉద్యోగం కల్పించిందన్నారు. గాయంత్రి బ్యాంకు మరిన్ని శాఖలను విస్తరింపజేసి భవిష్యత్తులో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

జెడ్‌పి చైర్‌పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, గాయత్రి బ్యాంక్ కార్పోరేట్ తరహాలో అన్ని రకాల సేవలను అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతోందని, .జగిత్యాల కేంద్రంగా గాయత్రి బ్యాంకు ఏర్పాటు కావడం జగిత్యాల ప్రజలందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి రామానుజాచార్య, బ్యాంక్ అధ్యక్షుడు ముత్యాల లక్ష్మణ్‌రెడ్డి, బ్యాంకు సిఇఓ వనమాల శ్రీనివాస్, బ్యాంకు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News