Monday, April 29, 2024

సగం చెరువులు ‘మాయం’

- Advertisement -
- Advertisement -

Government plans to strengthen Ponds

 

నగర శివార్లలో 370 చెరువులకు ప్రస్తుతం కనిపిస్తున్నవి 185 మాత్రమే
నేటి కన్నీటి వరదలకు నాటి
ఉమ్మడి పాలకులే కారణం
చెరువులు, కుంటల పటిష్టతకు ప్రభుత్వం ప్రణాళికలు
ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో టీం ఏర్పాటు, ప్రభుత్వానికి నివేదిక

మనతెలంగాణ/హైదరాబాద్ : చినుకు చినుకు కలిసి వరదయ్యింది. ఈ వరదే ప్రస్తుతం జిహెచ్‌ఎంసి పరిధిలోని బస్తీలను, కాలనీలను ముంచెత్తుతోంది. సుమారు 117 ఏళ్ల తరువాత మూసీతో పాటు పలు చెరువులు, కుంటల్లోకి చేరిన వరదనీరు కాలనీలను ముంచెత్తుతోంది. 117 సంవత్సరాల తరువాత భారీ వర్షా లు నగరాన్ని ముంచెత్తడంతో నగరం అతలాకుతలం అవుతోంది. భౌగోళికపరంగా భాగ్యనగరం అభివృద్ధి చెందినా గత పాలకుల నిర్లక్ష్యం వలన చెరువులు, కుంటలు కబ్జాల నేపథ్యంలో అన్యాక్రాంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో వరదనీరు బయటకు వెళ్లే దారి లేక చెరువు కట్టలు తెగిపోతున్నాయి. 10 రోజుల్లో రెండుసార్లు కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు మునిగిపోయాయి.

20 ఏళ్ల క్రితం కూడా భారీ వర్షాలు కురిసినా ఇంత పెద్ద మొత్తంలో ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగలేదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే గత ప్రభుత్వాల హయాంలో వాటర్‌యాక్ట్, వాల్టాయాక్ట్ ప్రకారం చెరువు ఉన్న ప్రాంతంలో (ఎఫ్‌టిఎల్ ఫుల్‌ట్యాంక్ లెవల్)లో, బఫర్‌జోన్‌లలో ఎలాంటి శాశ్వత, కాంక్రీ ట్ నిర్మాణాలు జరగకూడదన్న నిబంధనలను తుంగలో తొక్కారు. భూ విక్రయాలు చేపట్టవద్దని, రిజిస్ట్రేషన్లు జరగవద్దని ప్రభుత్వ ఆదేశాలున్నా జిహెచ్‌ఎంసి పరిధిలోని ప్రతి చెరువు చుట్టుపక్కల ఆక్రమణలు చేసిన రాజకీయ నాయకులు వాటిని వెంచర్లుగా చేసి విక్రయించి చేతులు దులుపుకున్నారు.

గొలుసుకట్టు చెరువులను కలియ తిరుగుతూ…

ప్రస్తుతం చెరువులు, కుంటలు తెగిపోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఇరిగేషన్ శాఖకు బాధ్యతలను అప్పగించింది. ఎప్పటికప్పుడు చెరువు లు, కుంటలు తెగిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం సమీక్ష జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులతో కూడిన టీంను ప్రభుత్వం నియమించింది. ఈ టీం ఎప్పటికప్పుడు జిహెచ్‌ఎంసి పరిధిలోని చెరువులు, కుంటలతో పాటు గొలుసుకట్టు చెరువులను కలియతిరుగుతూ వాటి పటిష్టతకు కావాల్సిన చర్యలను ప్రభుత్వానికి నివేదిస్తోంది. వీరిచ్చే నివేదిక అధారంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయా చెరువులు, కుంటల వద్ద స్థానికంగా నివాసం ఉండే ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపడుతోంది. రానున్న రోజుల్లో వీరు ఇచ్చే నివేదిక ఆధారంగా చెరువుల, కుంటల పరిరక్షణకు మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈనెల 13, 17వ తేదీన కురిసిన వర్షాలకు….

1908 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాద్ నగరంలో 15.3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, 2000 సంవత్సరం ఆగష్టులో 24.2 సెంటిమీటర్లు, ఈనెల 13వ తేదీన 19.2 సెంటిమీటర్ల వర్షపాతం నగరంలో నమోదయ్యింది. ఇదేరోజు ఘట్‌కేసర్ ప్రాంతంలో 32.3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఈనెల 17వ తేదీన నగర వ్యాప్తంగా 19.7 సెంటిమీట ర్ల వర్షపాతం నమోదయ్యింది. దీంతో చెరువులన్నీ నిండిపోయాయి. పలు జిల్లాల నుంచి వరదనీరు భారీగా చేరడంతో హిమాయత్‌సాగర్ గేట్లను ఎత్తివేశారు. దీంతో మూసీతో పాటు పలు చెరువులు అలుగుపారాయి. అయితే పలు చెరువుల్లో వరదనీరు ఎక్కువయితే బయటకు పోయే దారి లేకపోవడం తో ఆ నీరంతా చుట్టుపక్కల ఉన్న కాలనీలను, ప్రాంతాలను ముంచెత్తుతోంది.

రానున్న రోజుల్లో 40 సెంటిమీటర్ల వర్షపాతాన్ని తట్టుకునేలా…

వరద పరిస్థితిని తెలుసుకోవడానికి నగరవ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో చెరువులు, కాలనీల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమీక్ష జరుపుతోంది. రానున్న రోజుల్లో 40 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయిన హైదరాబాద్ నగరం తట్టుకునేలా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇప్పటికే జిహెచ్‌ఎంసి, కార్పొరేషన్‌లతో పాటు పలు పాలకసంస్థలు చెరువుల మరమ్మతులకు నడుంబిగించాయి. పల్లెచెరువు ఉప్పొంగడంతో సుమారు 6 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఈ చెరువులో నుంచి నీటిని బయటకు పంపింగ్ చేస్తున్నారు.

1908 సంవత్సరానికి ముందు జీహెచ్‌ఎంసి పరిధిలో 370 చెరువులు

1908 సంవత్సరానికి ముందు జీహెచ్‌ఎంసి పరిధిలో 370 చెరువులు ఉండగా ప్రస్తుతం అవి 255కు చేరుకున్నాయి. ఈ 255 చెరువుల్లో కూడా చాలా చెరువులు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం కనబడేవి 185 మాత్రమే ఉన్నాయని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. అయితే పలు చెరువులు 50 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో ఉండేవని, ప్రస్తుతం అవి చాలావరకు కుచించుకుపోయాయని, దీంతోపాటు 70 చెరువులకు అలుగుపారే పరిస్థితి లేకుండా కబ్జాలకు గురయ్యాయని ఇరిగేషన్ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. దీంతోపాటు చెరువులు, కుంటలు గతంలో ఎంత విస్తీర్ణంలో ఉండేవి, ప్రస్తుతం ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, తదితర అంశాలను ఇరిగేషన్ అధికారులు పరిగణలోకి తీసుకొని దాని ఆధారంగా నివేదిక రూపొందిస్తున్నారు.

రంగారెడ్డి సర్కిల్ పరిధిలో 3,646 చెరువులు

1908 సంవత్సరానికి కన్నా ముందు రంగారెడ్డి సర్కిల్ పరిధిలో చూసుకుంటే 3,646 చిన్న, పెద్ద చెరువులు ఉండేవని, అందులో మేడ్చల్ 489, రంగారెడ్డిలో 2,031, వికారాబాద్‌లో 1,126 చెరువులు ఉండేవని, ప్రస్తుతం కొన్ని చెరువులు కనుమరుగయ్యాయని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు.

9 ప్రాంతాలు…165 కాలనీలు

నగర ప్రజలు ఇంత దారుణంగా అవస్థలు ఎదుర్కొవడానికి రావడానికి ఎవరు బాధ్యులు ఎవరన్న దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వాల హయాంలో నాయకులు చెరువులను, కుంటను కబ్జాలు చేసి వెంచర్లు వేసి, కోట్లు వెనకేసుకున్నారు. ప్రస్తుతం వారు చేసిన పాపమే నగర ప్రజలను బలిగొందని పలువురు ఆరోపిస్తున్నారు. నగరంలోని ఎనిమిది చెరువులు, ఓకుంట కలిపి మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఏకంగా 254 ఎకరాలను ఆక్రమించినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఆక్రమణలకు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహారించిన నాయకులు 165 కాలనీలుగా మార్చివేసి అమ్మేసినట్టుగా పలువురు ఆరోపిస్తున్నారు. నగరంలో తాజాగా కురిసిన భారీ వర్షాలతో ప్రధానంగా ఎనిమిది చెరువుల చుట్టూ ఉన్న 165 కాలనీలు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇక ఈ ఎనిమిది చెరువులు, వాటి చుట్టూ జరిగిన ఆక్రమణలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అయితే ఈ కబ్జా 254 ఎకరాలు కాదని, మరో 100 ఎకరాలకు పెరిగే అవకాశం ఉందని, ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులు సర్వే అనంతరం జిహెచ్‌ఎంసిలో ఉన్న చెరువులు, కుంటల అసలు విస్తీర్ణం బయటపడనుందని ప్రజలు పేర్కొంటున్నారు.

ఆక్రమణలు జరిగిన చెరువులు

1) జల్‌పల్లి పెద్దచెరువు… విస్తీర్ణం: 299 ఎకరాలు కాగా సుమారు 100 ఎకరాలు ఆక్రమణకు గురయ్యింది.
2) హరిహరపురం కాప్రాయ్ చెరువు, (వనస్థలిపురం), విస్తీర్ణం 13 ఎకరాలు, ఆక్రమణ 3 ఎకరాలు.
3) అప్పా చెరువు, మొత్తం విస్తీర్ణం 14 ఎకరాలు కాగా, ఆక్రమణ 10 ఎకరాలు.
4) బొమ్మలకుంట ఆక్రమణ 8 ఎకరాలు.
5) అల్వాల్ చినరాయుని చెరువు విస్తీర్ణం 17.25 ఎకరాలు కాగా, ఆక్రమణ 5 ఎకరాలు.
6) రామంతపూర్ పెద్దచెరువు విస్తీర్ణం 26 ఎకరాలు కాగా, ఆక్రమణ 13 ఎకరాలు.
7) మైలార్‌దేవ్‌పల్లి పల్లెచెరువు విస్తీర్ణం: 39 ఎకరాలు కాగా, ఆక్రమణ 24 ఎకరాలు.
8) ఉప్పల్ నల్లచెరువు విస్తీర్ణం 120 ఎకరాలు కాగా, ఆక్రమణ 70 ఎకరాలు.
9) మేడిపల్లి చెరువు విస్తీర్ణం 22 ఎకరాలు కాగా, ఆక్రమణలు 12 ఎకరాలుగా అధికారులు గుర్తించారు.

సుమారుగా 70 చెరువుల్లో అలుగు పారే పరిస్థితి లేదు

చాలాచోట్ల చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. కొన్నిచోట్ల గొలుసుకట్ట చెరువులున్నా వాటి పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. వాటి నుంచి నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. సుమారుగా 70 చెరువుల్లో అలుగు పారడం లేదు. ఈ పరిస్థితుల్లో పంపింగ్ ద్వారా నీటిని బయటకు పంపిస్తున్నాం. ప్రస్తుతం చాలా చెరువుల దగ్గర నిర్మించుకున్న కాలనీలు మునిగిపోయాయి. అక్కడి పరిస్థితిని చూస్తే కడుపుతరుక్కుపోతుంది. చెరువులు, కుంటల పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి త్వరలో ప్రభుత్వానికి నివేదిస్తాం.
– ఎస్. భీమ్‌ప్రసాద్, జాయింట్ సెక్రటరీ,
                                                                టెక్నికల్, ఇరిగేషన్ శాఖ

 

చెరువులు, కుంటల విస్తీర్ణం తగ్గిపోయింది

చెరువుల స్థితిగతులను తెలుసుకోవడానికి వెళ్లిన సమయంలో అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. కొందరు స్థానికంగా ఉన్న నాయకుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ సమయంలో తమకు రాచకొండ, సైబరాబాద్ కమిషనర్‌ల నుంచి సాయం అందుతోంది. ఏ విధమైన సాయం చేయడానికి ఇద్దరు కమిషనర్‌లు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం తాము తిరిగిన చెరువు చుట్టుపక్కల చాలా ప్రాంతాలు కబ్జాకు గురయ్యాయి. ఎక్కడ చెరువు ప్రారంభం అయ్యింది, ఎక్కడ ఆగిపోతుందన్న దానిని కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నాం. పేపర్‌లో ఉన్న దానికి ఫీల్డ్ మీదకు వెళ్లి చూస్తే చెరువులు, కుంటల విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం జిహెచ్‌ఎంసి పరిధిలోని చెరువులపై నివేదిక తయారుచేస్తున్నాం.
                                                           – ఎంఎ. అమీద్‌ఖాన్, సీఈ, మైనర్ ఇరిగేషన్, కృష్ణాబేసిన్

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News